రైతు బంధు నిధులు ఇంకా అందరికి పడలేవు. 40 శాతం మంది రైతులకు మాత్రమే రైతు బంధు నిధులు పంపిణీ చేసినట్టు అధికారులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు తెలిపారు. శనివారం మంత్రి రైతు బంధు నిధుల విడుదలపై సమీక్ష నిర్వహించారు.
Rythu Bharosa: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు నిధులను విడుదల చేస్తున్నది. ఇప్పటి వరకు 27 లక్షల మంది రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయంగా రైతు బంధు నిధులను జమ చేసినట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెల్లడించింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలోని 40 శాతం మంది రైతులకు రైతు బంధు డబ్బులు విడుదల చేసినట్టు అధికారులు ఆయనకు తెలిపారు.
వరి పంట, ఇతర పంటలకు విత్తన ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్నదని, కాబట్టి, రైతు బంధు నిధుల పంపిణీ వేగవంతం చేయాలని అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారు. అంతేకాదు, రైతు బంధు నిధుల పంపిణీ ప్రతి రోజూ జరగాలని పేర్కొన్నారు. వచ్చే సోమవారం నుంచి ఎక్కువ మంది రైతులకు రైతు బంధు నిధులు విడుదల కావాలని సూచించారు. తదుపరి సమీక్ష సంక్రాంతి తర్వాత జరగనుంది. అప్పటి వరకు ఈ నిధులు విడుదల అవుతూనే ఉంటాయి.
Also Read: Train: చలి కాచుకోవడానికి నడిచే ట్రైన్‌లోనే మంట పెట్టిన ఘనులు.. చివరకు ఏం జరిగిందంటే?
రైతుల సంక్షేమం, సాగు రంగం రాష్ట్ర ప్రభుత్వం చాలా ముఖ్యమైనవని, ఆర్థికంగా సంక్లిష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ రైతు బంధు నిధులు అందరికీ అందజేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని మంత్రి వివరించారు. రెగ్యులర్‌గా, నిర్ణీత కాల వ్యవధిలోనే రైతు బంధు డబ్బులు విడుదల చేయాలని ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 11వ తేదీ నుంచి రైతు బంధు నిధులను పంపిణీ చేస్తున్నది. రైతు బంధు పథకం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీగా రైతు భరోసాను ప్రకటించింది. రైతు భరోసా కింద ఏటా ఎకరాకు రూ. 15 వేల పెట్టుబడి సాయం అందిస్తామని పేర్కొంది.