వంశీరాం బిల్డర్స్ అధినేత సుబ్బారెడ్డి ఇంట్లో 46 గంటలుగా ఐటీ సోదాలు కొనసాగుతూనే వున్నాయి. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి కుటుంబ సభ్యుల బ్యాంక్ లాకర్స్‌ను తెరవగా... నగదు, బంగారు ఆభరణాలు, ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
వంశీరాం బిల్డర్స్ అధినేత సుబ్బారెడ్డి ఇంట్లో వరుసగా రెండో రోజూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. దాదాపు 46 గంటలుగా ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తూనే వున్నారు. సుబ్బారెడ్డి కుటుంబ సభ్యుల బ్యాంక్ లాకర్స్ తెరిచారు ఐటీ అధికారులు. లాకర్స్ నుంచి భారీగా బంగారు ఆభరణాలు, ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు కావూరి హిల్స్‌లోని బిల్డర్స్ ఇంట్లోనూ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. కావూరి హిల్స్‌లోని ఓ హోటల్‌లో 3 బృందాలు తనిఖీలు చేస్తున్నాయి.
బుధవారం కూడా సుబ్బారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే. భారీగా ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. పలువురు ప్రైవేట్ వ్యక్తులతో చేసుకున్న ఒప్పందాలకు సంబంధించిన పత్రాలను కూడా సీజ్ చేశారు. పెద్ద మొత్తంలో నగదు కూడా దొరికినట్లు సమాచారం. కంపెనీ ఉద్యోగుల పేర్లపై బ్యాంక్ ఖాతాలు తెరిచి, ఆ ఖాతాల నుంచి భారీగా లావాదేవీలు జరిపినట్లుగా గుర్తించారు. పలు కంపెనీలతో చేసుకున్న ఒప్పంద పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఫ్లాట్స్ కొన్న వారి నుంచి 50 శాతానికి పైగా బ్లాక్‌లో నగదు వసూలు చేసినట్లుగా గుర్తించారు. హవాలా లావాదేవీలపైనా ఆరా తీస్తున్నారు.
ALso REad:వంశీరామ్ బిల్డర్స్ కార్యాలయంలో రెండో రోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు.. కీలక పత్రాలు స్వాధీనం..!
ఈ కేసుకు సంబంధించి గ్రీన్ పార్క్, ఆవాస హోటల్స్ ఛైర్మన్ మల్లిఖార్జున్ రెడ్డి ఇంట్లోనూ ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అలాగే ఆయన బంధువుల ఇళ్లల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. మరోవైపు వైసీపీ నేత దేవినేని అవినాష్ ఇంట్లోనూ సోదాలు చేశారు ఐటీ అధికారులు. వంశీరామ్ బిల్డర్స్‌కు భూమిని డెవలప్‌మెంట్‌కు ఇచ్చినట్లు అవినాష్ తెలిపారు. ఐటీ అధికారులు తన వద్ద నుంచి ఎలాంటి డాక్యుమెంట్లు తీసుకెళ్లలేదని చెప్పారు. లిటిగేషన్ భూములతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు.