యాదాద్రి ఆలయంలో కలకలం: 30 మంది సిబ్బందికి కరోనా.. ఆర్జిత సేవలు రద్దు

By Siva KodatiFirst Published Mar 27, 2021, 9:03 PM IST
Highlights

తెలంగాణలో కరోనా కేసులు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు పాఠశాలలు, కళాశాలల్లో పంజా విసిరిన వైరస్.. తాజాగా ఆధ్యాత్మిక కేంద్రాలపైనా ప్రభావం చూపుతోంది. రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనారసింహస్వామి ఆలయంలో కోవిడ్ కలకలం రేపింది

తెలంగాణలో కరోనా కేసులు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు పాఠశాలలు, కళాశాలల్లో పంజా విసిరిన వైరస్.. తాజాగా ఆధ్యాత్మిక కేంద్రాలపైనా ప్రభావం చూపుతోంది.

రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనారసింహస్వామి ఆలయంలో కోవిడ్ కలకలం రేపింది. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు, అర్చకుల్లో 30 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది.  ఈ మేరకు ఆలయ ఈవో గీతారెడ్డి మీడియాకు తెలిపారు.

ఇటీవల జరిగిన ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలలో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ క్రమంలో వారి నుంచి ఆలయ సిబ్బందికి వైరస్‌ సోకి ఉంటుందని భావిస్తున్నట్లు ఈవో అభిప్రాయపడ్డారు.

Also Read:పెరుగుతున్న కేసులు.. పండుగలపై నిషేధం: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

ఆలయ సిబ్బందికి కొవిడ్‌ నిర్ధారణ కావడంతో స్వామివారి ఆర్జిత సేవలను ఆదివారం నుంచి నిలిపేయాలని నిర్ణయం తీసుకున్నట్లు గీతా రెడ్డి ప్రకటించారు. కేవలం దైవదర్శనాలకు మాత్రమే భక్తులను అనుమతిస్తామని ఆమె తెలిపారు.

మరోవైపు యాదగిరిగుట్ట మండలంలోని మల్లాపురం గ్రామానికి చెందిన 16 మందికి, యాదగిరిగుట్ట పట్టణంలోని ఇద్దరికి పాజిటివ్‌గా తేలిందని వైద్యా ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.  

కాగా, గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 495 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. వైరస్‌ ప్రభావంతో మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 4,241 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 1,870 బాధితులు హోం ఐసోలేషన్‌లో కోలుకుంటున్నారు. తాజా కేసులో తెలంగాణలో మొత్తం నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 3,05,804కు పెరగ్గా... మృతుల సంఖ్య 1,685కు చేరింది.

click me!