హైదరాబాద్ లో 6లక్షల మందికి కరోనా

By telugu news teamFirst Published Aug 20, 2020, 9:44 AM IST
Highlights

 సుమారు 6.6 లక్షల మందిలో వైరస్‌ ఉంటుందని అంచనా వేశారు. వీరిలో ఇప్పటికే అధికశాతం మంది వైరస్‌ నుంచి కోలుకున్నారని, ప్రస్తుతం కొద్ది శాతం మాత్రమే యాక్టివ్‌ కేసులు ఉన్నాయని పరిశోధకులు పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో దాదాపు 6.6 లక్షల మందికి కరోనా వైరస్ సోకిందంటూ పరిశోధకులు చెబుతున్నారు. వారందరికీ కరోనా వచ్చి.. వెళ్లిపోయిందని పరిశోధకులు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో కోవిడ్‌ కేసుల సంఖ్యపై సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ), ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ) జరిపిన అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.

నగరంలోని మురుగునీటి శుద్ధి కేంద్రాల నుంచి మానవ వ్యర్థాలు, నీటి నమూనాలు సేకరించి విశ్లేషించారు. దాదాపు 2 లక్షల మందికి పైగా ఈ వైరస్‌ బారిన పడ్డట్టు గుర్తించారు. అయితే, నగర జనాభా ద్వారా విసర్జితమయ్యే మురుగులో 40 శాతం మాత్రమే శుద్ధి కేంద్రాలకు చేరుతోంది కాబట్టి.. మిగిలిన మురుగునూ లెక్కలోకి తీసుకుంటే సుమారు 6.6 లక్షల మందిలో వైరస్‌ ఉంటుందని అంచనా వేశారు. వీరిలో ఇప్పటికే అధికశాతం మంది వైరస్‌ నుంచి కోలుకున్నారని, ప్రస్తుతం కొద్ది శాతం మాత్రమే యాక్టివ్‌ కేసులు ఉన్నాయని పరిశోధకులు పేర్కొన్నారు.

ఇప్పటి వరకు తుమ్ము, దగ్గడం వల్లనే కరోనా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుందని అందరం భావించాం. అయితే.. మలమూత్ర విసర్జన ద్వారా కూడా వైరస్ వ్యాప్తి చెందుతుందని తాజా పరిశోధనలో తేలింది.

వైరస్‌ బారినపడ్డ తరువాత కనీసం 35 రోజుల వరకు వీరు వైరస్‌ అవశేషాలను వ్యర్థాల ద్వారా బయటకు వదులుతుంటారు. ఈ కారణంగానే సూక్ష్మజీవుల ద్వారా వచ్చే వ్యాధులు ఎంత మేరకు విస్తరించాయో తెలుసుకునేందుకు మురుగునీటి విశ్లేషణను ఒక మేలైన మార్గంగా నిపుణులు భావిస్తున్నారు. 

click me!