కేసీఆర్ మీద ఉమ్మడి పోరు: చంద్రశేఖర్ నివాసంలో నేతల భేటీ, కోదండరామ్ 'నో'

By telugu teamFirst Published Jun 28, 2021, 8:30 AM IST
Highlights

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రభుత్వంపై ఉమ్మడి పోరుకు జేఎసీ ఏర్పాటు దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి. వివిధ సిద్ధాంతాలకు చెందిన పలువురు నేతలు మాజీ మంత్రి ఏ. చంద్రశేఖర్ నివాసంలో భేటీ అయ్యారు.

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై ఉమ్మడి పోరుకు కొంత మంది నేతలు సమాయత్తమవుతున్నారు. ఇందుకు గాను వారు ఉమ్మడి కార్యాచరణ కమిటీ (జేఎసీ)ని ఏర్పాటు చేసే దిశగా ముందుకు సాగుతున్నారు. అభిప్రాయభేదాలను, సిద్ధాంతాలను పక్కన పెట్టి పలువురు నాయకులు మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్ నివాసంలో ఆదివారంనాడు సమావేశమయ్యారు. 

కేసీఆర్ తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని వారు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. జయశంకర్ స్ఫూర్తితో ముందుకు సాగుతామని వారు చెబుతున్నారు. ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని వారు భావిస్తున్నారు. 

ఉద్యమ ఆకాంక్షల కమిటీ పేరుతో అదివారంనాడు వారు సమావేశమయ్యారు. చంద్రశేఖర్ నివాసంలో జరిగిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మాజీ జేఏసీ కన్వీనర్ కె. స్వామిగౌడ్, మాజీ మంత్రి డాక్టర్ విజయ రామారావు, , టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు గాదె ఇన్నయ్య, మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్, మాజీ మంత్రి డి. రవీంద్ర నాయక్, ఉద్యోగ సంఘాల నాయకుడు టీఎ విఠల్, జగదీశ్ యాదవ్, రాణి రుద్రమ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్న నాయకులను, మేధావులు ఒకే వేదిక మీదకి తెస్తామని, రాష్ట్రావతరణ తర్వాత తమకు ఏ విధమైన ద్రోహం జరిగిందనే విషయాన్ని ప్రజల్లోకి చెబుతామని వారంటున్నారు.  తెలంగాణలో ప్రజాస్వామిక వాతావరణం కొరవడిందని వారు విమర్శించారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ వంటి పరిస్థితి నెలకొని ఉందని తప్పు పట్టారు. వ్యక్తి స్వేచ్ఛనే కాకుండా పౌర హక్కులను కూడా ఈ ప్రభుత్వం కాలరాస్తోందని విమర్సించారు. 

మంత్రులను, ఎమ్మెల్యేలను కేసీఆర్ ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారని వారు విమర్శించారు. తాము త్వరలోనే కార్యాచరణను రూపొందించుకుని ప్రజల ముందుకు వస్తామని చెప్పారు. అయితే, ఈ సమావేశంలో తెలంగాణ జన సమితి (టీజెఎస్) అధ్యక్షుడు కోదండరామ్ లేరు. ఆయనను ఆహ్వానించారా, లేదా అనేది తెలియదు. 

click me!