ప్రశ్నాపత్రం లీక్ కేసులో టీఎస్‌పీఎస్‌సీ చైర్మెన్ జనార్ధన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. ఈ డిమాండ్ తో ఆందోళనకు దిగారు.
హైదరాబాద్: ప్రశ్నాపత్రం లీక్ కేసులో బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరుతూ ఏబీవీపీ బుధవారంనాడు టీఎస్‌పీఎస్‌సీ ముట్టడికి ప్రయత్నించింది. పోలీసులు ఏబీవీపీ శ్రేణులను అడ్డుకున్నాయి. ఏబీవీపీ శ్రేణులు టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించాయి. ప్రశ్నాపత్రం లీకేజీకి బాధ్యుడిగా చేస్తూ టీఎస్‌పీఎస్‌సీ చైర్మెన్ రాజీనామా చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది.
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి అవసరమైన పరీక్షల నిర్వహణలో టీఎస్‌పీఎస్‌సీ విఫలమైందని ఏబీవీపీ ఆరోపించింది. టీఎస్‌పీఎస్ సీ నిర్వహించిన పరీక్షలను రద్దు చేసి మళ్లీ పరీక్షలను నిర్వహించాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయం గేటు ఎక్కి బోర్డు ను ధ్వంసం చేసేందుకు ఏబీవీపీ శ్రేణులు ప్రయత్నించాయి.
also read:టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్.. రంగంలోకి సిట్, ఎవరిని వదిలేది లేదన్న ఏఆర్ శ్రీనివాస్
మరో వైపు ఏబీవీపీతో పాటు ఆప్ శ్రేణులు, లెక్చరర్ల సంఘం నేతలు కూడా టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులతో ఆందోళనకారులు వాగ్వాదానికి దిగారు. పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో టీఎస్‌పీఎస్‌సీ వద్ద ఉద్రికత్త నెలకొంది.