
నారాయణపేట: వేగంగా దూసుకెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురయి 15మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ఘోన రోడ్డుప్రమాదం నారాయణపేట జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమయానికి హాస్పిటల్లో చేర్చడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
వివరాల్లోకి వెళితే... కర్ణాటకలోని హుబ్లీ నుండి తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు 45మంది ప్రమాణికులతో ఆరెంట్ ట్రావెల్స్ బస్సు బయలుదేరింది. ప్రయాణికులంతా నిద్రలో వుండగా ఒక్కసారిగా బస్సు ప్రమాదానికి గురయ్యింది. రహదారిపై మంచి వేగంతో దూసుకెళుతున్న బస్సు నారాయణపేట జిల్లాలో ఒక్కసారిగా ప్రమాదానికి గురయ్యింది. మాగనూరు వద్ద బస్ కు సడన్ గా ఓ గేదె అడ్డుగా వచ్చింది. డ్రైవర్ దాన్ని తప్పించడానికి ప్రయత్నించడంతో ఒక్కసారిగా బస్సు అదుపుతప్పి బోల్తా పడింది.
ఈ బస్సు ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మిగతావారు చిన్నచిన్న గాయాలతో బయటపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు కూడా ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు మహబూబానగర్ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం అందరికీ మెరుగైన చికిత్స అందిస్తున్నామని... ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపారు. ఈ ట్రావెల్స్ బస్సు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలావుంటే గత మంగళవారం నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని బలితీసుకుంది. ముగ్గురు కుటుంబసభ్యులు బైక్ పై వెళుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడిక్కడే మరణించారు. మృతులు కమ్మర్ పల్లిలోని ఇందిరానగర్ కు చెందినవారుగా పోలీసులు గుర్తించారు.
ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకొంది. ఎల్లారెడ్డి మండలం హసన్‌పల్లి గేటు సమీపంలో ఆదివారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో 9 మంది మరణించారు.పిట్లం మండలం చిల్లర్గ గ్రామానికి చెందిన చౌదర్‌పల్లి మాణిక్యం అనే వ్యక్తి కొద్ది రోజుల కిత్రం మృతి చెందాడు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు బంధువులు టాటా ఏస్‌లో శనివారం సాయంత్రం చిల్లర్గ నుంచి ఎల్లారెడ్డిలో ఆలయంలో నిద్ర చేసేందుకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వారు ప్రయాణిస్తున్న టాటా ఏస్ వాహనాన్ని ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టాటా ఏస్ వాహనంలో ప్రయాణిస్తున్న 26 మందిలో 9 మంది మృతిచెందారు. మిగిలిన వారికి గాయాలయ్యాయి.
మృతులను డ్రైవర్ సాయిలు, చౌదర్‌పల్లి లచ్చవ్వ, చౌదర్‌పల్లి వీరమణి, చౌదర్‌పల్లి సాయవ్వ, అంజవ్వ, పోచయ్య , గంగవ్వ, ఎల్లయ్య, ఈరమ్మగా గుర్తించారు. వీరంతా వ్యవసాయం, కూలిపనులు చేసుకొని బతికే నిరుపేదలే.