సైనికుడి కూతురిని, నీకు భయపడను: కేసీఆర్‌కు రేణుక వార్నింగ్

By Siva KodatiFirst Published Apr 9, 2019, 12:57 PM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత, ఖమ్మం అభ్యర్థి రేణుకా చౌదరి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత, ఖమ్మం అభ్యర్థి రేణుకా చౌదరి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఖమ్మంలోని రేణుక మద్ధతుదారుల ఇళ్లతో పాటు వారు బస చేసిన హోటల్‌పై పోలీసులు దాడులు చేశారు.

దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రేణుక చౌదరి వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలను వెంటబెట్టుకుని నగరంలోని మయూరి సెంటర్‌ రాస్తారోకో నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసిన ఆమె ప్రభుత్వ విధానాలను తప్పు బట్టారు.

మహిళలకు ఈ రాష్ట్రంలో భద్రత లేదని...ఎటువంటి ముందుస్తు సమాచారం లేకుండా మహిళలు బస చేస్తున్న హోటల్ గదులపై దాడులు ఎలా చేస్తారని ఆమె ప్రశ్నించారు. ఈ తరహా చర్యలతో ముఖ్యమంత్రి రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని రేణుక ఆరోపించారు.

తానొక సైనికాధికారి కుమార్తెనని ఇలాంటి చర్యలకు తాను భయపడనని కేసీఆర్‌కు చురకలు అంటించారు. కనీసం దాడుల సమయంలో మహిళల వెంట మహిళా కానిస్టేబుళ్లు కూడా లేరని రేణుక దుయ్యబట్టారు.

మోడీ, కేసీఆర్‌లు ఒకే నాణానికి బొమ్మ, బొరుసు లాంటి వారని కేసీఆర్‌కు ఓటేస్తే మోడీకి వేసినట్లేనని ఆమె ఎద్దేవా చేశారు. పోలీసులు తీరుపై తాము ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ఆమె స్పష్టం చేశారు. జరిగిన సంఘటనపై రేణుక.. జిల్లా ఎన్నికల ప్రధానాధికారితో పాటు నగర పోలీస్ కమిషనర్‌ను కలిసి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. 

click me!