మరో అల్పపీడనం ముప్పు: హైదరాబాదులో మళ్లీ వర్షాలు

By telugu teamFirst Published Oct 17, 2020, 5:37 PM IST
Highlights

భారీ వర్షాలతో ఇప్పటికే అతలాకుతలమైన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో శనివారం సాయంత్రం మళ్లీ వర్షాలు ప్రారంభమయ్యాయి. పలు ప్రాంతాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి.

హైదరాబాద్: ఇప్పటికే వరదలతో అతలాకుతలమైన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో శనివారం సాయంత్రం మళ్లీ వర్షాలు ప్రారంభమయ్యాయి. హైదరాబాదులోని పలు ప్రాంతాల్లో వానలు పడుతున్నాయి. ఫిలింనగర్, బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, కొత్తపేట వంటి పలు ప్రాంతాల్లో సాయంత్రం భారీ వర్షం ప్రారంభమైంది.

అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. దీంతో వచ్చే రెండు రోజుల్లో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాదులో సాయంత్రం ఆకాశం దట్టంగా మేఘావృతమై వర్షాలు పడుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. దిల్ షుక్ నగర్, మలక్ పేట, ఎల్బీ నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.

గత మూడు రోజులు వాన తెరిపి ఇచ్చినప్పటికీ హైదరాబాదులోని పలు కాలనీలు వరదలోనే చిక్కుకుని ఉన్నాయి. నిత్యావసర సరుకులకు కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల నీరు వెళ్లిపోయినప్పటికీ బురద చేరి ఉంది. హైదరాబాదులో వర్షాలకు 15 మందికి పైగా మృత్యువాత పడ్డారు. 

ఇదిలావుంటే, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో రేపు, ఎల్లుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇంద్ర కీలాద్రిపై వర్షం పడుతోంది. టెంట్ల నుంచి నీరు కారుతుండడంతో క్యూలైన్లలో నీరు వచ్చి చేరుతోంది. దాంతో భక్తలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 

click me!