KCR: 50 ఏళ్ల కాంగ్రెస్ పాలన ఆత్మహత్యలు, వలస‌ల‌తో నిండిపోయింది.. కేసీఆర్ ఫైర్

By Mahesh Rajamoni  |  First Published Nov 25, 2023, 10:24 AM IST

Kalvakuntla Chandrashekar Rao: గ‌త కాంగ్రెస్ నాయ‌కుల అస‌మ‌ర్థ‌త వ‌ల్ల రాష్ట్రం ప్ర‌గ‌తికి నోచుకోలేద‌ని సీఎం కేసీఆర్ అన్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ వృధా అనీ, కేవలం మూడు గంటలే సరిపోతుందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెబుతున్నారని మండిప‌డ్డారు.
 


Telangana Assembly Elections 2023: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచిన తర్వాత భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) లో చేరుతామని చెప్పి ఓట్లు అడుగుతున్నారని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఆరోపించారు. ఎన్నిక‌ల ప్ర‌చారం సంద‌ర్భంగా ప్రభుత్వ రంగ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్)ను పక్కన పెట్టి ఆస్ట్రేలియాలోని అదానీ గ్రూప్ బొగ్గు గనుల నుంచి బొగ్గు దిగుమతి చేసుకుంటామని ప్రధాని నరేంద్ర మోడీ చెబుతున్నారని ఆరోపిస్తూ కేంద్ర ప్ర‌భుత్వం తీరుపై మండిప‌డ్డారు. గత కాంగ్రెస్ పాలకుల అసమర్థత వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీసీఎల్ లో 49 శాతం వాటాను విక్రయించాల్సి వచ్చిందని ఆరోపించారు.

ఇప్పుడు తమ ఓటమి ఖాయమని గ్రహించిన కాంగ్రెస్ నేతలు కొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టారని పేర్కొంటూ.. "గెలిచిన తర్వాత వెళ్లి బీఆర్ఎస్ లో చేరేలా తమను ఎన్నుకోవాలని ప్రజలను కోరుతున్నారు. నాకు ఆ వార్త తెలిసింది. ఎలాగైనా గెలవాలని చూస్తున్నారు" అని కేసీఆర్ ఆరోపించారు.తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ, నవోదయ స్కూల్ కూడా ఇవ్వని బీజేపీకి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. వారికి ఓటేస్తే డ్రైనేజీలో పడేసినట్లేనని ఎద్దేవా చేశారు. 1956లో తెలంగాణను ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేసింది కాంగ్రెస్ పార్టీయేననీ, దాని ఫలితంగా 50 ఏళ్ల పాటు బాధలు అనుభవించామని ఆయన అన్నారు. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలన ఆత్మహత్యలు, వలసలతో నిండిపోయిందనీ, 1969లో ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన తెలంగాణ ఉద్యమంలో 400 మందిని కాల్చి చంపారని పేర్కొన్నారు.

Latest Videos

undefined

సింగరేణి కార్మికులకు అనేక సౌకర్యాలు కల్పించామన్నారు. ప‌లు సంక్షేమ ప‌థ‌కాల‌ను తీసుకువ‌చ్చామ‌ని చెప్పారు. సింగరేణి కార్మికులకు ఆదాయపు పన్ను మాఫీ చేయాలని కేంద్రాన్ని కోరుతూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసిందని గుర్తుచేశారు. కానీ ప్రధాని మోడీ ఆ పని చేయడం లేదనీ, పైగా మీరు సింగరేణిని మూసివేస్తున్నారని, ఆస్ట్రేలియాలోని అదానీ (గనుల) నుంచి బొగ్గును దిగుమతి చేసుకుంటామని చెబుతున్నార‌ని మండిప‌డ్డారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఎస్సీసీఎల్లో 15 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న కొన్ని సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ దేశంలోనే తొలిసారిగా రైతుబంధు పథకాన్ని తీసుకువచ్చామనీ, గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వృద్ధాప్య పింఛన్లను రూ.200 ఉండ‌గా, తాము రూ.1,000కు, ఆ తర్వాత రూ.2000కు పెంచామని చెప్పారు. క్రమంగా రూ.5 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు.

రైతులకు రైతుబంధు పెట్టుబడి సాయం అందించి కేసీఆర్ రైతుల సొమ్మును వృథా చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారన్నార‌ని మండిప‌డ్డారు. బీఆర్ఎస్ అభ్యర్థులను ఎన్నుకుంటే రైతుబంధును కొనసాగించడమే కాకుండా, దాని కింద ఉన్న మొత్తాన్ని క్రమంగా రూ.16 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. రైతులకు ఇచ్చే 24 గంటల ఉచిత విద్యుత్ వృధా అనీ, కేవలం మూడు గంటలు సరిపోతుందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అంటున్నారని ఆయన అన్నారు. తాము అధికారంలోకి రాగానే ధరణిని బంగాళాఖాతంలో పడేస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని గుర్తు చేశారు. ఓటుతో ప్ర‌జ‌లు వారికి త‌గిన గుణ‌పాఠం చెప్పాల‌ని కేసీఆర్ పిలుపునిచ్చారు.

click me!