తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఒకే రోజు 31 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ సోకినవారిలో ముగ్గురు పోలీసులు కూడా ఉన్నారు. జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది.
జగిత్యాల: తెలంగాణలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. జగిత్యాల జిల్లాలో ఒకే రోజు 31 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. జగిత్యాల పట్టణం, మండలంలో 16, కొడిమ్యాల-3, పెగడపల్లి-2, గొల్లపల్లి-2, కోరుట్ల, రాయికల్, వెల్గటూర్, బీర్‌పూర్, మెట్‌పల్లి మండలాల్లో మిగతా కేసులు నమోదయ్యాయి. ఇందులో ముగ్గురు పోలీసులు ఉన్నారు.
జిల్లా కేంద్రంలోని అరవింద్‌నగర్‌లో ఒకే కుటుంబంలో ముగ్గురికి పాజిటివ్‌గా తేలగా, సుభాష్‌నగర్‌లో 60ఏళ్ల మహిళకు పాజిటివ్‌గా నిర్ధరించారు. కొత్త కేసులతో జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 172కు చేరింది. అందులో 96 మంది కోలుకోగా ముగ్గురు మృతి చెందారు. 73 మందిలో ఇళ్లలో కొందరు, ఆస్పత్రుల్లో మరికొందరు చికిత్స పొందుతున్నారు.
ఇదిలావుంటే, సాధారణ ప్రజలే కాదు, ప్రజాప్రతినిధులు కూడా కరోనా వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది.
కుత్బుల్లాపూర్ శాసనసభ్యుడు వివేకానంద గౌడ్ కు కరోనా వైరస్ పాజిటివ్ తేలింది. ఆయన భార్య సౌజన్య, కుమారుడు విధాత్ లకు కూడా కరోనా వైరస్ సోకినట్లు వైద్యులు ఆదివారంనాడు తెలిపారు. దీంతో వివేకానంద గౌడ్ కుటుంబ సభ్యులు ఇంట్లోనే వేర్వేరు గదుల్లో హోం క్వారంటైన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు.
గతంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గణేష్ గుప్తా, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ లకు కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. కాంగ్రెసు సీనియర్ నేత వి. హనుమంతరావు కూడా కోరనా వైరస్ కు చికిత్స పొంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయ్యారు.
ఇదిలావుంటే, ఆదివారంనాటి లెక్క ప్రకారం.... తెలంగాణలో 1,296 మందికి పాజిటివ్‌గా తేలినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 45,076కి చేరింది. ఇవాళ రాష్ట్రంలో కోవిడ్‌తో ఆరుగురు మరణించారు.వీరితో తెలంగాణలో మృతుల కేసుల సంఖ్య 415కి చేరుకుంది.
కరోనా నుంచి ఇప్పటి వరకు 32,438 మంది డిశ్చార్జ్ అవ్వగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 12,224 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇవాళ ఒక్క హైదరాబాద్‌లోనే 557 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. రంగారెడ్డి 111, వరంగల్ అర్బన్‌లో 117 మందికి పాజిటివ్‌గా తేలింది.