సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అగ్నిపథ్ స్కీం కు వ్యతిరేకంగా చెలరేగిన విధ్వంసకాండ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ సహా ఇతర ముఖ్య రైల్వే స్టేషన్లలో హై అలర్ట్ ప్రకటించారు.
హైదరాబాద్ : అగ్నిపథ్ ను నిరసిస్తూ యువకులు ఆందోళనతో సికింద్రాబాద్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపత్యంలో రాష్ట్రంలోని పలు రైల్వే స్టేషన్లలో హై అలర్ట్ ప్రకటించారు. ప్రధానమైన స్టేషన్లలో రైల్వే పోలీసులు భద్రత పెంచారు. రైల్వే పరిధిలోని ఆర్పీఎఫ్, జీఆర్పీ నుంచి అదనపు బలగాలను రప్పించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వెళ్లే పలు మార్గాలను పోలీసులు మూసివేశారు. ముందు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకున్నారు.
మరోవైపు విజయవాడ రైల్వేస్టేషన్ లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. అదనపు బలగాలను మోహరించి ఎప్పటికప్పుడు పరిస్థితిని పోలీసు ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఎవరూ గుడిగూడకుండా చర్యలు చేపట్టారు. గుంటూరు, నరసరావుపేట, బాపట్ల రైల్వే స్టేషన్లలో అదనపు బలగాలను ఏర్పాటు చేశారు. ముందుజాగ్రత్తగా స్టేషన్ల వద్ద మోహరించారు.
undefined
కాగా, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో ఈ ఉదయం యువత మెరుపు ఆందోళనతో దాడికి దిగారు. దీంతో రైల్వే స్టేషన్ అట్టుడికిపోయింది. ఒక్కసారిగా ఆందోళనకారులు రైళ్ళపై రాళ్లదాడికి దిగారు. పార్శిల్స్ మూటలను పట్టాలపై వేసి నిప్పంటించారు. అలాగే కొన్ని బోగీలకు నిప్పంటించడంతో పాటు ప్లాట్ ఫాంపై విధ్వంసం సృష్టించారు. ఈ ఆందోళనతో అప్రమత్తమైన పోలీసులు రైల్వే స్టేషన్ కు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కాల్పుల్లో ఓ వ్యక్తి మరణించినట్టు తెలుస్తోంది. ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు సాయంత్రానికి కానీ తెలియరాదు. ఆందోళన కారులతో పోలీసు ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నారు.
Agnipath Row : అట్టుడుకిన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్... రైళ్లపై రాళ్లదాడి, బోగీలకు నిప్పు (Photos)
ఇదిలా ఉండగా, ఈ రోజు ఉదయం కొత్త మిలటరీ రిక్రూట్‌మెంట్ పాలసీ అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లాలో ఈ ఉదయం ఒక గుంపు రైల్వేస్టేషన్ మీద దాడికి దిగింది. రైల్వే స్టేషన్ లోని షాపులను, రైళ్లను కర్రలతో ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని చెదరగొట్టడానికి రంగంలోకి దిగేసమయానికే చాలా మేరకు రైల్వే స్టేషన్ ఆస్తులను ఈ నిరసనకారులు ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సకాలంలో చర్యలు తీసుకుని.. నిరసనలను కంట్రోల్ లోకి తీసుకువచ్చారు. దాడికి పాల్పడిన వారిని గుర్తించే దిశగా చర్యలు చేపట్టారు.
ఇక, అగ్నిపథ్ రిక్రూట్మెంట్ స్కీమ్ కు వ్యతిరేకంగా మీద దేశవ్యాప్తంగా చెలరేగుతులున్న నిరసనలు, హింసాత్మక ఘటనల మీద తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ స్పందించారు. ఈ నిరసనలు దేశంలోని నిరుద్యోగ సంక్షోభాన్ని కళ్లకు కడుతున్నాయన్నారు. నిరుద్యుగం ఎంత తీవ్రంగా ఉందో ఈ ఘటనలు తెలుపుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వంపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వం మొదట రైతులతో ఆటలాడుకుందని.. ఇప్పుడు సైనికులతో ఆడుకుంటోందని తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. వన్ ర్యాంక్-వన్ పెన్షన్ నుండి ప్రతిపాదిత నో ర్యాంక్ - నో పెన్షన్ వరకు.. నిరుద్యోగులను.. సైనికులను మోసం చేస్తోందని దుయ్యబట్టారు.