హైదరాబాద్ మియాపూర్‌లో తుపాకులతో సంచరిస్తోన్న ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వీరికి ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయి.. ఎవరి కోసం తెచ్చారన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్ (hyderabad) మియాపూర్‌లో (miyapur) తుపాకుల కలకలం రేగింది. గన్స్‌తో సంచరిస్తున్న ముగ్గురు వ్యక్తులను మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి కంట్రీ మేడ్ పిస్టల్, తపంచా, 2 మేగజైన్‌లు,13 బుల్లెట్స్, 6 మొబైల్ ఫోన్లు, యాక్టీవా బైక్, కారును స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు ఆదివారం ఉదయం మంజీర పైప్ లైన్ రోడ్డులో తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో అనుమానాస్పద స్థితిలో ముగ్గురు వ్యక్తులు తారసపడ్డారు.
దీంతో వారిని అదుపులోకి తీసుకొని విచారించగా వారి వద్ద ఆయుధాలు బయటపడ్డాయి. నిందితులను తమిళనాడు రాష్ట్రానికి చెందిన లియోనార్డ్ స్వామి (34), హైదరాబాద్‌కి చెందిన చింతకింది సాయిరాం(26 ), సాయి కృష్ణ (26) ఉన్నారు. నిందితులలో ఇద్దరు బిగ్ బాస్కెట్‌లో డెలివరీ బాయ్స్ గా ఉద్యోగం చేస్తున్నారు. వీరిపై మియపూర్ పోలీసులు ఆయుధ చట్టం కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే వారికి ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయి..? ఎందుకోసం తెచ్చుకున్నారు అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.