బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ రాష్ట్ర వ్యాప్తంగా పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉదయం,రాత్రి పూట తన నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. మిగిలిన సమయంలో బీజేపీ అభ్యర్ధుల తరపున ప్రచారం నిర్వహిస్తున్నారు.
సంగారెడ్డి: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ హామీ ఇచ్చారు.
ఆదివారంనాడు నారాయణఖేడ్ లో నిర్వహించిన ఎన్నికల సభలో బండి సంజయ్ పాల్గొన్నారు. నారాయణఖేడ్ లో అసలైన ఆట మొదలైంది. 3 ఎకరాల సామాన్యుడికి, 3వేల ఎకరాల అసాములకు మధ్య యుద్దం స్టార్ట్ అయ్యిందన్నారు. మీరు ఆ గట్టు(ఆసాముల)న ఉంటారా? ఈ గట్టున(సామాన్యుడు సంగప్ప) పక్షాన ఉంటారా.. తేల్చుకోవాలని ఆయన ప్రజలను కోరారు. ఫ్యాక్షన్ రాజకీయాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ 70 ఏళ్లుగా రెండు కుటుంబాలే పెత్తనం చెలాయిస్తున్నాయని ఆయన ఆరోపించారు. అంతేకాదు నారాయణఖేడ్ అభివృద్ధి కాకుండా అడ్డుకుంటున్నాయని బండి సంజయ్ చెప్పారు. ఇకపై ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, మీకు సంగప్ప అండగా ఉంటారన్నారు. సంగప్ప వెనుక తాను… ప్రధాని మోదీ ఉన్నారని బండి సంజయ్ భరోసా ఇచ్చారు.
undefined
బీజేపీ అభ్యర్ధి సంగప్పతో కలిసి ఫంక్షన్ హాలులో జరుగుతున్న రాజశ్యామల యాగానికి బండి సంజయ్ హాజరయ్యారు. అక్కడి నుండి భవానీ మందిరంలోకి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కర్నాటక ఎమ్మెల్యే ప్రభు చౌవాన్, సంగప్పతో కలిసి మంగళ్ పేట భవానీ మందిర్ నుండి బసవేశ్వర చౌక్ వైపుగా రోడ్ షో నిర్వహించారు. అనంతరం బసవేశ్వర చౌక్ వద్ద ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
సంగప్ప డేంజర్… పట్టుపట్టిండంటే సంగతి చూసేదాకా వదిలిపెట్టడని చెప్పారు. నేను ప్రజాసంగ్రాయ యాత్ర చేసినప్పుడు, ఆ తరువాత నాతో ఉండి అనేక సలహాలు, సూచనలిచ్చి నడిపించాడని ఆయన గుర్తు చేసుకున్నారు.నారాయణఖేడ్ వస్తే మస్త్ బాధైతుందే…. అసలు మనం తెలంగాణలోనే ఉన్నామా? అన్పిస్తుందన్నారు.నీళ్లు లేవు, పనుల్లేవు, ఉద్యోగాల్లేవు… ఇండ్లు లేవు.. ఇది వెనుకబాటుతనం నేనెక్కడా చూడలేదని ఆయన చెప్పారు.
ఒకవైపు మంజీరా… ఇంకోవైపు సింగూరు, మరోవైపు నిజాంసాగర్, నాలుగో దిక్కు నల్లవాగు… అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్ల శని ఉన్నట్లు… తలాపునే నీళ్లున్నా మెట్టపంటలు వేసుకుని వానలపై ఆధారపడి బతకాల్సిన మీకెందుకు పట్టిందే అని బండి సంజయ్ ను ప్రశ్నించారు.కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తే ఇక్కడున్న రెండు పెద్ద కుటుంబాలు నారాయణఖేడ్ ను వెనక పడేసినట్టుగా సంజయ్ విమర్శించారు.
70 ఏళ్ల నుండి ఈ రెండు కుటుంబాల పాలన నారాయణఖేడ్ లో నడుస్తోంది. మీరెట్లా భరిస్తున్నారని బండి సంజయ్ అడిగారు. ఇప్పటికీ రోడ్లు, నీళ్లు లేవు, ప్రాజెక్టుల్లేవు, ఫ్యాక్టరీల్లేవ్… ఇంత ఘోరమా? అసలు మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? అని అడిగారు.
