ఢిల్లీ లిక్కర్ స్కాం: అభిషేక్‌ రావు కస్టడీ రిపోర్ట్‌లో కీలక విషయాలు.. రూ. 3.80 కోట్ల లావాదేవీలపై సీబీఐ ఫోకస్

By Siva Kodati  |  First Published Oct 11, 2022, 4:50 PM IST

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయిన బోయినపల్లి అభిషేక్ రావు సీబీఐ కస్టడీ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. అభిషేక్ బోయినపల్లికి 3 అకౌంట్ల ద్వారా ఢిల్లీ పెద్దలు డబ్బులు పంపినట్లుగా సీబీఐ తేల్చింది. అయితే ఎవరెవరు డబ్బులు పంపారో అభిషేక్ చెప్పడం లేదని సీబీఐ పేర్కొంది.
 


ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయిన బోయినపల్లి అభిషేక్ రావు సీబీఐ కస్టడీ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అభిషేక్ రావుది కీలకపాత్ర అని తెలిపింది సీబీఐ. విజయ్ నాయర్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా బోయినపల్లి అభిషేక్ రావును అరెస్ట్ చేసిన సీబీఐ.. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌లలో లిక్కర్ స్కామ్‌పై మీటింగ్‌లు జరిగినట్లుగా తేల్చింది. సౌత్ లాబీ పేరుతో అభిషేక్ రావు లావాదేవీలు జరిపారని .. ఇండో స్పిరిట్ యజమాని సమీర్ మహేంద్రు, దినేశ్ అరోరాలతో కలిసి కుట్ర చేసినట్లు నిర్ధారించారు. అభిషేక్ , సమీర్ మహేంద్రుకు హవాలా రూపంలో డబ్బును ట్రాన్స్‌ఫర్ అయినట్లుగా సీబీఐ గుర్తించింది. ఈ మేరకు తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది. 

నవంబర్ 2001 నుంచి జూలై 2022 వరకు నిందితులు చాలా సార్లు భేటీ అయినట్లు సీబీఐ తెలిపింది. రూ.3.80 కోట్లను హవాలా ద్వారా బదిలీ అయినట్లుగా గుర్తించింది. అభిషేక్ బోయినపల్లికి 3 అకౌంట్ల ద్వారా ఢిల్లీ పెద్దలు డబ్బులు పంపినట్లుగా సీబీఐ తేల్చింది. అయితే ఎవరెవరు డబ్బులు పంపారో అభిషేక్ చెప్పడం లేదని సీబీఐ పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎవరెవరికి డబ్బులు ఇచ్చారనే విషయం అభిషేక్‌కే తెలుసునని సీబీఐ తెలిపినట్లుగా ఎన్టీవీ తన కథనంలో వెల్లడించింది. ప్రభుత్వ, రాజకీయ నేతల హస్తంపై అభిషేక్ నుంచి తెలుసుకోవాల్సి వుందని పేర్కొంది. 

Latest Videos

ALso Read:ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ దూకుడు: నేటి నుండి మూడు రోజులు అభిషేక్ రావు విచారణ

కాగా... ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో హైద్రాబాద్ కు చెందిన కంపెనీలకు సంబంధాలున్నాయని సీబీఐ అనుమానిస్తుంది. ఈ కేసులో ఇప్పటికే అరుణ్ రామచంద్రన్ పిళ్లైపై సీబీఐ కేసు  నమోదు చేసింది.ఈ కేసు ఆధారంగానే ఈడీ అధికారులు  హైద్రాబాద్ కేంద్రంలో నాలుగు దఫాలు సోదాలు నిర్వహించారు. హైద్రాబాద్ కు చెందిన బోయినపల్లి అభిషేక్ రావు రాబిన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి ఎల్ఎల్ సీ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.అభిషేక్ రావును విచారించేందుకు అనుమతివ్వాలని సీబీఐ అధికారులు నిన్న కోర్టును కోరారు. ఈ మేరకు కోర్టు అనుమతిని ఇచ్చింది.దీంతో  ఇవాళ్టి నుండి మూడు రోజుల పాటు అభిషేక్ రావును సీబీఐ అధికారులు విచారించనున్నారు. 

ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన సమయంలో అభిషేక్ రావు కీలకంగా వ్యవహరించారని సీబీఐ అధికారులు అనుమానిస్తున్నారని ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది. అభిషేక్ రావు వ్యాపార లావాదేవీలు, ఎక్కడెక్కడి నుండి అభిషేక్ కు నగదు వచ్చిందనే విషయాలను సీబీఐ అధికారులు దర్యాప్తు చేయనున్నారు. 
 

click me!