గజ్వెల్ లో కేసీఆర్ కు పోటీగా రేవంత్... సిద్దమా మల్లారెడ్డి: అద్దంకి దయాకర్ సవాల్

By Arun Kumar PFirst Published Aug 26, 2021, 3:58 PM IST
Highlights

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి మల్లారెడ్డిపై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ విరుచుకుపడ్డారు. 

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి మల్లారెడ్డిపై కాంగ్రెస్ నాయకులు అద్దంకి దయాకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మల్లారెడ్డికి నిజంగానే దమ్మూ, ధైర్యం వుంటే మంత్రి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్నారు. లేదంటే సీఎం కేసీఆర్ తో అయినా రాజీనామా చేయించాలని సూచించారు. గజ్వెల్ లో కేసీఆర్ కు పోటీగా రేవంత్ నిలబడతారని... అప్పుడు ఎవరు గెలుస్తారో చూద్దాం అంటూ దయాకర్ సవాల్ విసిరారు.  

రాష్ట్ర రాజకీయ సంస్కృతిని ఈ టీఆర్ఎస్ నేతలు మార్చేస్తున్నారని ఆరోపించారు. మేం మంచిగా, మర్యాదగా మాట్లాడితే దద్దమ్మలకు అర్థం కావడంలేదు... అందుకే తాము కూడా కేసీఆర్ బాషలోని వారికి సమాధానం చెబుతున్నామని అద్దంకి దయాకర్ అన్నారు.

read more  రేపే రాజీనామా చేస్తా, నువ్వు రెడీయా: ప్రెస్‌మీట్‌లోనే తొడగొట్టి రేవంత్‌కు సవాల్ విసిరిన మంత్రి మల్లారెడ్డి

ఇదిలావుంటే రేవంత్ రెడ్డిపై మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. గురువారం యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు మంత్రి ఇంటిపై దాడికి దిగేందుకు ప్రయత్నించారు. అయితే ముందుగానే అప్రమత్తమైన పోలీసులు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకుని అరెస్ట్ చేశారు. మల్లారెడ్డి ఇంటిపై కోడిగుడ్లు, టమాటాలతో దాడికి యూత్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రయత్నించారు.

ఈ క్రమంలో పోలీసులతో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు గొడవకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాటలో ఓ పోలీసుకి స్వల్ప గాయాలయ్యాయి. యూత్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆందోళనలు చేసే అవకాశం ఉందని  భావించిన పోలీసులు మంత్రి మల్లారెడ్డి నివాసం ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇక రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రి మల్లారెడ్డిపై కరీంనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నాయకులు. కరీంనగర్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ నాయకులు మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డిపై ఫిర్యాదు చేశారు.
 

click me!