బీజేపీ గూటికి విజయశాంతి..?: అసలు కారణం ఇదే.....

By Nagaraju penumalaFirst Published Sep 27, 2019, 6:12 PM IST
Highlights

ఈ దసరా లేదా ఆ తర్వాత గానీ రాములమ్మ కాషాయి కండువా కప్పుకోనున్నారంటూ ప్రచారం జరుగుతుంది. రాములమ్మ చేరికపై బీజేపీ నేతలు సైతం ఉత్సాహంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి దెబ్బమీద దెబ్బ తగులుతూనే ఉంది. తెలంగాణలో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేసేందుకు బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలో పోటీపడుతున్నాయి. 

ముందస్తు ఎన్నికల్లో గెలిచిన దాదాపు 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆపార్టీకి గుడ్ బై చెప్పేసి టీఆర్ఎస్ గూటికి చేరిన సంగతి తెలిసిందే. అంతేకాదు కొందరు కీలక నేతలు సైతం పార్టీకి గుడ్ బై చెప్పేశారు. 

ఇకపోతే కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలుగా వ్యవహరించి వారిని ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా బీజేపీ తమ పార్టీలోకి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 

త్వరలోనే రాములమ్మ కాషాయి కండువా కప్పుకోనున్నట్లు ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. గతంలో కూడా రాములమ్మ బీజేపీలో చేరతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే తాను పార్టీని వీడటం లేదంటూ ఆమె ఆ ప్రచారాన్ని తిప్పికొట్టింది. 

అయితే ఇటీవల పార్టీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆమె కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పాలనే యోచనకు వచ్చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ నేతలు తనను అంతగా పట్టించుకోవడం లేదని ఆమె తన సన్నిహితుల వద్ద వాపోతున్నారట. 

 కాంగ్రెస్ పార్టీ సమావేశాలకు గానీ, కార్యక్రమాలకు గానీ తనను ఆహ్వానించడం లేదని వాపోతున్నారట. తన అవసరం లేనప్పుడు తనకు గుర్తింపు లేనిచోటు తాను ఉండటం ఎందుకని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇకపోతే రాహుల్ గాంధీతో అత్యంత సన్నిహితంగా ఉండే విజయశాంతి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా చేసినప్పటి నుంచి ముభావంగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. 

ఇకపోతే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కూడా భిన్నవాదనలు, ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా నేతలు వ్యవహరిస్తున్న తీరుపట్ల విజయశాంతి గుర్రుగా ఉన్నారట. అంతేకాదు ఉత్తమ్ పద్మావతిని హుజూర్ నగర్ అభ్యర్థిగా ఖరారు చేసే అంశంలో గానీ, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై జరిగిన సమావేశంలో గానీ తనను ఆహ్వానించకపోవడంతో విజయశాంతి గుర్రుగా ఉన్నారట. 

అంతేకాదు గాంధీభవన్ సాక్షిగా తనను బయటకు పంపేందుకు కుట్ర జరుగుతుందంటూ విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో కూడా చర్చించినట్లు ఆమె చెప్పుకొచ్చారు. 

మరోవైపు జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్ పార్టీపై సెటైర్లు వేశారు రాములమ్మ. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీని పొగడ్తలతో ముంచెత్తారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మోదీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే విజయశాంతి మాత్రం జై కొట్టారు. 

ఆర్టికల్ 370 రద్దు మంచి నిర్ణయమని రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు అంతా మోదీ నిర్ణయాన్ని అంగీకరించాల్సిందేనని చెప్పుకొచ్చారు. దేశభక్తి విషయంలో మోదీ తీసుకున్న నిర్ణయం అత్యుత్తమ నిర్ణయమని కొనియాడారు విజయశాంతి. 

ఈ పరిణామాలను సునిశితంగా గమనిస్తే ఆమె కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బీజేపీలో చేరేందుకు ఆమె బాటలు వేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాలో నటిస్తున్న నేపథ్యంలో ఆమె బిజీబిజీగా ఉన్నట్లు సమాచారం. 

ఈ దసరా లేదా ఆ తర్వాత గానీ రాములమ్మ కాషాయి కండువా కప్పుకోనున్నారంటూ ప్రచారం జరుగుతుంది. రాములమ్మ చేరికపై బీజేపీ నేతలు సైతం ఉత్సాహంగా ఉన్నట్లు తెలుస్తోంది.

సినీ గ్లామర్ తోపాటు అధికార టీఆర్ఎస్ పార్టీపై మాటల తూటాలతో విరుచుకుపడే విజయశాంతి పార్టీలోకి వస్తే మంచిదని తెలంగాణ బీజేపీ నేతలు భావిస్తున్నారు. సో విజయశాంతి బీజేపీలో చేరతారా లేక కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారా అనేది తెలియాలంటే దసరా వరకు వేచి చూడాల్సిందే. 

click me!