
Telangana Local Body Elections : తెలంగాణ రాజకీయాలను జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితం టర్న్ చేసేలా కనిపిస్తోంది. ఇప్పటివరకు తమ పాలనపై ప్రజల్లో ఏ అభిప్రాయం ఉందో తెలియక కాంగ్రెస్ నాయకులు సతమతం అయ్యారు... జూబ్లీహిల్స్ ఎన్నికతో ఓ క్లారిటీ వచ్చింది. దీంతో ఇకపై మరింత దూకూడుగా ప్రజల్లోకి వెళ్లాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం.
తెలంగాణలో ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్దమయ్యింది. అయితే బిసి రిజర్వేషన్ పెంపుపై న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తాయి. దీంతో నోటిఫికేషన్ విడుదలై అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ కొనసాగే సమయంలో ఎన్నికలు నిలిచిపోయాయి. దీనిపై న్యాయస్థానాల్లో పోరాడుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం.
అయితే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక గెలపు ఊపులోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తోందట. రిజర్వేషన్ల విషయంలో ఎవరినీ నొప్పించకుండా... న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా ఎన్నికలకు వెళ్లాలని భావిస్తోందట కాంగ్రెస్. ఇందుకోసం ఇప్పటికే అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసినట్లు సమాచారం.
నెలాఖరులో స్థానిక సంస్థల ఎన్నికలు?
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ నవంబర్ చివర్లో లేదంటే డిసెంబర్ ఆరంభంలో వచ్చే అవకాశాలున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో గ్రామాల్లో మరోసారి పొలిటికల్ హీట్ పెరగనుంది.