పెరుగుతున్న కేసులు.. పండుగలపై నిషేధం: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

By Siva KodatiFirst Published Mar 27, 2021, 8:30 PM IST
Highlights

కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో కఠినమైన ఆంక్షలను విధించింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరి చేసింది. హోలీ, ఉగాది, రంజాన్, గుడ్ ఫ్రైడే, శ్రీరామనవమిపై ఆంక్షలు విధించింది. 

కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో కఠినమైన ఆంక్షలను విధించింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరి చేసింది. హోలీ, ఉగాది, రంజాన్, గుడ్ ఫ్రైడే, శ్రీరామనవమిపై ఆంక్షలు విధించింది.

ఏప్రిల్ 10 వరకు సామూహిక కార్యక్రమాలకు అనుమతి నిరాకరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే ర్యాలీలు, యాత్రలపైనా నిషేధం విధించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే 188 ఐపీసీ సెక్షన్ కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం చర్యలు చేపడుతున్నట్లు ఆదేశాల్లో తెలిపింది. 

అటు హైదరాబాద్ నగరంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి వచ్చే సందర్శకులపై ఆంక్షలు విధించారు. జీహెచ్‌ఎంసీ కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది కచ్చితంగా కోవిడ్‌ నియమ నిబంధనలు పాటించాలని ఆదేశాలు జారీచేసింది.

భౌతిక దూరం పాటించడం, మాస్క్‌లను ధరించడం, తరుచూ హ్యాండ్‌ వాష్‌ చేసుకోవడం వంటి నియమాలు పాటించాలని కమీషనర్ ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్‌ఎంసీ కార్యాలయానికి వచ్చే సందర్శకులు, బిల్డర్లు, కాంట్రాక్టర్లకు కూడా ఇదే తరహాలో ఆంక్షలుంటాయని జీహెచ్ఎంసీ స్పష్టం చేసింది.

కాగా, గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 495 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. వైరస్‌ ప్రభావంతో మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,241 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

1,870 బాధితులు హోం ఐసోలేషన్‌లో కోలుకుంటున్నారు. తాజా కేసులో తెలంగాణలో మొత్తం నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 3,05,804కు పెరగ్గా... మృతుల సంఖ్య 1,685కు చేరింది.

click me!