వందేళ్ల మర్రిచెట్టుకు పునర్జన్మ.. ఆయువునిచ్చే మానుకు ప్రాణం.. సిరిసిల్లలో మనసు కదిలించే ఘటన

Published : Feb 14, 2022, 09:13 PM IST
వందేళ్ల మర్రిచెట్టుకు పునర్జన్మ.. ఆయువునిచ్చే మానుకు ప్రాణం.. సిరిసిల్లలో మనసు కదిలించే ఘటన

సారాంశం

సిరిసల్లలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. భారీ వర్షానికి నేలకూలిన 100 ఏళ్ల మర్రిచెట్టుకు మళ్లీ జీవం పోశారు. కూకటి వేళ్లతో వెలికి వచ్చిన ఆ మర్రిచెట్టును వ్యయప్రయాసలు భరించి భారీ క్రేన్‌లతో వాహనాల్లో ఎత్తి.. అనువైన ప్రాంతానికి తరలించారు. అక్కడ ప్లాంటేషన్ చేశారు. తరలించడానికి ముందు ఆ భారీ వృక్షం పెద్ద కొమ్మలను వేరు చేశారు.  

హైదరాబాద్: చెట్టు(Tree) మనిషికి ప్రాణవాయువు ఇస్తుంది. ఆక్సిజన్ విడుదల చేసే ఏకైక జీవి. వందేళ్లుగా ఎంతో ప్రాణవాయువును ప్రకృతిలో వెదజల్లిన వందేళ్ల మర్రిచెట్టుకు పునర్జన్మ ఇచ్చాడు ఓ యువకుడు. ప్రాణాలు కోల్పోయి ఎండిపోయే చివరి దశలో ఉన్న ఒక మర్రిచెట్టును(Banyan Tree) మళ్లీ జీవ కళ రప్పించాడు. అంతేకాదు, అందుకు అనుగుణమైన ప్రాంతానికి తరలించి చెట్టుకు పునర్జన్మ పోశాడు. ఆ యువకుడి తాపత్రయానికి ఎంపీ సంతోష్ కుమార్ సహకారం తోడవ్వడంతో ఆ మర్రిమాను మళ్లీ గంభీరంగా నిలబడి ఠీవీగా చూస్తున్నది. ఈ ఘటన సిరిసిల్లలో చోటుచేసుకుంది.

సిరిసిల్లలో నాలుగు నెలల క్రితం భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. ఆ వర్షాల ధాటికి కోనరావుపేట మండలం సుద్దాల గ్రామ శివారులోని బుర్ర భూమయ్య గౌడ్, బుర్ర రమేష్ గౌడ్‌ల వ్యవసాయ క్షేత్రంలోని 70 ఏళ్ల మర్రి చెట్టు కూకటి వేళ్లతో కూలిపోయింది. ఆ తర్వాత ఆ మానను ఎవరూ పట్టించుకోలేదు. కొన్నాళ్లకు అది క్రమంగా ఎండిపోవడం మొదలైంది. నీరు అందక మర్రిచెట్టు మోడుగా మారుతుండటాన్ని చూసి అటుగా వెళ్తున్న ప్రకృతి ప్రేమికుడు డాక్టర్ దొబ్బల ప్రకాశ్ కలత చెందాడు. ఆ చెట్టుకు ఎలాగైనా ప్రాణం పోయాలని నిశ్చయించుకున్నాడు.

