
నట్టి నడి సముద్రంలో నావ చెడిపోయే, పడవ కొట్టుకు పోయి గట్టుకు రాలేక విల్ల విల్లాడిన వారి వార్తలు విన్నాం. ఇదే మాదిరి నల్లమల అడవుల్లో దారి తప్పి, చెట్లూ పుట్టల మధ్య వారాల తరబడి గడిపిన వాళ్ల రోదన విన్నాం. కథ చివరకు సుఖాంతమయిన, యాతన మరచిపోలేనిది.
అయితే, ఒక నడినడివూర్లో చిక్కుకుపోయి, బయటపడలేక, ఇంటికెలా రావాలో దారి తెలియక ఎస్ఒఎస్ లు పింసిస్తున్న 200 మంది చిరుద్యోగుల కథ తెలుసా?
సముద్రంలో చిక్కుకున్నవారిని కాపాడేందుకు, అడవుల్లో దారి తప్పిన వారి ఆచూకి కొనుగొనేందుకు యుధ్ద ప్రాతిపదికన చర్యలు జరుగుతాయి.టివిలలలో నిర్విరామంగా కొనసాగే రక్షణ కార్యక్రమాన్ని సినిమాలాగా కోట్లాది మంది ఉత్కంఠతో చూస్తారు.నిమిష నిమిషానికి వాళ్లయోగ క్షేమాలు టివితెర మీద దొర్లుతూ ఉంటాయి.
ఈ రెండువందల మంది చిరుద్యోగుల సముద్రంలో , అడవుల్లో దారి తప్పిన వారిలాగే సతమతమవుతున్నా, ప్రభుత్వంలో పెద్దగా కదలిక ఉన్నట్లు కనిపించదు. వాళ్ల కష్టాలు టివిల కెక్కలేదు. పత్రికల్లో వచ్చింది అంతంతమాత్రమే. కారణం వాళ్లంతా ఎలాంటి రాజకీయ ఆకర్షణ లేని చిరుద్యోగులు కావడమే.
నమ్మండి నమ్మక పోండి, రెండు వందల మందికి పైగా తెలంగాణా క్లాస్ ఫోర్ ఉద్యోగులు నడి అమరావతిలో వెలగపూడి వద్ద చిక్కుకుని తల్లడిల్లుతున్నారు. వాళ్లంతా సొంతవూరు హైదరాబాద్ రావడానికి మార్గం కనిపించక నానా యాతన పడుతున్నారు. వరల్డ క్లాస్ నగరం కాబోతున్న అమరావతి, దాని పరిసరాలో రాజధాని డాబులతో విర్రవీగుతున్న విజయవాడ, గుంటూరులలో బతికేందుకు ఏ మాత్రం శక్తి లేని అల్పజీవులు వాళ్లు. ఒక నెల కూడా అక్కడ బతకలేని అభాగ్యులు . వీళ్లంతా విభజన విసిరేస్తే వెలగపూడిలో పడిన డ్రయివర్లు, రికార్డ్ అసిస్టెంట్లు, లిఫ్ట్ ఆపరేటర్లు. సెక్రెటేరియట్ ఉద్యోగుల విభజన సమయంలో తాత్కాలిక కేటాయింపులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వీరిని కేటాయించారు. తర్వాత ఫైనల్ కేటాయింపులో ఈ తెలంగాణా ’బిడ్ద’ ల తలరాత మారలేదు. ఆంధ్ర కే పంపించారు.
హైదరాబాద్ సెక్రేటేరియట్లో నే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నపుడు వీళ్లంతా సొంతవూరు హైదరాబాద్ లోనే అందునా సొంత ఇళ్లలోనే ఉన్నారు. అయితే, వున్న ఫలానా ఆంధ్రప్రభుత్వం వెలగపూడికి వుడాయించేయడంతో వీళ్లు కూడా అక్కడికి పరుగు పెట్టాల్సింది, ఇల్లు వాకిలి వదలేసి. అక్కడికి వెళ్లాక తెలిసింది, తాము దారితప్పిపోయాయమని, నడిసముద్రంలోకికొట్టకు పోయామని. వెలగపూడిలో కాలుపెట్టిన నప్పటి నుంచి వీళ్ల జీవితం తారుమారయింది. అక్కడి కీకారణ్యంలో తమ లాంటి అల్పప్రాణులు బతకు లేవని తెలుసుకుని కాపాడండని కేకలేస్తున్నారు.
