Agnipath Protest in Secunderabad: వెలుగులోకి కొత్త విషయాలు.. వాట్సాప్ గ్రూప్‌ల వేదికగానే ప్లాన్..!

Published : Jun 18, 2022, 09:41 AM IST
Agnipath Protest in Secunderabad: వెలుగులోకి కొత్త విషయాలు.. వాట్సాప్ గ్రూప్‌ల వేదికగానే ప్లాన్..!

సారాంశం

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు భారీగా తరలివచ్చిన యువకులు ఆందోళనకు దిగడం రణరంగాన్ని తలపించింది. ఈ విధ్వంస ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే ఈ క్రమంలోనే కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. 

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు భారీగా తరలివచ్చిన యువకులు ఆందోళనకు దిగడం రణరంగాన్ని తలపించింది. రైళ్ల బోగీలకు నిప్పుపెట్టడం, రాళ్ల దాడికి దిగిన ఆందోళనకారులు విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ క్రమంలోనే పోలీసులు జరిపిన కాల్పుల్లో వరంగల్ జిల్లాకు చెందిన దామెర రాకేష్ మరణించగా.. పలువురు గాయపడ్డారు. అయితే ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో విధ్వంసానికి పాల్పడిన వారిలో కొందరిని గుర్తించిన పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

అయితే ఈ క్రమంలోనే కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. వాట్సాప్ గ్రూప్‌ల వేదికగానే సికింద్రాబాద్ వద్ద నిరసన తెలిపేందుకు చాటింగ్‌లు జరిగినట్టుగా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలిందని పలు న్యూస్ చానల్స్ కథనాలు ప్రసారం చేస్తున్నాయి. ఈ నిరసనల్లో పాల్గొన్నవారిలో పలువురు.. హైదరాబాద్, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోని ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ కోసం కోచింగ్ పొందారు. ఆ సమయంలో వీరు కొన్ని వాట్సాప్ గ్రూప్‌లు ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో ఆర్మీ రిక్రూట్‌మెంట్ గురించిన సమాచారం, ప్రిపరేషన్‌ టిప్స్ షేర్ చేసుకునేవారు. 

అయితే మూడు రోజుల క్రితం అగ్నిపథ్ స్కీమ్ ప్రకటన వెలువడగానే.. ఒక్కసారి ఈ వాట్సాప్‌ గ్రూప్‌లు యాక్టివ్‌ అయ్యాయి. అగ్నిపథ్ స్కీమ్‌ గురించి వాట్స్‌ప్‌ గ్రూప్‌లలో తీవ్ర చర్చ సాగింది. అగ్నిపథ్ స్కీమ్ వల్ల ఆర్మీ తమ కేరీర్ అవకాశాలు దెబ్బతింటాయని వారు భావించారు. ఈ క్రమంలోనే దేశంలోని ఇతర ప్రాంతాల్లో అగ్నిపథ్‌ స్కీమ్‌కు వ్యతిరేకంగా నిరసనల గురించి తెలియడంతో.. సికింద్రాబాద్‌ వద్ద కూడా నిరసన తెలియజేయాలని వారు వాట్సాప్ గ్రూప్‌ ద్వారా మెసేజ్‌లు, ఆడియో క్లిప్స్ షేర్ చేసుకున్నారు. 

ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం నుంచే సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్ వద్దకు పలువురు యువకులు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం పెద్ద ఎత్తున తరలివచ్చిన యువకులు తొలుత రైల్వే స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. ఆ తర్వాత  రైల్వే స్టేషన్‌లోకి ప్రవేశించి రైళ్లకు నిప్పుపెట్టి, స్టేషన్‌లోని రైళ్లు, ఇతర ఆస్తులను ధ్వంసం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి విచారణ చేపట్టిన పోలీసులు.. అదుపులోకి తీసుకున్న యువకులు వాట్సాప్ సందేశాలను పరిశీలిస్తున్నారు. 

మరోవైపు సికింద్రాబాద్ స్టేషన్ ఘటనపై రైల్వే పోలీసులు ప్రకటన విడుదల చేశారు. ఉదయం 9 గంటలకు స్టేషన్‌లోకి దాదాపు 300 మంది ఆందోళనకారులు ప్రవేశించినట్లు తెలిపారు. సాధారణ ప్యాసింజర్ల మాదిరిగా గేట్ నెం.3 నుంచి ఆందోళనకారులు వచ్చినట్లు వెల్లడించారు. స్టేషన్‌లోకి వచ్చీ రాగానే అగ్నిపథ్ స్కీంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారని... కర్రలు, రాడ్లతో ఆ వెంటనే 2 వేల మంది ఆందోళనకారులు స్టేషన్‌లోకి ప్రవేశించారని పోలీసులు పేర్కొన్నారు. రైళ్లపై దాడి చేసి సామాగ్రిని ధ్వంసం చేశారని.. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు యత్నించినట్లు తెలిపారు. 

రైల్వే ట్రాక్‌పై వున్న రాళ్లతో పోలీసులపై నిరసనకారులు దాడులు చేశారని.. మొత్తం 8 రైళ్లపై దాడులకు తెగబడ్డారని వెల్లడించారు. పోలీసు బలగాలు రాగానే ట్రాక్‌పైకి ఆందోళనకారులు పరుగులు తీశారని.. ఆ వెంటనే భద్రతా సిబ్బందిపై రాళ్ల వర్షం కురిపించారని వారు తెలిపారు. రాళ్ల దాడిలో ఏడుగురు పోలీసులకు గాయాలయ్యాయని చెప్పారు. కాల్పుల్లో రాకేష్ అనే యువకుడు మృతి చెందాడని.. మరో 12 మంది గాయపడ్డారని పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు రైల్వే స్టేషన్‌లో రూ.20 కోట్లు ఆస్తినష్టం సంభించినట్లు ప్రకటించారు. 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్