పార్టీ మార్పు విషయమై ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు స్పష్టత ఇచ్చారు.
హైదరాబాద్: పార్టీ మార్పు విషయమై ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు స్పష్టత ఇచ్చారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కూడా తాను తన కొడుకు పెళ్లి పత్రిక ఆహ్వాన పత్రిక ఇస్తానన్నారు. సోయం బాపూరావు రేవంత్ రెడ్డి సమావేశమైనట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం సాగింది. దీనిపై సోయం బాపూరావు స్పందించారు.తన కొడుకు పెళ్లికి సంబంధించి ఆహ్వాన పత్రిక ఇచ్చేందుకు తాను రేవంత్ రెడ్డిని కలవనున్నట్టుగా చెప్పారు. రేవంత్ రెడ్డితో పాటు కేసీఆర్ ను కూడా కలవనున్నట్టుగా ఆయన వివరించారు.
కర్ణాటకలో బీజేపీ ఓటమి పాలైనా ఓట్ల శాతం తగ్గలేదన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే దేశమంతా గెలిచినట్టు కాదన్నారు. కాంగ్రెస్ లో చేరుతున్నట్టుగా సాగుతున్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెంిన ఏలేటి మహేశ్వర్ రెడ్డిని తాను బీజేపీలోకి ఆహ్వానించినట్టుగా చెప్పారు. మహేశ్వర్ రెడ్డితో తనకు ఎలాంటి విబేధాలు లేవన్నారు.ఈ నెల 27న తన కొడుకు వివాహం ఉన్నట్టుగా సోయం బాపూరావు చెప్పారు. ఈ కారణంగానే అన్ని పార్టీల నేతలను కలుస్తున్నట్టుగా బాపూరావు తెలిపారు.
2019 ఎంపీ ఎన్నికల్లో ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం నుండి సోయం బాపూరావు బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. 2019 ఎంపీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుండి కాంగ్రెస్ మూడు స్థానాల్లో విజయం సాధిస్తే, బీజేపీ నాలుగు స్థానాల్లో విజయం సాధించింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో జోష్ ను నింపింది
ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అధికారాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుంది. తెలంగాణ కాంగ్రెస్ కు సునీల్ కనుగోలు వ్యూహాకర్తగా పనిచేస్తున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ కు సునీల్ కనుగోలు ఎన్నికల వ్యూహాకర్తగా పనిచేసిన విషయం తెలిసిందే. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారం దక్కించుకుంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో కాంగ్రెస్ నేతలు ఇతర పార్టీల్లోని అసంతృప్తులతో చర్చలు జరుపుతున్నారని సమాచారం. ఈ తరుణంలోనే సోయం బాపూరావు కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విషయమై బాపూరావు స్పష్టత ఇచ్చారు