హైద్రాబాద్‌లో బ్రిడ్జిపై నుంచి కింద పడ్డ కారు: ఒకరు మృతి, నలుగురికి గాయాలు

By narsimha lodeFirst Published Feb 18, 2020, 7:26 AM IST
Highlights

హైద్రాబాద్ భరత్‌నగర్ బ్రిడ్జి పై నుండి కారు బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. 

హైద్రాబాద్ ‌లోని భరత్‌నగర్ బ్రిడ్జిపై నుండి కారు అదుపుతప్పి కింద పడిపోయింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు, గాయపడిన వారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

ఈ కారులో ప్రయాణిస్తున్న సోహైల్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

భరత్ నగర్ బ్రిడ్జిపై నుండి మంగళవారం నాడు తెల్లవారుజామున కారు బోల్తాపడినట్టుగా స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో ఉదయం నాలుగు గంటల నుండి రైతులు  ఉంటారు. ఈ ప్రాంతంలోనే ఉదయం టమాట, మిర్చి కొనుగోళ్ల కోసం రైతులు, వ్యాపారులు వస్తారు.

కారు బోల్తా పడిన సమయంలో ఈ ప్రాంతంలో ఎవరూ లేరు. అయితే కారు బోల్తా పడిన ప్రాంతానికి సమీపంలోనే రెండు మూడు వాహనాలు ఉన్నాయి. కారు బోల్తా పడడంతో స్థానికులు భయపడిపోయారు.

అతి వేగంగా కారును నడపడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకొన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కారు స్పీడో మీటర్ 100 కి.మీ.పై చూపిస్తూ ఆగిపోయింది. కారు డ్రైవ్ చేసిన వ్యక్తి మద్యం మత్తులో నడిపాడా అనే కోణంలో కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.మార్కెట్ యార్డులో  రద్దీగా ఉన్న సమయంలో కారు ప్రమాదం జరిగితే ప్రాణ నష్టం ఎక్కువగా ఉండేది.

ఇదిలావుండగా, వంతెనపై నుంచి కింద పడిన కారు కూకట్ పల్లి నుంచి సనత్ నగర్ వైపు వెళ్తోంది. మంగళవారం జరిగిన ఈ ప్రమాదంలో మృతుడిని సోహెల్ గా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఆరుగురు ఉన్నారని, వీరంతా మిత్రులని తెలుస్తోంది. 

సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులు హైదరాబాదులోని బోరబండలో గల పండిట్ నెహ్రూనగర్ కు చెందినవారు. ప్రమాదం జరిగిన తీరుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

click me!