ఆర్టిసి బస్సెక్కి అమ్మమ్మ వాళ్ల ఊరినుండి తల్లిదండ్రుల వద్దకు వెళుతున్న బాలిక కనిపించకుండా పోయింది. ఈ బాలిక మీకు ఎక్కడైనా కనిపించిందా?
కరీంనగర్ : 13 ఏళ్ల చిన్నారి మిస్సింగ్ కరీంనగర్ జిల్లాలో కలకలం రేపింది. అమ్మమ్మ వాళ్ల ఊరినుండి ఒంటరిగా బస్సులో బయలుదేరిన చిన్నారి గమ్యానికి చేరుకోకుండా మాయమయ్యింది. తిరిగి అమ్మమ్మవాళ్ల ఇంటికీ వెళ్లలేదు... తల్లిదండ్రుల వద్దకు చేరుకోలేదు... మరి ఆ బాలిక ఏమైనట్లు. కూతురు కనిపించకుండా పోవడంతో కంగారుపడ్డ పేరెంట్స్ పోలీసులను ఆశ్రయించడంతో ఈ మిస్సింగ్ వ్యవహారం బయటకు వచ్చింది.
బాలిక తండ్రి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా మానుకొండూరు మండలం ఊటూరుకు చెందిన కనుకుంట్ల నరసింహ రిటైర్డ్ ఆర్మి ఉద్యోగి. ప్రస్తుతం అతడు కుటుంబంతో కలిసి కరీంనగర్ లో నివాసం వుంటున్నారు. నరసింహ దంపతులకు ఇద్దరు కూతుళ్ళు... పెద్దకూతురు వశిష్ట కృష్ణ (13 ) ఓ ప్రైవేట్ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది.
అయితే క్రిస్మస్ పండగ, బాక్సింగ్ డే సందర్భంగా స్కూల్ కి వరుస సెలవులు వుండటంతో వశిష్ట కృష్ణ అమ్మమ్మవాళ్ల ఇంటికి వెళ్లింది. సెలవులు ముగియడంతో నిన్న(బుధవారం) బాలికను తాతయ్య పెద్దపల్లిలో ఆర్టిసి బస్సు ఎక్కించాడు. కూతురు ఒంటరిగా వస్తుండటంతో ముందుగానే బస్టాప్ వద్దకు వచ్చి ఎదురుచూసాడు. బస్సు రాగానే దగ్గరకు వెళ్లి కూతురు కోసం చూసాడు. ఆమె కనిపించకపోవడంతో కంగారుపడిపోయిన అతడు కండక్టర్ తో పాటు ఇతర ప్రయాణికులను ఆరా తీసాడు. ఆమె కరీంనగర్ బైపాస్ లో దిగిపోయిందని వారు చెప్పారు. దీంతో ఏదయినా అవసరం వుండి అక్కడి దింగిదేమోనని తండ్రి అక్కడికి వెళ్లాడు. కానీ బాలిక ఎక్కడా కనిపించలేదు.
Also Read TSRTC : మహాలక్ష్మీ స్కీమ్ ఎఫెక్ట్ ... నడిరోడ్డుపై ఆర్టిసి డ్రైవర్ పై ఆటోవాలాల దాడి
కూతురు వశిష్ట ఆచూకీ కోసం ఎంత వెతికినా లభించకపోవడంతో నరసింహ పోలీసులను ఆశ్రయించాడు. అతడి ఫిర్యాదుతో బాలిక కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. సోషల్ మీడియా ద్వారా బాలిక మిస్సింగ్ గురించి తెలియడంతో ఓ యువకుడు బాలిక కుటుంబసభ్యులకు కొంత సమాచారాన్ని ఇచ్చాడు. హైదరాబాద్ నుండి జగిత్యాలకు వెళుతున్న బస్సులో తనతోపాటు వశిష్ట కూడా వుందని... అయితే తాను మార్గమధ్యలో దిగిపోయానని తెలిపాడు. దీంతో బాలిక జగిత్యాలకు వెళ్లివుంటుందని భావించిన పోలీసులు అక్కడికి వెళ్లారు. జగిత్యాల పోలీసుల సాయంతో బస్టాండ్, ఇతర ప్రాంతాల్లో వశిష్టం జాడకోసం గాలిస్తున్నారు కరీంనగర్ పోలీసులు.
వీడియో
బాలిక పోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కుటుంబసభ్యులు ఎక్కడయినా కనిపిస్తే సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. మార్గమధ్యలో బాలిక బస్సు ఎందుకు దిగింది? ఒక్కతే వెళ్లిందా లేక ఎవరయినా తీసుకెళ్లారా? అన్నది తెలియాల్సి వుంది.