సంగప్పన్న మామూలోడు కాదే…మీడియాలో ఉన్నప్పుడే నారాయణఖేడ్ సహా రాష్ట్రంలోని సమస్యలపై పోరాటం చేసిండు.. నారాయణఖేడ్ ప్రజల కష్టాలు, కన్నీళ్లను, బాధను వెలుగులోకి తీసుకొచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నా దగ్గరికి వచ్చి అన్నా.. నేను బీజేపీలో చేరతానన్నడు.. నీ లక్ష్యం ఏందని అడిగితే… నారాయణఖేడ్ ను అభివృద్ది చేసి… వాళ్ల జీవితాల్లో వెలుగులు నింపడమే తన లక్ష్యమని చెప్పారన్నారు. నారాయణఖేడ్ లో అసలైన రంగస్థల యుద్దం మొదలైంది… మీరే తేల్చుకోండి… ఆ గట్టున ఉంటారా… ఈ గట్టున ఉంటారా? తేల్చుకోండన్నారు.
ఇది అభివ్రుద్ది గట్టు… మీ బతుకులు మార్చే గట్టు… మీకు ఉపాధి, ఉద్యోగాలు కల్పించి మీ జీవితాల్లో వెలుగులు నింపే గట్టు… అది అవినీతిగట్టు..ఫ్యాక్షన్ రాజకీయాల గట్టు… మీ బతుకులను గడీల్లో ఉంచే గట్టు… మిమ్ముల్ని, మీ పిల్లలను కూలీలుగా, బిచ్చగాళ్లుగా మార్చి బాంచన్ దోర అనేలా చేసే గట్టు… ఎటువైపు ఉంటారో తేల్చుకోవాలని బండి సంజయ్ కోరారు.
ఫ్యాక్షన్ కుటుంబాలు కదా.. ఏం చేస్తాయోననే భయం మీకు అవసరం లేదు…మీకు అండగా సంగప్ప ఉన్నడు.. సంగప్ప వెనుక నేనున్నా… నా వెనుక ‘ది బాస్’ మోదీగారున్నారని ఆయన చెప్పారు. ధైర్యంగా ఉండండి.. ఎవడైనా మిమ్ముల్ని బెదిరిస్తే ఉరికించి ఉరికించి కొట్టండి.. మేం చూసుకుంటామని బండి సంజయ్ చెప్పారు.
కేసీఆర్ కు అవకాశమిస్తే రాష్ట్ర ప్రజల బతుకులను బర్ బాద్ చేసిండు.. సిగ్గు లేకుండా ఓట్ల కోసం బాబ్రీమసీదు గురించి మాట్లాడుతున్నడు… కేసీఆర్ పిరికిపంద… నేను కరసేవ చేశానని గర్వంగా చెబుతా… నేనడుగుతున్నా… అయోధ్యలో రాముడు జన్మించారా? లేదా? కేసీఆర్ చెప్పాలే.. పొరపాటున కేసీఆర్ కు మళ్లీ అవకాశమిస్తే… రాముడు అయోధ్యలోనే పుట్టలేదంటాడు జాగ్రత్తగా ఉండాలని ఆయన ప్రజలను కోరారు.
14 వందల మంది యువకుల చావుకు కారణం కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏడుందని ఆయన ప్రశ్నించారు. ఏ ఎన్నికల్లోనూ ఆ పార్టీకి డిపాజిట్లే రాలేదన్నారు. బీఆర్ఎస్ కు అవకాశమిస్తే గుడిని మింగితే… కాంగ్రెస్ గెలిస్తే గుడితోపాటు లింగాన్ని కూడా మింగేసే రకమని ఆయన ఎద్దేవా చేశారు.తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. సంగప్ప గెలుపు తథ్యమని సర్వేలు చెబుతున్నాయన్నారు.
తెలంగాణకు కేంద్రం పెద్ద ఎత్తున నిధులొచ్చాయన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ది పనులన్నింటికీ నిధులిస్తోంది కేంద్రమేనని చెప్పారు. 161 నేషనల్ హైవే ద్వారా నారాయణఖేడ్ రూపురేఖలను సగం వరకు మార్చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నిజాంపేట…బీదర్ నేషనల్ హైవే సర్వే పూర్తయింంది… త్వరలోనే పనులు స్టార్ట్ కాబోతున్నాయన్నారు. సంగప్పను గెలిపిస్తే… ఆదిలాబాద్ … పటాన్ చెరువు… నారాయణఖేడ్ నియోజకవర్గం మీదుగా రైల్వే లైన్ ను తీసుకొస్తామన్నారు.
నారాయణఖేడ్ ఇండస్ట్రీస్ హబ్ చేస్తామన్నారు. ఇండస్ట్రీలు, ఫ్యాక్టరీ తీసుకొచ్చి మీ అందరికి ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తామన్నారు. ఇక్కడున్న పేదలందరికీ ఉచిత విద్య, వైద్యం అందిస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు. లింగాయత్ లకు, ఆరెమరాఠా కమ్యూనిటీలకు ఓబీసీ జాబితాలో చేర్చడం కూడా 90 శాతం అయ్యిందన్నారు. త్వరలోనే మోడీ ఈ విషయాన్ని ప్రకటించనున్నారన్నారు.