రవిప్రకాష్ అరెస్టుపై ఊహాగానాలు: ఎసీపీ వివరణ ఇదీ....

By telugu teamFirst Published Jun 10, 2019, 6:58 AM IST
Highlights

శివాజీ, రవిప్రకాశ్‌ మధ్య నడిచిన లావాదేవీలు, పాతతేదీలతో నకిలీపత్రాల సృష్టికి సంబంధించి పలు వివరాలను పోలీసులు సేకరించిన విషయం తెలిసిందే. చానల్‌ నుంచి నిధులను తన సొంత ఖాతాకు బదిలీ చేసిన విషయంలోనూ పోలీసుల వద్ద పక్కా ఆధారాలు ఉన్నట్లు తెలిసింది.

హైదరాబాద్: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ విచారణకు ఏ మాత్రం సహకరించడం లేదని సైబర్ క్రైమ్ ఏసీపీ శ్రీనివాస్ కుమార్ తెలిపారు. రవిప్రకాష్ ఫోర్జరీ చేసినట్లు సాంకేతిక ఆధారాలున్నాయని ఆయన చెప్పారు. మూడు రోజులుగా విచారిస్తున్నా రవిప్రకాష్ ఎలాంటి సమాధానం చెప్పలేదని తెలిపారు. 

అలంద మీడియా కేసులో అన్ని కోణాల్లో రవిప్రకాష్‌ను ప్రశ్నించామని, రవిప్రకాష్‌ సమాధానాలను రేపు కోర్టుకు సమర్పిస్తామని శ్రీనివాస్ చెప్పారు. కోర్టు ఉత్తర్వులను బట్టి రవిప్రకాష్‌ అరెస్ట్‌పై నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు

ఇప్పటికే టీవీ9కి సంబంధించి అటు హైదరాబాద్, ఇటు సైబరాబాద్‌ కమిషనరేట్ల పరిధుల్లో నమోదైన కేసుల్లో పోలీసులు పలు సాక్ష్యాలు సంపాదించారు. ఇప్పటికే ఫోర్జరీ కేసులో సంస్థ కార్యదర్శి సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు రవిప్రకాశ్‌ అంగీకరించిన నేపథ్యంలో పోలీసులు మిగిలిన కేసులపై దృష్టి సారించారు.

ఈ కేసులో శివాజీ, రవిప్రకాశ్‌ మధ్య నడిచిన లావాదేవీలు, పాతతేదీలతో నకిలీపత్రాల సృష్టికి సంబంధించి పలు వివరాలను పోలీసులు సేకరించిన విషయం తెలిసిందే. చానల్‌ నుంచి నిధులను తన సొంత ఖాతాకు బదిలీ చేసిన విషయంలోనూ పోలీసుల వద్ద పక్కా ఆధారాలు ఉన్నట్లు తెలిసింది. అదే సమయంలో బంజారాహిల్స్‌ పోలీసులు సేకరించిన ఆధారాలు కూడా కేసులో కీలకం కానున్నాయి. దాదాపు రూ.100 కోట్ల విలువ చేసే టీవీ9 లోగోను కేవలం రూ.99 వేలకు విక్రయించడంపైనా పోలీసుల సందేహాలు కొలిక్కి వస్తున్నట్లు సమాచారం. 

కేసులో మరో కీలక నిందితుడు సినీనటుడు శివాజీ తనకు మంచిమిత్రుడని రవిప్రకాష్ చెప్పినట్లు తెలుస్తోంది. అయితే అతన్ని ఎందుకు మోసం చేయాల్సి వచ్చిందనే ప్రశ్నకు మౌనం వహించినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో రవిప్రకాశ్‌ విచారణను సాంతం పోలీసులు వీడియోలో చిత్రీకరించారు.

click me!