ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్లు విలక్షణమైన తీర్పును ఇవ్వడంలో ముందుంటారు. ఎన్‌టీఆర్ ను ఓడించడంతో పాటు ఇండిపెండెంట్లను కూడ గెలిపించి పార్టీలకు చుక్కలు చూపారు.
నాగర్‌కర్నూల్: జిల్లాలోని కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు మూడు దఫాలు ఇండిపెండెంట్ అభ్యర్ధులను గెలిపించారు. అంతేకాదు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావును కూడ ఓడించారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి 16 దఫాలు ఎన్నికలు జరిగాయి.ఈ ఎన్నికల్లో మూడు దఫాలు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. ఆయా పార్టీల తరపున అభ్యర్ధులు బరిలో ఉన్నా కూడ తమకు నచ్చిన అభ్యర్ధులు ఇండిపెండెంట్లుగా బరిలో నిలిచినా పట్టం కట్టారు కల్వకుర్తి నియోజకవర్గ ఓటర్లు.
undefined
1962, 1967, 1994 ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్ధులను కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలు గెలిపించారు. 1989లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావును కూడ ఓడించి సంచలనం సృష్టించారు.
1962లో జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా బరిలోకి దిగిన వెంకట్ రెడ్డి విజయం సాధించారు. 1967లో జి.రెడ్డి, 1994లో ఎడ్మ కిష్టారెడ్డి ఇండిపెండెంట్ అభ్యర్ధిగా బరిలోకి దిగి విజయం సాధించారు.
1952లో కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం ద్విసభ్య నియోజకవర్గంగా ఉండేది. ఈ నియోజకవర్గం నుండి 1952 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధులు ఎం. నర్సింగ్ రావు, కేఆర్ వీరాస్వామి విజయం సాధించారు. 1957లో కాంగ్రెస్ అభ్యర్ధి శాంతాబాయి తాత్పల్లికర్ విజయం సాధించారు. 1962లో ఇండిపెండెంట్ అభ్యర్ధి వెంకట్ రెడ్డి, 1964లో శాంతాబాయి తాత్పల్లికర్ కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలోకి దిగి విజయం సాధించారు. అయితే 1967లో కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలు ఇండి పెండెంట్ కు పట్టం కట్టారు. జి.రెడ్డిని గెలిపించారు. 1972లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత జైపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టారు. 1978లో జనతా పార్టీ అభ్యర్ధిగా జైపాల్ రెడ్డి ఇదే స్థానం నుండి విజయం సాధించారు. 1983లో జనతా పార్టీ అభ్యర్ధిగా మరోసారి కల్వకుర్తి నుండి పోటీ చేసి జైపాల్ రెడ్డి విజయం సాధించారు.
also read:N.T.Rama Rao...1989లో కల్వకుర్తిలో ఎన్‌టీఆర్ ఓటమి, చిత్తరంజన్ దాస్ గెలుపు:కారణాలివీ..
1985 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జె. చిత్తరంజన్ దాస్ కల్వకుర్తి నుండి విజయం సాధించారు. 1989లో కూడ జె. చిత్తరంజన్ దాస్ కల్వకుర్తి నుండి రెండోసారి బరిలో నిలిచారు. అయితే ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన నందమూరి తారకరామారావు ఈ స్థానంలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నేత ఎడ్మ కిష్టారెడ్డి 1994లో ఇండిపెండెంట్ గా బరిలోకి దిగి విజయం సాధించారు.1999లో జైపాల్ యాదవ్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి గెలుపొందారు. 2004 ఎన్నికల్లో ఎడ్మ కిష్టారెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలోకి దిగి విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి జైపాల్ యాదవ్ కు కల్వకుర్తి ఓటర్లు పట్టం కట్టారు.2014 ఎన్నికల్లో చల్లా వంశీచంద్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలోకి దిగి గెలుపొందారు.2018 ఎన్నికల్లో జైపాల్ యాదవ్ బీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి గెలుపొందారు.
ఈ దఫా ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున జైపాల్ యాదవ్, కాంగ్రెస్ తరపున కసిరెడ్డి నారాయణ రెడ్డి, బీజేపీ తరపున ఆచారి బరిలోకి దిగారు. కల్వకుర్తి అసెంబ్లీలో మూడు దఫాలు ఇండిపెండెంట్లు గెలుపొందారు. ఎన్ టీ ఆర్ ను కూడ ఓడించారు కల్వకుర్తి ఓటర్లు. ఎస్.జైపాల్ రెడ్డి ఈ స్థానం నుండి మూడు దఫాలు గెలుపొందారు.