Hyderabad : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ 'ఓల్డ్ సిటీ ఆఫ్ హైదరాబాద్ డిక్లరేషన్' సిద్ధం చేసింది. నగరంలోని పాతబస్తీ వాసులు ఎదుర్కొంటున్న సవాళ్లను గుర్తించే ప్రక్రియను కాంగ్రెస్ ఇప్పటికే ప్రారంభించింది. ఇందులో ఇక్కడి ప్రజల సమస్యలు, వాటిని పరిష్కారానికి చేపట్టే చర్యల వంటి అనేక విషయాలు ఉంటాయని కాంగ్రెస్ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
Old City of Hyderabad Declaration: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ పాతబస్తీకి సంబంధించిన డిక్లరేషన్ కోసం కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు ప్రారంభించింది. పాతబస్తీ వాసులు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడమే ఈ డిక్లరేషన్ ఉద్దేశంగా సంబంధిత వర్గాలు తెలిపాయి. హైదరాబాద్ పాతబస్తీ వాసులు ఎదుర్కొంటున్న సవాళ్లను గుర్తించే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించామని హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సమీర్ వలీవుల్లా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల జీవన ప్రమాణాలు, ఎదుర్కొంటున్న సవాళ్లను అర్థం చేసుకోవడానికి ఇటీవల నిర్వహించిన సర్వేలను సమీక్షిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చాల్సిన అంశాలుతో పాటు ఇక్కడి ప్రజల సమస్యలకు సుస్థిర పరిష్కారాలను సృష్టించడానికి స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తలతో కలిసి పనిచేయాలని ఉద్దేశాలను తెలియజేశారు. ఫలితాలను, ప్రతిపాదిత పరిష్కారాలను రాష్ట్ర నాయకత్వంతో పంచుకుని ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరుస్తారని తెలిపారు. రైతులు, యువత, మహిళల కోసం రూపొందించిన తరహాలో హైదరాబాద్ పాతబస్తీకి ప్రత్యేక డిక్లరేషన్ రూపొందించాలని వలీవుల్లా ఆకాంక్షించారు. ఎన్జీవోలు ఇటీవల నిర్వహించిన సర్వేల నుంచి భయానక గణాంకాలను సమర్పించడం ద్వారా పరిస్థితి తీవ్రతను నొక్కిచెప్పారు.
ముస్లింల జీవన స్థితిగతులను ఎత్తిచూపిన సర్వేలు..
ముఖ్యంగా నగరంలోని మురికివాడల్లో నివసిస్తున్న ముస్లిం సమాజానికి పేదరికం పెను సవాలుగా మారిందని సర్వేలు చెబుతున్నాయి. ఓల్డ్ సిటీలోని 5.8 మిలియన్ల నివాసితులలో సుమారు అరవై శాతం మంది మురికివాడల్లో నివసిస్తున్నారు. వీరిలో డెబ్భై నాలుగు శాతం మంది అద్దెదారులు కాగా, కేవలం ఇరవై ఆరు శాతం మంది మాత్రమే తమ నివాసాలను కలిగి ఉన్నారు. 38 శాతం కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు లేకపోవడం, ముప్పై ఏడు శాతం కుటుంబాల్లో మహిళలే ఏకైక జీవనోపాధిగా ఉండటం గమనార్హం. దాదాపు పదిహేను శాతం మంది పిల్లలు ఐదో తరగతి నుంచి పదోతరగతి వరకు చదువును నిలిపివేయడంతో విద్యా పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది. రాష్ట్రంలోని మొత్తం దీర్ఘకాలిక వ్యాధుల్లో 33 శాతం హైదరాబాద్ నుంచే వస్తున్నాయనీ, వీటిలో యాభై శాతానికి పైగా కేసులు పాతబస్తీలోనే నమోదవుతున్నాయని తెలిపారు.
అరవై ఐదు శాతం కుటుంబాలు అప్పుల ఊబిలో..
అరవై ఐదు శాతం కుటుంబాలు అప్పులు, అధిక వడ్డీ రేట్లతో సతమతమవుతుండటంతో ఈ ప్రాంతాన్ని ఆర్థిక ఇబ్బందులు పట్టి పీడిస్తున్నాయి. ఆహారం, వైద్యం వంటి నిత్యావసరాల కోసం ప్రైవేటు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్నారు. ఈ రుణదాతలు విధించే వడ్డీ రేట్లు పది నుండి ఇరవై ఒక్క శాతం వరకు ఉంటాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి. పాతబస్తీలో పేదరికంతో పాటు మద్యపానం ప్రధాన సమస్యగా మారింది. ఇది కొన్ని ప్రాంతాలలో వైవాహిక విభేదాల పెరుగుదలకు కారణంగా ఉంది. మరికొద్ది నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో "తెలంగాణ ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా పాతబస్తీ పరిస్థితి ఎందుకు వెనుకబడి ఉంది?' అనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. వైన్ షాపుల ఏర్పాటుకు విచక్షణారహితంగా అనుమతిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం మద్యపానాన్ని ప్రోత్సహిస్తోందని" సమీర్ వలీవుల్లా విమర్శించారు.