nakrekal assembly segmentలో సీపీఐ(ఎం)దే ఆధిపత్యం: మూడు దఫాలు కాంగ్రెస్ అభ్యర్థుల విజయం

Follow Us

సారాంశం

నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గంలో  మూడు దఫాలు మినహా    సీపీఐ(ఎం) అభ్యర్థులు విజయం సాధించారు.  ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నకిరేకల్ అసెంబ్లీ స్థానంలో  సీపీఐ(ఎం) కు పట్టుంది. 
 

నల్గొండ: మూడు దఫాలు మినహా మిగిలిన అన్ని ఎన్నికల్లో  నకిరేకల్ అసెంబ్లీ స్థానంలో సీపీఐ(ఎం) అభ్యర్థులే విజయం సాధించారు. నియోజకవర్గాల పునర్విభజనతో  2009లో ఈ అసెంబ్లీ స్థానం ఎస్‌సీలకు రిజర్వ్ అయింది.  అంతేకాదు ఈ నియోజకవర్గంలోని కొన్ని మండలాలు ఇతర నియోజకవర్గాల్లో  కలిశాయి. దీంతో  ఈ నియోజకవర్గంపై సీపీఐ(ఎం) పట్టును కోల్పోయింది. ఈ నియోజకవర్గం నుండి నర్రా రాఘవరెడ్డి అత్యధిక దఫాలు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న సమయంలో  ప్రజల సమస్యలను  లేవనెత్తిన చరిత్ర నర్రా రాఘవ రెడ్డికి ఉంది.

1957లో తొలిసారిగా  నకిరేకల్ అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరిగాయి.ఈ ఎన్నికల్లో బొమ్మగాని ధర్మబిక్షం విజయం సాధించారు. ఆ సమయంలో కమ్యూనిస్టులపై నిషేధం ఉంది. దీంతో  కమ్యూనిస్టు పార్టీ అభ్యర్ధులు పీడీఎఫ్  (ప్రొగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్) పేరుతో  పోటీ చేశారు.  1962లో  ఇదే అసెంబ్లీ స్థానం నుండి నంద్యాల శ్రీనివాస్ రెడ్డి సీపీఐ  అభ్యర్దిగా పోటీ చేసి విజయం సాధించారు. 1964లో కమ్యూనిస్టు పార్టీల మధ్య చీలిక వచ్చింది. సీపీఐ పార్టీ  సీపీఐ(ఎం) గా విడిపోయింది.1967 లో  నకిరేకల్ నుండి నర్రా రాఘవరెడ్డి  తొలిసారిగా ఈ స్థానం నుండి సీపీఐ(ఎం) అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు.  1972లో  నకిరేకల్ నుండి మరోసారి నర్రా రాఘవరెడ్డి  పోటీ చేశారు. అయితే నర్రా రాఘవరెడ్డిపై  కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలోకి దిగిన  మూసపాటి కమలమ్మ విజయం సాధించారు. 1978లో  నకిరేకల్ నుండి సీపీఐ(ఎం) అభ్యర్ధిగా  నర్రా రాఘవరెడ్డి బరిలోకి దిగి విజయం సాధించారు. 1978 నుండి 1994 వరకు  నర్రా రాఘవరెడ్డి సీపీఐ(ఎం) అభ్యర్ధిగా ఈ స్థానం నుండి వరుస విజయాలు సాధించారు.  1999 అసెంబ్లీ ఎన్నికల్లో నర్రా రాఘవరెడ్డి పోటీ చేయలేదు. 

1999 ఎన్నికల్లో  సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు  నోముల నరసింహయ్యను బరిలోకి దిగాడు. ఆ సమయంలో  నోముల నరసింహయ్య  నకిరేకల్ మండల పరిషత్ అధ్యక్షుడిగా ఉన్నారు.1999, 2004 ఎన్నికల్లో  సీపీఐ(ఎం) అభ్యర్ధి నోముల నరసింహయ్య విజయం సాధించారు.  2009 ఎన్నికల సమయంలో ఈ నియోజకవర్గం ఎస్‌సీలకు రిజర్వ్ అయింది. అంతేకాదు  కొన్ని మండలాలు ఇతర నియోజకవర్గాల్లో కలిశాయి.  ఈ పరిణామాలతో  2009లో జరిగిన ఎన్నికల్లో  ఈ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధి చిరుమర్తి లింగయ్య పోటీ చేసి విజయం సాధించారు.  

also read:N.T.Rama Rao...1989లో కల్వకుర్తిలో ఎన్‌టీఆర్ ఓటమి, చిత్తరంజన్ దాస్ గెలుపు:కారణాలివీ..

2014 ఎన్నికల్లో  బీఆర్ఎస్ అభ్యర్ధిగా బరిలోకి దిగిన  వేముల వీరేశం  విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2018 ఎన్నికల్లో  కాంగ్రెస్ అభ్యర్ధి  చిరుమర్తి లింగయ్య  మరోసారి  విజయం సాధించారు. గత ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో చిరుమర్తి లింగయ్య  కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరారు.  మరోసారి  బీఆర్ఎస్ అభ్యర్థిగా చిరుమర్తి లింగయ్య బరిలోకి దిగుతున్నారు.  వేముల వీరేశం ఇటీవలనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ తరపున వేముల వీరేశం బరిలోకి దిగుతున్నారు.

నకిరేకల్ లో ఇప్పటివరకు  విజయం సాధించిన అభ్యర్థులు

1957- ధర్మబిక్షం (పీడీఎఫ్)
1962-   నంద్యాల శ్రీనివాస్ రెడ్డి (సీపీఐ)
1967- నర్రా రాఘవరెడ్డి (సీపీఎం)
1972-  ఎం. కమలమ్మ( కాంగ్రెస్)
1978-  నర్రా రాఘవరెడ్డి
1983- నర్రా రాఘవరెడ్డి
1985- నర్రా రాఘవరెడ్డి
1989- నర్రా రాఘవరెడ్డి
 1994-  నర్రా రాఘవరెడ్డి 
 1999-  నోముల నరసింహయ్య
2004-  నోముల నరసింహయ్య
2009-  చిరుమర్తి లింగయ్య( కాంగ్రెస్)
2014-  వేముల వీరేశం ( బీఆర్ఎస్)
2018-   చిరుమర్తి లింగయ్య (కాంగ్రెస్)