ఉన్నట్లుండి ఉప్పెనలా వస్తున్న సిరిసంపదలతో రాజకీయ ప్రాబల్యంలో విర్రవీగుతున్న పట్టణాలు గుంటూరు , విజయవాడ. ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు కూడా అక్కడికి ’ఫ్యామిలి’ షిఫ్ట్ చేసేందుకు జంకుతున్నారు. గెజిటెడ్ అఫీసర్లు కూడా ఇళ్లు దొరకక, దొరికినా వాసి పోతున్న అద్దెలతో సతమతమవుతున్నారు. ప్రభుత్వం ఖర్చుభరించే ఉన్నతాధికారులు, నాలుగు డబ్బులు రాబట్టుకునే మార్గం తెలిసిన ఆపీసర్లు, ఉద్యోగులు మాత్రమే వెలగపూడి అంటే మోజుపడ్తున్నారు. గుట్టు తెలిసిన కొంతమంది చెప్పందాని ప్రకారం, ఆంధప్రదేశ్ ప్రభుత్వంలో చాలా మంది ఆపీసర్లు, ఉద్యోగులు పనులు చేసేందుకు ’వెలగపూడి మామూలు’ అడుగుతున్నారట. వెలగపూడి ఒక అవినీతి కూపమయిందని వాపోయే వాళ్ల సంఖ్య రోజురోజు కూడా పెరుగుతూ ఉంది.
ఇలాంటి చోట ఈ రెండు వందల మంది చిరుద్యోగులు బతగ్గలరా? వాళ్లనలా వదిలేస్తే మలమల మాడిపోరూ?
అద్దెలకు రూమ్ లు దొరకక, దొరికినా అద్దె భరించలేక ఎక్కడ బడితే అక్కడ తల దాచుకుంటున్నారు వీరంతా. చాలా మందికి ఇలాంటి వసతి ఖర్చు భరించే శక్తి కూడా లేదు. సెక్రటేరియట్ లో నే ఏదో ఒక మూల గడిపేద్దామంటే వెలగపూడి హైసెక్యూరిటీ జోన్ కాబట్టి అఫీస్ టైం అయిపోగానే సెక్యూరిటీ వాళ్లు పరిసరాల్లో ఉండనీయకుండా వీళ్లందరిని తరిమేస్తున్నారు.
తెలంగాణాకు చెందిన వీరందరిని తొందర్లోనే తెలంగాణా తీసుకుంటామని ముఖ్యమంత్రి కెసిఆర్ ఎపుడో హామి ఇచ్చారు. ఈ కష్టాలు పడలేక , ఈ హామీని వెంటనే అమలుచేయాలని వీళ్లు కోరుతున్నారు. ఈ విషయం గుర్తు చేద్దామంటే ముఖ్యమంత్రితో ముఖాముఖి దొరికేంత ’పలుకుబడి ’ ఉన్న ఉద్యోగులు కారు వీరు. ముఖ్యమంత్రిని కలసుకోవడం వీళ్ల కు చాలా కష్టమయిపోతున్నది.
ముఖ్యమంత్రిగారెపుడు బిజీగా ఉంటున్నారు, తీరుబడి లేకుండ సమీక్షలు సమావేశాలలో ఉంటున్నారని నాయకులదగ్గిర నుంచి జవాబొస్తున్నదని ఒక ఛోటా నాయకుడొకరు చెప్పారు. హైదరాబాద్ లో తప్ప మరొక చోట ఎపుడూ ఉద్యోగం చేయని ఈ చిరుద్యోగులను కాపాడేందుకు ఒక్క కలం పోటు చాలు, అయినా ఆ పని జరగడం లేదని వారు వాపోతున్నారు.
ప్రభుత్వవ్యవస్థ లో అట్టడుగున పాతాళంలో ఉండటమే కారణమేమో...