43 నియోజకవర్గాల్లో వైఎస్సార్‌టీపీ ప్రభావం: పొత్తులు, విలీనంపై వైఎస్ షర్మిల రియాక్షన్ ఇదే..

Published : May 16, 2023, 03:32 PM IST
43 నియోజకవర్గాల్లో వైఎస్సార్‌టీపీ ప్రభావం: పొత్తులు, విలీనంపై వైఎస్ షర్మిల రియాక్షన్ ఇదే..

సారాంశం

కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్‌టీపీ విలీనం అవుతుందని లేదా పొత్తు పొట్టుకుందని జరుగుతున్న ప్రచారంపై వైఎస్ షర్మిల ఈరోజు స్పందించారు.

హైదరాబాద్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్‌టీపీ విలీనం అవుతుందని లేదా పొత్తు పొట్టుకుందని జరుగుతున్న ప్రచారంపై వైఎస్ షర్మిల ఈరోజు స్పందించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తమకు  అన్ని పార్టీల నుంచి మిస్ డ్ కాల్స్ వస్తున్నాయని.. ఆ వివరాలు తర్వాత వెల్లడిస్తానని అన్నారు. ప్రస్తుతం తాము చార్జింగ్ మోడ్ లో ఉన్నామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని అనుకుంటే తాను ఎందుకు పార్టీ పెడతానని ప్రశ్నించారు. తాను వస్తానంటే ఏ పార్టీ కూడా వద్దని అని చెప్పదని అన్నారు. విలీనం చేయాలనుకుంటే పార్టీనే పెట్టనని అన్నారు. 3 వేల 800 కిలోమీటర్ల పాదయాత్ర చేయాల్సిన అవసరమే వచ్చేది కాదని చెప్పారు. 

వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేదల కోసం, నిరుద్యోగుల కోసం పోరాడే పార్టీ అని.. తాము ఎవరితోనూ పొత్తులు  పెట్టుకునే ఆలోచనలో లేమని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితే బాగోలేదని.. 19 మంది ఎమ్మెల్యేలే గెలిస్తే ప్రస్తుతం ఎంత మంది ఉన్నారని ప్రశ్నించారు. గెలిచినవారిని కాపాడుకునే సత్తా హస్తం పార్టీకి లేదని అన్నారు. ఢిల్లికి చెందిన ఓ సంస్థ చేసిన సర్వేలో తెలంగాణలో 43 నియోజకవర్గాల్లో వైఎస్సార్ తెలంగాణ పార్టీ ప్రభావం చూపిస్తుందని రిపోర్టులు వచ్చాయని చెప్పారు. అలాంటప్పుడు 10, 20, 30 సీట్ల కోసం పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. 

టీఎస్‌పీఎస్సీ పశ్నపత్రాల లీక్ ఐటీ శాఖ నిర్లక్ష్యమేనని షర్మిల ఆరోపించారు. ఇందుకు మంత్రి కేటీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ కుంభకోణంపై నేటికీ కేసీఆర్ స్పందించకపోవడం దుర్మార్గం అని అన్నారు. నిరుద్యోగుల బతుకులు ఆగమవుతున్నా.. మళ్లీ పేపర్లు లీక్ కావన్నా గ్యారెంటీ కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. పాత బోర్డుతోనే పరీక్షలు నిర్వహించి.. నిరుద్యోగులను మోసం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇవ్వనందుకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Christmas Holidays 2025 : ఒకటి రెండ్రోజులు కాదు... వచ్చే వారమంతా స్కూళ్ళకు సెలవులే..?
IMD Rain Alert : ఓవైపు చలి, మరోవైపు వర్షాలు... ఆ ప్రాంతాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త..!