అంతే.. ఆలస్యం చేయకుండా రైతులు బుర్ర భూమయ్య గౌడ్, బుర్ర రమేష్ గౌడ్‌లతో మాట్లాడి మోడు వారిన చెట్టుకు పక్కనే ఉన్న దొబ్బల దాస్ పొలంలోని బావి నుంచి నీటిని పోయడం ప్రారంభించాడు. చెట్టు వేర్లను రోజూ నీటితో తడపడంతో మళ్లీ చిగురించడం మొదలైంది. కానీ, ఆ వేర్లకు ఉన్న మట్టి నేలపై పడిపోవడంతో ఇలా ఎంతోకాలం చెట్టును రక్షించుకోలేమని తెలంగాణ సాంస్కృతిక సారథిగా ఉన్న ప్రకాశ్ భావించాడు. ట్రాన్స్‌ప్లాంటేషన్ ద్వారా ఆ చెట్టును ట్రిమ్ చేసి రవాణాకు అనుకూలంగా మార్చుకుని అనువైన ప్రదేశంలో మళ్లీ నాటాలని ఆలోచించాడు. పాఠశాలలో నాటితే.. విద్యార్థులకు నీడ ఇవ్వడానికి కూడా ఉపయోగపడుతుందని అనుకున్నాడు. కానీ, అంత భారీ వృక్షాన్ని తరలించడం సులువేం కాదు. అందుకు ధనం అవసరం. దీనికోసం దాతల కోసం ఎదురుచూశాడు. 

ఈ విషయాన్ని సిద్ధిపేట ప్రజా సంబంధాల అధికారి మామిండ్ల దశరథంలో పంచుకున్నాడు. ఆ వృక్షాన్ని మళ్లీ బ్రతికించాలన్న ప్రకాశ్ పట్టుదలను ఆయన మెచ్చుకున్నాడు. ఆయన ప్రకాశ్ తాపత్రయానికి అనుగుణంగా వృక్షంపై కథనాలు రాసి మీడియాకు అందించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ఈ కథనం ప్రభంజనంగా మారింది. ఈ కథనాలను ఎంపీ జోగినపల్లి సంతోష్ చూశారు. అప్పటికే కేసీఆర్ చేపట్టిన హరిత హారం స్ఫూర్తితో దేశాన్ని హరిత భారత్ చేయాలన్న సంకల్పంతో ఆ దిశగా వెళ్తున్న సంతోష్‌ ఈ ప్రకాశ్ ఆరాటం ముచ్చటకలిగించింది. ప్రకాశ్ కృషిని అభినందిస్తూ.. ఈ చెట్టును సురక్షితమైన ఇంటికి చేర్చడం ఇప్పుడు తన బాధ్యత అని సంతోష్ ట్వీట్ చేశారు.

ఆయన హామీ మేరకు వీఏటీఏ సభ్యలు రంగంలోకి దిగారు. చెట్టును ట్రిమ్ చేశారు. సుద్దాల గ్రామం నుంచి సిరిసిల్ల నూతన కలెక్టరేట్ వెనుక భాగంలోని స్థలానికి సుమారు 6 కిలోమీటర్లు తరలించడం కష్టంగా మారింది. అనంతరం, ఇందుకోసం భారీ క్రేన్‌లను తెచ్చారు. ఆ చెట్టును తరలించడానికి ప్రత్యేక మార్గాన్ని కూడా నిర్మించారు. మొత్తానికి నెల రోులు కష్టపడి ఈ చెట్టును విజయవంతంగా తరలించి అక్కడ మళ్లీ పాతారు. సుద్దాలలో ఆదివారం ఉదయం 10 గంటలకు చెట్టును వాహనంలోకి ఎత్తగా ఆదివారం అర్ధరాత్రి సుమారు 12.10 నిమిషాలకు మర్రి వృక్షాన్ని ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసి చెట్టుకు తిరిగి ప్రాణం పోశారు.  ప్లాంటేషన్‌కు ముందే మర్రిచెట్టు పెద్ద కొమ్మలను వేరు చేసి.. తంగళ్లపల్లిలోని జిల్లెల అటవీ ప్రాంతంలో క్రేన్‌లతో నాటారు.

PREV
click me!

Recommended Stories

KCR Press Meet from Telangana Bhavan: చంద్రబాబు పై కేసీఆర్ సెటైర్లు | Asianet News Telugu
KCR Press Meet: ఇప్పటి వరకు ఒక లెక్క రేపటి నుంచి మరో లెక్క: కేసీఆర్| Asianet News Telugu