
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మహేశ్ బ్యాంక్ సర్వర్ హ్యాకింగ్ కేసులో (mahesh bank hacking case) మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ కేసులో మొత్తం నిందితుల సంఖ్య ఐదుకి చేరింది. సైబర్ నేరగాళ్లకు (cyber fraudsters) సహకరించిన కస్టమర్లను అరెస్ట్ చేశారు. పెద్ద ఎత్తున కమీషన్ తీసుకుని తమ ఖాతాలను పలువురు నైజీరియన్లు (nigerians) సైబర్ నేరగాళ్లకు అప్పగించారు. కమీషన్‌కు కక్కుర్తిపడి నకిలీ పేర్లతో ఖాతాలు తీసుకుని అమ్మినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఢిల్లీ, బెంగళూరు, ముంబై, చెన్నై, ఈశాన్య భారతదేశంలో భారీగా నకిలీ బ్యాంక్ ఖాతాలను పోలీసులు గుర్తించారు.
దేశవ్యాప్తంగా పదిచోట్ల సీసీఎస్ పోలీసులు (ccs police) సోదాలు నిర్వహించారు. కొత్త తరహాలో బ్యాంక్ సర్వర్లను నిందితులు హ్యాక్ చేసినట్లుగా గుర్తించారు. మొత్తం రూ.12.90 కోట్లను కొట్టేశారు కేటుగాళ్లు. ముంబైలోని బెహరన్ బ్యాంక్, హైదరాబాద్‌లో అపెక్స్ మహేశ్ బ్యాంక్‌లో సైబర్ అటాక్ అంతా ఒకే తరహా అని పోలీసుల దర్యాప్తులో తేలిందని సీసీఎస్ జాయింట్ సీపీ గజారావ్ భూపాల్ పేర్కొన్నారు. ఐపీ అడ్రస్‌లను మార్చి సైబర్ దాడి చేసినట్లు ఆయన చెప్పారు. అమెరికా, యూకే, స్విట్జర్లాండ్, సింగపూర్, ఫ్రాన్స్‌తో పాటు మరికొన్ని దేశాల ఐపీ అడ్రస్‌లను గుర్తించినట్లు గజారావ్ అన్నారు.
కాగా.. మహేష్ బ్యాంక్ సర్వర్‌ను బంజారాహిల్స్‌లోని ఓ సంస్థ నిర్వహిస్తుండగా.. సాఫ్ట్‌వేర్‌ను ముంబైకి చెందిన సంస్థ అందించింది. ప్రాక్సీ సర్వర్‌తో సైబర్ నేరగాళ్లు సర్వర్‌ను యాక్సెస్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ నేరం చేయడానికి ముందు సైబర్ నేరగాళ్లు.. చెస్ట్ ఖాతాను యాక్సిస్ చేసి ఈ మూడు ఖాతాల లావాదేవీల పరిమితిని రూ. 50 కోట్లకు పెంచేశారు. సైబర్ నేరగాళ్లు.. డైరెక్ట్‌గా సర్వర్‌ను హ్యాక్ చేశారా..? లేదా బ్యాంక్ సాఫ్ట్‌వేర్ లోకి ప్రవేశించి సర్వర్‌ను హ్యాక్ చేశారా అనేది తెలియాల్సి ఉంది. ఐపీ ఆడ్రస్ ప్రకారం అమెరికా, కెనడా నుంచి ఈ ఆపరేషన్ చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
గతేడాది జూలైలో తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ (Telangana State Cooperative Apex Bank) కోర్ బ్యాంక్ ఖాతా నుంచి సైబర్ మోసగాళ్లు రూ. 1.96 కోట్లు స్వాహా చేశారు. తాజాగా మహేష్ బ్యాంక్‌లో చోటుచేసున్న చోరి కూడా.. ఆ ఘటనను పోలి ఉంది. మొదట కోర్ ఖాతా నుంచి ఖాతాదారుల ఖాతాలకు నిధులను తరలించి.. అక్కడి నుంచి వివిధ బ్యాంక్ ఖాతాలను డబ్బులు బదిలీ చేశారు. గతంలో సర్వర్లు హ్యాక్ అయిన 2 బ్యాంకులకు సాఫ్ట్‌వేర్ అందించిన సంస్థే.. మహేష్ బ్యాంకుకు సాఫ్ట్‌వేర్ అందించడంతో.. సర్వర్ హ్యాక్ చేసి నగదు కొల్లగొట్టిన నేరస్థుడు ఒక్కరేనని పోలీసులు అనుమానిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆ కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు.