Agnipath: అగ్నిప‌థ్ ఆందోళ‌న‌కారుల‌పై కేసులను వెనక్కి తీసుకోవాలి.. వారికి కాంగ్రెస్ న్యాయ స‌హాయం: రేవంత్ రెడ్డి

By Mahesh RajamoniFirst Published Jun 24, 2022, 4:18 PM IST
Highlights

Agnipath protestors: అగ్నిపథ్ ఆందోళనకారులకు తెలంగాణ కాంగ్రెస్ న్యాయ సహాయం అందిస్తుంద‌ని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ రెవంత్ రెడ్డి వెల్ల‌డించారు. ఆందోళనకారులపై పెట్టిన కేసులను కేంద్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.
 

Telangana Congress chief A Revanth Reddy: అగ్నిపథ్ నిరసనల్లో పాల్గొని కేసుల్లో నమోదైన ఆర్మీ అభ్యర్థులకు న్యాయ సహాయం చేస్తామని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఏ రేవంత్ రెడ్డి శుక్రవారం అన్నారు. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని అగ్నిపథ్ పథకాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. చంచల్‌గూడ జైలులో ఉన్న సికింద్రాబాద్‌ స్టేషన్‌లో నిర‌స‌న‌లు నిర్వ‌హించిన ఆందోళ‌న‌కారుల‌ను కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌ల‌తో క‌లిసి ప‌రామ‌ర్శించారు.  జైల్లో ఉన్న ఆందోళనకారుల‌ను క‌లిసిన అనంత‌రం విలేకరుల సమావేశంలో  మాట్లాడుతూ.. వారికి లీగ‌ల్ హెల్ప్ చేస్తామ‌ని తెలిపారు. ఫిట్‌నెస్‌, మెడికల్‌ పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు తప్పనిసరిగా వ్రాతపరీక్షలు నిర్వహించి వారిని నియమించాలని డిమాండ్‌ చేశారు. ఆందోళనకారులపై పెట్టిన కేసులను కేంద్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

“సైన్యంలో చేరాల‌నుకునే వారిలో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందినవారే. రిమాండ్‌లో ఉన్న ఈ పిల్లల తల్లిదండ్రులకు వారి ఆచూకీ గురించి తెలియదు. భవిష్యత్తులో ఎవరికీ ఉద్యోగం రాకుండా ఉండేందుకు వారిపై హత్యాయత్నం, ఇతర నాన్ బెయిలబుల్ కేసులు కూడా పెట్టారు. తాము ఎలాంటి విధ్వంసానికి పాల్పడలేదని పిల్లలు చెప్పారు' అని రేవంత్ రెడ్డి మీడియాతో అన్నారు. ఆందోళనకారులపై కేసుల విషయంలో టీఆర్ఎస్, రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుపై రేవంత్ విమ‌ర్శ‌ల‌తో  విరుచుకుపడ్డారు. “సికింద్రాబాద్ నిరసనకారుడు డి రాకేష్ మరణంపై టీఆర్ఎస్ మొసలి కన్నీరు కార్చింది.. అయితే ఈ ఆర్మీ ఆశావహులపై జైల్లో కేసులు పెట్టింది. ఈ అంశంపై టీఆర్‌ఎస్ మాట్లాడ‌టం లేదు.. కానీ రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు.

ప్రతి ఏటా ఆర్మీలో 70 వేల మందిని పాత పద్దతిలో రిక్రూట్ మెంట్ చేసే వారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. చట్టాలు, శాసనాలను పక్కన పెట్టి అగ్నిపథ్ ను అమలు చేస్తామంటే ఎలా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. యువతను అడ్డాకూలీలుగా మార్చారని ఆయన విమర్శించారు.కేంద్రంలోని బీజేపీ సర్కార్ అనాలోచిత నిర్ణయాలతో యువత  జీవితాన్ని ఫణంగా పెట్టొద్దని ఆయన కోరారు. కరోనా వల్ల రెండేళ్లుగా నియామకాల్లేవని  రేవంత్ రెడ్డి చెప్పారు.  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసానికి పాల్పడిన వారిపై ఐఎస్ఐ తీవ్రవాదులపై పెట్టిన కేసులు పెట్టారని  రేవంత్ రెడ్డి ఆరోపించారు.  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసం కేసుకు సంబంధించి  అరెస్టైన వారిలో మెజారిటీ పిల్లల పేరేంట్స్ కు  సమాచారం తెలియదన్నారు. కరోనాతో రెండేళ్లుగా ఆర్మీలో రిక్రూట్ మెంట్స్ చేయలేదని రేవంత్ రెడ్డి చెప్పారు. 

జూన్ 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో అగ్నిపథ్ స్కీమ్‌కు వ్యతిరేకంగా నిర‌స‌న‌లు జ‌రిగాయి. ఈ ఆందోళ‌న‌లు హింసాత్మ‌కంగా మార‌డంతో పోలీసులు కాల్పులు జ‌రిపారు. నిరసన కార్యక్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, మరో 12 మంది గాయపడ్డారు. అయితే, ఈ నిర‌స‌న‌ల వెనుక కోచింగ్ సెంట‌ర్ల  హ‌స్తం ఉంద‌ని గుర్తించిన పోలీసులు.. ప‌లువురు కోచింగ్ సెంట‌ర్లకు చెందిన వారిని అదుపులోకి తీసుక‌న్నారు. అలాగే, సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్ లో హింసాత్మ‌క చ‌ర్య‌లకు పాల్ప‌డుతూ.. ప్ర‌భుత్వ ఆస్తుల‌ను ధ్వంసం చేసిన ప‌లువురు నిర‌స‌న‌కారుల‌ను సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని చంచ‌ల్ గూడ జైలుకు త‌ర‌లించారు.  
 

click me!