సూర్యాపేట: తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. గురువారం ఒక్క రోజే కొత్తగా 16 కేసులు నమోదయ్యాయి. దీంతో సూర్యాపేట జిల్లాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 39కి చేరింది.
దాంతో అధికారులు అప్రమత్తయమ్యారు. లాక్ డౌన్ ను పకడ్బందీగా అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మర్కజ్ కు వెళ్లి వచ్చిన వ్యక్తి కుటుంబానికి చెందినవారే కరోనా వైరస్ బారిన పడినట్లు తెలుస్తోంది. సూర్యాపట పట్టణంలోనే 14 కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలోని జగిత్యాలలో మరో కరోనా వైరస్ పాజిటివ్ కేసు బయటపడింది. ఐదేళ్ల బాలుడికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారించారు. గుంటూరు ఆస్పత్రిలో ట్రాన్సిల్స్ ఆపరేషన్ చేయించి జగిత్యాల మండలంలోని వంజరిపల్లెలో ఉన్న అమ్మానాన్నల వద్దకు అతన్ని తాత మంగళవారం తీసుకుని వచ్చాడు.
బాలుడి తల్లిదండ్రులు వంజరపల్లెలో మేస్త్రీ పనిచేస్తుంటారు. గ్రామస్తుల ఫిర్యాదుతో తాతను, మనవడిని జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత పరీక్షల కోసం హైదరాబాదుకు నమూనాలను పంపించారు. తాతకు నెగెటివ్ రాగా, మనవడికి పాజిటివ్ వచ్చినట్లు జగిత్యాల ఉప వైద్యాధికారి జైపాల్ రెడ్డి చెప్పారు.