18 ఏళ్ల నాటి హత్య కేసు: కన్న కొడుకును హత్య చేయించిన తల్లి

By Siva KodatiFirst Published Apr 8, 2019, 9:03 AM IST
Highlights

18 ఏళ్ల క్రితం జరిగిన ఓ హత్య కేసును హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. వివరాల్లోకి వెళితే.. చాంద్రాయణగుట్ట హాషమాబాద్ ప్రాంతానికి చెందిన మసూదాబీకి 50 ఏళ్ల క్రితం మహమ్మద్ సాబ్‌తో పెళ్లయ్యింది. 

18 ఏళ్ల క్రితం జరిగిన ఓ హత్య కేసును హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. వివరాల్లోకి వెళితే.. చాంద్రాయణగుట్ట హాషమాబాద్ ప్రాంతానికి చెందిన మసూదాబీకి 50 ఏళ్ల క్రితం మహమ్మద్ సాబ్‌తో పెళ్లయ్యింది.

వీరికి ముగ్గురు కుమారులు, ఐదుగురు కూతుళ్లు. ఈ క్రమంలో 30 ఏళ్ల క్రితం మహమ్మద్ సాబ్ మరణించాడు. రెండో కుమారుడైన మహమ్మద్ ఖాజా పని పాటా లేకుండా జల్సాగా తిరుగుతుండటంతో తల్లి అతడికి పెళ్లి చేయలేదు.

పేకాట, మద్యానికి బానిసైన అతడు డబ్బు కోసం తల్లి, సోదరులను వేధించేవాడు. ఆ బాధలను తట్టుకోలేక మసూదాబీ... కొడుకును హత్య చేయాలని నిర్ణయానికి వచ్చింది. ఇందు కోసం అల్లుళ్లు మమహ్మద్ రషీద్, బషీర్ అహ్మద్, ఆటోడ్రైవర్ సయ్యద్ హాషమ్‌లతో కలిసి ప్లాన్ వేసింది.

పథకంలో భాగంగా 2001 జూన్ 4న రషీద్, బషీర్, హాషమ్, ఖాజా కలిసి బండ్లగూడలోని కల్లు కాంపౌండ్ వద్ద కల్లు తాగారు. అనంతరం ఆ నలుగురు కలిసి ఆటోలో శాస్త్రిపురం వైపుగా వెళ్లారు.

సరిగ్గా చీకటి పడుతుండగా ముగ్గురు కలిసి ఖాజా తలపై బండరాళ్లతో మోది హత్య చేశారు. ఆ తర్వాత ఖాజా గురించి ఎలాంటి అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డారు. నాడు రాజేంద్రనగర్ పీఎస్‌లో గుర్తు తెలియని వ్యక్తి హత్యగా పోలీసులు కేసు నమోదు చేశారు.

ఏళ్లు గడుస్తున్నా ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ హత్యకు సంబంధించి సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు కీలక సమాచారం అందింది. దాని ఆధారంగా తీగ లాగితే మొత్తం డొంక కదిలింది.

చివరికి హంతకులు సయ్యద్ హాషం, మహమ్మద్ రషీద్, బషీర్ అహ్మద్‌లను అరెస్ట్ చేశారు. కీలక సూత్రధారి అయిన తల్లి మసూదాబీ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 

click me!