మైనర్ బాలిక శీలానికి ఖరీదు కట్టిన పంచాయితీ పెద్దలు

First Published Aug 2, 2018, 10:15 AM IST
Highlights

ఆ కామాంధుడి దాహానికి బలై.. గర్భం దాల్చింది. న్యాయం చేయమని పంచాయితీ పెద్దలను ఆశ్రయిస్తే.. బాలిక శీలానికే ఖరీదు కట్టారు. 

తన తోటివారితో కలిసి చక్కగా స్కూల్ కి వెళ్లి చదువుకోవాల్సిన వయసులో.. కుటుంబానికి అండగా నిలిచేందుకు కూలిపనులకు వెళ్లాల్సి వచ్చింది. అలా కూలిపనులకు వెళుతూ.. కమాంధుడి కంట పడింది. ఆ కామాంధుడి దాహానికి బలై.. గర్భం దాల్చింది. న్యాయం చేయమని పంచాయితీ పెద్దలను ఆశ్రయిస్తే.. బాలిక శీలానికే ఖరీదు కట్టారు. ఈ దారుణ సంఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా నారాయణపేటలో చోటుచేసుకుంది.

 నారాయణపేటలోని పేద కుటుంబానికి చెందిన బాలిక(17) కుటుంబానికి చేదోడుగా ఉండేందుకు కొన్ని నెలలుగా పత్తి పొలంలో కూలీకి వెళ్తోంది. పొలం యజమాని, మల్దకల్‌ మండలానికి చెందిన వెంకటయ్య బాలికను లోబర్చుకున్నాడు. కుమార్తెలో శారీరక మార్పులను గమనించిన తల్లి వైద్య పరీక్షలు చేయించడంతో గర్భిణి అని తేలింది. 

బాలిక తల్లికావడానికి పత్తి చేను యజమానే  కారణం అని తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు మంగళవారం రాత్రి వెంకటయ్యను ఇంటికి పిలిపించి నిర్బంధించారు. విషయం బయటకి పొక్కడంతో గ్రామానికి చెందిన పెద్దలు వారితో చర్చలు జరిపారు. బుధవారం పంచాయతీ పెట్టి పరిహారంగా రూ.2.10 లక్షలు బాలికకు చెల్లించేలా బాధిత కుటుంబాన్ని ఒప్పించారు. 

ఇరు కుటుంబాల సమక్షంలో ఒప్పంద పత్రం రాయించారు. బాధిత కుటుంబం విన్నపం మేరకు వెంకటయ్యను గ్రామం నుంచి బహిష్కరించారు. వెంకటయ్య గతంలోనూ మరో ఇద్దరు బాలికలను ఇదే తరహాలో లోబర్చుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. గతంలో ఓసారి వెంకటయ్యకు బాధిత కుటుంబీకులు దేహశుద్ధి కూడా చేసినట్టు సమాచారం.

click me!