అభయ హస్తానికి పార్లమెంటు ఎన్నికల గండం ఎదురుకాబోతున్నదనే సంశయాలు వ్యక్తమవుతున్నాయి. దరఖాస్తుల పర్వాన్ని ఎన్నికల వరకు లాగి.. ఆ తర్వాత ఎలక్షన్ కోడ్‌ను సాకుగా చూపి అభయ హస్తం అమలు చేయరని అనిపిస్తున్నదని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు.
Harish Rao: తెలంగాణవ్యాప్తంగా ఇప్పుడు ప్రజా పాలన మేనియా ఉన్నది. ప్రతి పల్లెలో అభయ హస్తం దరఖాస్తుల గురించే మాట్లాడుతున్నారు. నాలుగు నెలలకు ఒకసారి ఈ ప్రజా పాలన కార్యక్రమం నిర్వహిస్తామని, ఇప్పుడు మిస్ అయినా.. తర్వాతైనా మళ్లీ అప్లై చేసుకోవచ్చని సూచనలు చేసినా ప్రజలు మాత్రం తగ్గేదే లే అంటున్నారు. వచ్చిన అవకాశాన్ని వదులుకుని మళ్లీ వస్తుందో రాదో అనే భయాలకు గురి కావడం ఎందుకు అని అనుకుంటున్నారు. దరఖాస్తులు చేస్తున్నాం గానీ.. లబ్దిదారులను ఎప్పుడు ఎంపిక చేస్తారు? ఎప్పుడు పథకాలు అమల్లోకి వస్తాయి? అనే సంశయాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చినట్టు హరీశ్ రావు గుర్తు చేశారు. మార్చి 17వ తేదీ నాటికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తవుతుంది. కానీ, ఇప్పుడు రాష్ట్రంలోని పరిస్థితులను చూస్తే.. దరఖాస్తుల పర్వాన్ని పార్లమెంటు ఎన్నికల కోడ్ వరకూ లాగేలా ఉన్నారని అనుమానించారు. ఆ తర్వాత ఎన్నికల కోడ్ సాకు చూపి హామీల అమలును జాప్యం చేస్తారేమోనని అనిపిస్తున్నదని అభిప్రాయపడ్డారు. ఫిబ్రవరిలో పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశాలు ఉన్నాయని వివరించారు. అసెంబ్లీలో బడ్జెట్ పెట్టకుండా ఓట్ ఆన్ అకౌంట్ పెట్టి దాటేస్తారేమోననీ ఆరోపించారు.
Also Read: Komatireddy Venkatreddy: నిన్న భట్టి.. నేడు రేవంత్ రెడ్డి! సలార్ పాటతో కోమటిరెడ్డి వరుస ట్వీట్లు
అసలు గైడ్ లైన్సే లేకుండా దరఖాస్తుల స్వీకరిస్తున్నారని, ముందుగానే గైడ్ లైన్స్ ఎందుకు విడుదల చేయాలని ప్రశ్నించారు. ఈ హామీలను ఎప్పుడు అమలు చేస్తారనే విషయంపై స్పష్టత లేదని అన్నారు. ఎన్నికల కోడ్ ఇబ్బంది రావొద్దంటే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఫిబ్రవరి మూడో వారంలోపు గైడ్‌లైన్స్ విడుదల చేసి ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయాలని తెలిపారు. కాబట్టి, పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడితే.. కోడ్ సవాల్‌ను ఎదుర్కోవచ్చని వివరించారు.