కేసీఆర్ బలవంతుడు కాదు.. కానీ నక్క జిత్తులతోనే: రేవంత్ రెడ్డి

By narsimha lodeFirst Published Sep 13, 2021, 7:16 PM IST
Highlights

టీపీసీసీ విస్తృత సమావేశం సోమవారం నాడు గాంధీ భవన్ లో జరిగింది.ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి కేసీఆర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ బలవంతుడు కాదన్నారు. నక్క జిత్తులను ప్రయోగిస్తాడని వాటిని ఎదుర్కోవాలన్నారు.
 

హైదరాబాద్: కేసీఆర్ బలవంతుడు కాదు.....ఆయన జిత్తులను ఎదుర్కొని అప్రమతంగా ఉండి పని చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  పార్టీ నేతలను కోరారు.కేసీఆర్ నక్కజితులు ఉంటాయని ఆయన మాటలు, మంత్రాలు ఎదుర్కొని పని చేయాలన్నారు.

గాంధీభవన్  ఇందిరా భవన్ లో  సోమవారం నాడు టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు.ఏడున్నర ఏళ్ళలో కేసీఆర్ చేతిలో దళిత, గిరిజనులు దగా పడ్డారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. గజ్వెల్ లో జరగబోయే సభ ఆరంభం మాత్రమేనని ఆయన అన్నారు. 

 కేసీఆర్ చట్టాలను అమలు చేసి ఉంటే, ఇచ్చిన హామీలు అమలు చేసి ఉంటే దళిత, గిరిజనులు ఎక్కువ లబ్ది పొందేవారని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఉద్యోగాలు ఇచ్చి ఉంటే దళిత, గిరిజనులు లబ్ధి పొందేవారన్నారు.ఆరోగ్య శ్రీ, ఫీజు రియంబేర్స్ మెంట్ అమలు చేసి ఉంటే దళిత గిరిజనులకు లబ్ది జరిగేదని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

125 వ అంబెడ్కర్ జయంతి సందర్భంగా 125 అడుగుల విగ్రహం పెడతానని ఇచ్చిన హామీని ఇంతవరకు అమలు చేయలేదన్నారు. ఇంతవరకు అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయకపోగా వీహెచ్ ఏర్పాటు చేస్తామన్న అంబెడ్కర్ విగ్రహాన్ని జైల్లో పెట్టారన్నారు.వి.హెచ్  ఉద్యమానికి కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని రేవంత్ రెడ్డి ప్రకటించారు. గజ్వెల్ సభలో తీర్మానం చేసి విగ్రహం ఏర్పాటు చేసే వరకు పోరాటం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

కొండపోచమ్మ, మల్లన్న సాగర్ జలాశయాలలో దళిత, గిరిజనుల ఆకాంక్షలు జల సమాధి అయ్యాయని రేవంత్ రెడ్డి విమర్శించారు.గజ్వెల్ లో సభ ఏర్పాటు చేసి కేసీఆర్  గుండెల్లో దడ పుట్టిద్దామన్నారు రేవంత్ రెడ్డి.ఇందిరా గాంధీని మెదక్ ఎంపీ గా గెలిపిస్తే దేశంలోనే అధిక పరిశ్రమలు వచ్చాయన్నారు. 

లక్షలాది మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. అందుకు ఇందిరా గాంధీ గారికి మెదక్ ప్రజల అండగా నిలబడడం వల్లనే అయ్యిందని రేవంత్ ప్రస్తావించారు.గజ్వేల్ సభ ను విజయవంతం చేయాలని ఆయన పార్టీ క్యాడర్‌ను కోరారు. లక్ష మందికి తక్కువ కాకుండా సభ నిర్వహిస్తామన్నారు. 

గజ్వెల్ చుట్టూ 32 మండలాలూ ఉన్నాయి. మండలానికి 3 వేల మంది రావాలన్నారు.తెలంగాణ లో 34, 707 బూత్ లు ఉన్నాయి. ప్రతి బూత్ నుంచి 9 మంది రావాలని రేవంత్ రెడ్డి కోరారు. కో ఆర్డినెటర్లు ప్రతి బూత్ నుంచి ఒక్క బండి కదిలేలా చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు.క్రమపద్ధతి క్రమశిక్షణ తో నాయకులు, కార్యకర్తలు పని చేయాలని రేవంత్ రెడ్డి కోరారు.

కార్యకర్తలకు ఏ పాస్ లు ఇస్తే వాటిని పాటిస్తూ అక్కడ ఉండి సభలకు హాజరుకావాలన్నారు. అత్యత్యుహం ప్రదర్శిస్తే తర్వాత చర్యలు ఉంటాయన్నారు.సోనియమ్మ రాజ్యం రావాలంటే గజ్వెల్ కోట ను కొల్లగొట్టాలన్నారు.20 నెలలు కష్టపడి పని చేసిన వారిని 20 ఏళ్ళు గుండెలో పెట్టుకొని చూసుకుంటామని రేవంత్ రెడ్డి  హామీ ఇచ్చారు.


దళిత గిరిజన ఆత్మ గౌరవ దండోరా సభలలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు విషయాన్ని కూడా చర్చించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు కోరారు. పంజాగుట్ట వద్ద అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసే వరకు తన పోరాటం కొనసాగుతుందని ఆయన చెప్పారు.దళిత బంధు తో పాటు బి.సి బంధు కూడా అమలు అయ్యేయా పోరాటం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

కార్యకర్తల బలం కాంగ్రెస్ కు ఉందని మాజీ మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. రాబోయే ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతల ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కానుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.కేసీఆర్ సీఎం గా అన్ని రంగాలలో విఫలం అయ్యారని ఆయన విమర్శించారు.


 

click me!