భట్టి, కోమటిరెడ్డి కాదు.. రేవంత్‌కు అసలు ప్రత్యర్ధి ఉత్తమ్ కుమార్ రెడ్డే, ఆ మాటల వెనుక అర్ధం అదేనా..?

By Siva KodatiFirst Published Dec 5, 2023, 6:17 PM IST
Highlights

తెలంగాణ సీఎం రేసులో వున్న మాజీ టీపీసీసీ చీఫ్ , ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి తనకు పదవి దక్కాల్సిందేనన్న మొండి పట్టుదలతో వున్నట్లుగా కనిపిస్తోంది.  విధేయత, ట్రాక్ రికార్డ్, సొంత ఇమేజీ వంటి అన్ని అంశాలు పరిగణనలోనికి తీసుకుని నిర్ణయం ప్రకటించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.

సగటు తెలంగాణ ప్రజలు భయపడినట్లుగానే కాంగ్రెస్‌లో పదవుల కోసం కుమ్ములాట జరుగుతోంది. ఫలితాలు వెలువడి 48 గంటలు కావొస్తున్నా ఇప్పటి వరకు సీఎం ఎవరు అన్నది తేలలేదు. ఇప్పటికే కసరత్తులు, ప్రయత్నలు జరుగుతుండగా.. ఢిల్లీ నుంచి వచ్చే ఆదేశాల కోసం ఆసక్తిగా ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదే చూసేవాళ్లకు కాంగ్రెస్ మారుతుందనుకోవడం భ్రమే అనిపిస్తోంది. అధిష్టానం నిర్ణయమే తమకు శిరోధార్యం అని పైకి చెప్పే నేతలు.. అన్ని విషయాల్లోనూ విభేదిస్తూనే వుంటారు. ఎవ్వరికీ పదేళ్లు అధికారానికి దూరంగా వున్నామన్న కనీస స్పృహ కూడా లేదు.. కాంగ్రెస్‌లో కుర్చీలాటను బీఆర్ఎస్, బీజేపీలు జాగ్రత్తగా గమనిస్తూ ఎంజాయ్ చేస్తున్నాయి. ఏమాత్రం ఛాన్స్ దొరికినా కేసీఆర్ తన విశ్వరూపం చూపిస్తారు. ఇది తెలిసి కూడా ఏ నేతా తగ్గడం లేదు. తన వల్లనే గెలుపు సాధ్యమైందని .. తానే తోపు అనుకుంటాడు. అదే కాంగ్రెస్‌తో వచ్చిన తంటా. 

ఈ సంగతి పక్కనబెడితే.. తెలంగాణలో కొత్త సీఎం ఎవరన్న దానిని తేల్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది. ఏఐసీసీ పరిశీలకులు, స్వయంగా కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఎంతగా నచ్చజెప్పాలని చూస్తున్నా సీఎం రేసులో వున్న రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు వినడం లేదని టాక్. అందుకే పెద్దలు ఇంతగా కష్టపడాల్సి వస్తోంది. కొందరు సీనియర్లు తమకు దక్కకపోయినా పర్లేదు కానీ .. రేవంత్‌ను మాత్రం సీఎంను కానిచ్చేది లేదన్నట్లుగా వున్నారు. ఇలా కాలం గడుపుతూ వుంటే జరగాల్సిన నష్టం జరిగిపోతూ వుంటుందన్న బాధ సగటు కాంగ్రెస్ కార్యకర్తలో వుంది. 

ALso Read: Telangana Elections 2023 : మరీ ఇంత దారుణమా..! కనీసం నోటాకు కూడా పోటీనివ్వని పవన్ పార్టీ

సీఎం రేసులో వున్న మాజీ టీపీసీసీ చీఫ్ , ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి తనకు పదవి దక్కాల్సిందేనన్న మొండి పట్టుదలతో వున్నట్లుగా కనిపిస్తోంది. ఆయన అభిప్రాయం తెలుసుసుకుందామని తెలుగు మీడియా ప్రతినిధులు పలకరించే ప్రయత్నం చేయగా కెప్టెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం ఎంపికలో ఎలాంటి తాత్సరం జరగలేదని, ఫలితాలు వచ్చి 48 గంటలు కూడా దాటలేదన్నారు. విధేయత, ట్రాక్ రికార్డ్, సొంత ఇమేజీ వంటి అన్ని అంశాలు పరిగణనలోనికి తీసుకుని నిర్ణయం ప్రకటించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. అక్కడి వరకు బాగానే వున్నా ఆ తర్వాత ఆయన చేసిన హాట్ హాట్ కామెంట్స్ మాత్రం ఆయన ఉద్దేశం ఏంటనేది చెబుతున్నాయి. 

తాను ఏడు సార్లు కాంగ్రెస్ నుంచి గెలిచానని, పార్టీని ఎప్పుడూ వీడలేదని, బయట నుంచి రాలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇందులో చివరి రెండూ పరోక్షంగా రేవంత్ రెడ్డిపై చేసినట్లుగానే అర్ధం చేసుకోవాలి. రేవంత్ తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. తొలి నుంచి కష్ట సుఖాల్లో పార్టీని అంటిపెట్టుకుని వున్నానని, ఏ బాధ్యత అప్పగించినా సమర్ధం చేశానని చెప్పడం ద్వారా తను అసలు సిసలు కాంగ్రెస్ వాదినని పేర్కొన్నారు . అలాంటి తనను కాదని రేవంత్ రెడ్డిని ఎలా సీఎం చేస్తారని ఉత్తమ్ బెట్టు చేస్తున్నట్లుగానే ఆయన మాటలు వున్నాయి. మరి ఇలాంటి విషమ పరిస్ధితుల్లో కాంగ్రెస్ హైకమాండ్ ఏం నిర్ణయం తీసుకున్నా అది కర్ర విరగకుండా పాము చావకుండా వుండాలి. ఏ మాత్రం తేడా వచ్చినా తెలంగాణ కాంగ్రెస్ నిట్టనిలువునా చీలడం మాత్రం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు. 

click me!