ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసు: డైరెక్షన్ ఇవ్వటానికి మీరెవరు?.. సిట్ అధికారి గంగాధర్‌పై ఏసీబీ కోర్టు సీరియస్

By Sumanth KanukulaFirst Published Dec 2, 2022, 2:10 PM IST
Highlights

టీఆర్ఎస్‌కు ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసును విచారిస్తున్న సిట్ బృందంలోని అధికారిగా ఉన్న ఏసీపీ గంగాధర్‌పై ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

టీఆర్ఎస్‌కు ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసును విచారిస్తున్న సిట్ బృందంలోని అధికారిగా ఉన్న రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్‌పై ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో ముగ్గురు నిందితులు రామచంద్రభారతి, నందకుమార్‌, సింహయాజీలకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే నిందితుల బెయిల్ షూరిటీలో స్థానికులనే పరిగణలోకి తీసుకోవాలని.. సిట్ అధికారి గంగాధర్ మెమో ఇవ్వటంపై న్యాయమూర్తి మండిపడ్డారు. షూరిటీలపై డైరెక్షన్ ఇవ్వటానికి మీరెవరంటూ ప్రశ్నించారు. భేషరతుగా క్షమాపణలు చెప్పకుంటే. కోర్టు ధిక్కరణగా పరిగణిస్తామని హెచ్చరించారు. దీంతో ఏసీపీ గంగాధర్ మెమోను వెనక్కి తీసుకుని, కోర్టుకు క్షమాపణ చెప్పారు. 

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముగ్గురు నిందితులు నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజి వేర్వేరుగా దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. వారికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఒక్కొక్కరు రూ.3 లక్షల వ్యక్తిగత బాండ్‌‌ సమర్పించాలని.. అంతే మొత్తానికి రెండు షూరిటీలు సమర్పించాలని స్పష్టం చేసింది.  ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్‌‌ చార్జిషీట్‌‌ దాఖలు చేసేవరకు ప్రతి సోమవారం వారి ఎదుట విచారణకు హాజరుకావాలని హైకోర్టు స్పష్టం చేసింది. ముగ్గురు నిందితులు వారి పాస్‌పోర్టులను పోలీసు స్టేషన్‌లో సరెండర్ చేయాలని ఆదేశించింది. 

click me!