కోట్ల ఆస్తులు కూటడబెట్టిన ఏసీపీ నర్సింహారెడ్డి అరెస్టు

By telugu teamFirst Published Sep 24, 2020, 9:24 AM IST
Highlights

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు మల్కాజిగిరి ఏసీపీ నర్సింహా రెడ్డిని అరెస్టు చేశారు. తనకేమీ కాదని, తన వెనక పెద్ద బాస్ ఉన్నారని చెబుకుంటూ వచ్చేవారని తెలుస్తోంది.

హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు మల్కాజిగిరి ఏసీపీ నర్సింహా రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆయనను కాసేపట్లో కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఏసీబీ అధికారులు బుధవారం పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. 

నర్సింహా రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా పెట్టుబడులు పెట్టినట్లు చెబుతున్నారు. తన మీద ఆరోపణలు వచ్చినా తనకేమీ కాదని తన వెనక బాస్ ఉన్నారని, ఆయనే తనకు గాడ్ ఫాదర్ అని నర్సింహా రెడ్డి చెబుకుంటూ వచ్చినట్లు తెలుస్తోంది. దానిపై తెలంగాణ పోలీసు బాస్ తీవ్రంగా పరిగణించి రహస్యంగా అంతర్గత విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. 

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విచారణను ఎదుర్కుంటున్న మల్కాజిగిరి ఏసీబీ వై. నర్సింహా రెడ్డి పెద్ద యెత్తున ఆస్తులు కూడబెట్టినట్లు తేలిన విషయం తెలిసిందే. దాదాపు 70 కోట్ల రూపాయల విలువ చేసే అస్తులను అతను కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు అంచనా వేశారు. బుధవారం నర్సింహారెడ్డి నివాసంలోనే కాకుండా బంధువులు, స్నేహితుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. 

ఏసీబీ అధికారుల బృందాలుగా విడిపోయిన హైదరాబాదులోని మహేంద్రహిల్స్ లో గల ఆయన నివాసంలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా సోదాలు నిర్వహించారు. వరంగల్, జనగామ, నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లో, ఏపీలోని అనంతపురంలో సోదాలు జరిగాయి. తెలంగాణ, ఏపీల్లోనే 25 ప్రాంతాల్లో ఏక కాలంలో సోదాలు జరిపారు. 

బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం వరకు నిర్వహించిన సోదాల్లో నర్సింహారెడ్డికి ఉన్న ఆస్తులను గుర్తించారు. 3 ఇళ్లు, 5 ఓపెన్ ప్లాట్లు, వాణిజ్య స్థలాలతో పాటు రూ. 5 కోట్ల విలువైన ఆస్తులు, బంగారు, వెండి ఆభరణాలు, నగదు ఉన్నట్లు తేలింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం అతని అస్తుల విలువల రూ.7.5 కోట్లు కాగా, మార్కెట్ విలువ ప్రకారం రూ.70 కోట్లు ఉంటుందని అంచనా వేశారు 

నర్సింహారెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు ఆయనకు రెండు బ్యాంక్ లాకర్లు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. నర్సింహారెడ్డి గతంలో మియాపూర్, ఉప్పల్, బేగంపేట ఇన్ స్పెక్టర్ గా, చిక్కడపల్లి డివిజన్ లో ఏసీపీగా పనిచేశారు అక్కడి నుంచి మల్కాజిగిరికి బదిలీ అయ్యారు. 

ఏసీబీ గుర్తించిన ఆస్తులు ఇవీ....

అనంతపురంలో 55 ఎకరాల వ్యవసాయ భూమి
సెబర్ టవర్స్ ఎదురుగా 1960 చదరపు గజాల 4 పాట్లు
రెండు చోట్ల ఇంటి స్థలాలు, రెండు ఇళ్లు
హఫీజ్ పేటలో జీ ప్లస్ 3 వాణిజ్య సముదాయాలు
రూ. 15 లక్షల నగదు
రెండు బ్యాంక్ లాకర్లు

click me!