
ఆ యువకుడు ఓ బాలికను ప్రేమించాడు. పెళ్లి చేసుకొని జీవితాంతం కలిసి జీవిద్దాం అని నమ్మించాడు. దీంతో ఆ బాలిక నమ్మింది. అతడిని ప్రేమించింది. ఈ జంట రెండు సంవత్సరాలు ప్రేమించుకుంది. అయితే ఆ బాలికతో పెళ్లికి ఆ యువకుడి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో అతడు ఆ బాలికను ఎలాగైనా వదిలించుకోవాలని ప్లాన్ వేశాడు.
కలిసి బతకలేనప్పుడు కలిసి చనిపోవడమే మంచిదని ఆ బాలికను యవకుడు రెచ్చగొట్టాడు. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకొని చనిపోదామని చెప్పాడు. ‘నేను ఇప్పటికే పురుగుల మందు తాగాను, నేను లేకుండా నువ్వు జీవించడం ఎందుకు ? ’ అంటూ దొంగ కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీంతో అది నమ్మి ఆ మైనర్ దానిని తాగింది. దీంతో ఆమె చనిపోయింది. బాలికను వదిలించుకునేందుకు ఆ యువకుడు ఉద్దేశపూర్వకంగా ఇలా ఆత్మహత్యకు ప్రేరేపించాడు. ఈ ఘటన నల్లొండ జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటనకు సంబంధించి వివరాల ఇలా ఉన్నాయి. నల్గొండ జిల్లా నాగార్జునపేట తండాకు చెందిన దంపతులకు ఒక కూతురు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఈ దంపతులు తమ ముగ్గురు పిల్లల్ని వారి నాన్నమ్మ దగ్గర ఉంచి బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ లో పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. అప్పుడప్పుడు ఇంటికి వెళ్లి వస్తూ ఉంటారు.
వీరి కూతురు గ్రామానికి దగ్గర్లో ఉన్న ఓ స్కూల్ లో 8వ తరగతి చదువుతోంది. అక్కడే హాస్టల్ లో ఉంటోంది. ఇదే గ్రామానికి చెందిన బానావత్ వినోద్ అనే యువకుడు ఆ బాలిక చదివే ఊర్లోనే డిగ్రీ అభ్యసిస్తున్నాడు. అయితే ఈ బాలిక, ఆ యువకుడు రెండేళ్లుగా ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. అయితే ఆమెను పెళ్లి చేసుకుంటానని ఆ యువకుడు తన కుటుంబ సభ్యులకు చెపుతున్నాడు. కానీ వారు దీనికి అంగీకరించడం లేదు. దీంతో ఆ మైనర్ ను వదిలించుకోవాలని ఆ యువకుడు నిర్ణయం తీసుకున్నాడు.
ఈ క్రమంలో కొన్ని రోజుల కిందట ఆమె వాళ్ల నాన్నమ్మ ఇంటికి వెళ్లింది. యువకుడు కూడా వాళ్ల ఊరికి వెళ్లాడు. పురుగుల మందును తీసుకొని ఆ బాలిక ఇంటిల్లోకి ప్రవేశించాడు. ఆ సమయంలో బాలిక నాన్నమ్మ శ్రీరామనవమి ఊరేగింపు ఉత్సావాల్లో పాల్గొనేందుకు వెళ్లింది. పెళ్లి చేసుకొని జీవించడం కష్టం కాబట్టి ఆత్మహత్య చేసుకుందామని ఆమెకు మాయమాటలు చెప్పాడు. అతడి మాటలు నిజమేనని నమ్మిన ఆ బాలిక అతడు చెప్పినట్టుగా పురుగుల మందు తాగింది. దీనిని గమనించి ఆ బాలిక సోదరుడు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి ఈ విషయం వాళ్ల నాన్నమ్మకు చెప్పాడు. దీంతో గ్రామంలో ఒక్క సారిగా కలకలం రేగింది. బాలికను వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందింది.
ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు. ఆత్మహత్యతో ఎవరూ ఏమీ సాధించలేరు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వస్తే వెంటనే 9152987821 అనే ప్రభుత్వ హెల్ప్ లైన్ నెంబర్ కు కాల్ చేయండి. వారు మంచి కౌన్సిలింగ్ ఇచ్చి మీకు సహాయం చేస్తారు.