కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌లో వంద మంది ఎంపీలు: కేటీఆర్

By narsimha lodeFirst Published Mar 6, 2019, 3:08 PM IST
Highlights

కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలతో కేసీఆర్ టచ్‌లో ఉన్నారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు

కరీంనగర్:  కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలతో కేసీఆర్ టచ్‌లో ఉన్నారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. ఈ పార్టీలన్నీ కూడ వచ్చే ఎన్నికల్లో  70 నుండి వంద సీట్లను కైవసం చేసుకొంటాయని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్రంలో ప్రధానమంత్రిని ఎన్నుకోవడంలో ఈ పార్టీలు కీలకంగా వ్యవహరించనున్నాయన్నారు.

బుధవారం నాడు కరీంనగర్  పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

 దేశంలోని పలు రాష్ట్రాల్లో  పలు  సంస్థలు నిర్వహించిన సర్వేల్లో  150 కంటే ఎక్కువ సీట్లు  బీజేపీకి రావని తేలిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి 100 కంటే ఎక్కువ సీట్లు దక్కవన్నారు.  రాష్ట్రంలోని అందరూ ఎంపీలను గెలిపిస్తే  కేంద్రంలో ఎవరూ అధికారంలో ఉండాలనే విషయాన్ని  కేసీఆర్ నిర్ణయిస్తారని చెప్పారు.

రాష్ట్ర వ్యాప్తంగా 42 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నట్టు చెప్పారు.2014 ఎన్నికల్లో రాష్ట్రంలో 11 ఎంపీ స్థానాలను మాత్రమే కట్టబెట్టారని చెప్పారు. ఆ ఎన్నికల సమయంలో మోడీపై ప్రజలకు భ్రమలు ఉన్నాయని ఆయన  ఆరోపించారు.

మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ సంస్థలను దేశ వ్యాప్తంగా అన్ని  రాష్ట్రాల్లో అమలు చేయాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. మిషన్ భగీరథకు నిధులు ఇవ్వాలని  నీతి ఆయోగ్ కోరినా కూడ కేంద్రం చిల్లిగవ్వ ఇవ్వలేదన్నారు.

పార్లమెంట్‌లో కేసీఆర్ తొలిసారి అడుగుపెట్టింది కరీంనగర్ నుండేనని కేటీఆర్ గుర్తు చేశారు. కరీంనగర్ ప్రజలు ఎప్పుడూ కూడ చైతన్యవంతులుగా తమ తీర్పును ఇచ్చారన్నారు.2006 ఉప ఎన్నికల్లో  టీఆర్ఎస్‌కు  పునర్జన్మను ఇచ్చిందన్నారు. 2006 కరీంనగర్ ఉప ఎన్నిక ద్వారానే తన రాజకీయ యాత్ర ప్రారంభమైందని కేటీఆర్ ఈ సభలో గుర్తు చేసుకొన్నారు.

తెలంగాణ రాష్ట్రానికి తొలిసారిగా సీఎంగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ ప్రారంభించిన  సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని చెప్పారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు దక్కించుకొన్నట్టుగానే రాష్ట్రంలోని అన్ని ఎంపీ సీట్లను కైవసం చేసుకోవాల్సిన అవసరం ఉందని కేటీఆర్ నొక్కి చెప్పారు.

పొరపాటున  ఒక్కటి రెండు ఎంపీ సీట్లను  కాంగ్రెస్ గెలిస్తే... కాంగ్రెస్ ఎంపీలంతా ఢిల్లీకి గులామ్‌లేనని ఆయన విమర్శించారు.  తెలంగాణ ప్రజలకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పనిచేస్తారా అని ఆయన ప్రశ్నించారు.

రాష్ట్రానికి చెందిన పాలమూరు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ప్రధానమంత్రిని కోరితే ఆయన కనీసం స్పందించలేదని చెప్పారు.అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు కేటీఆర్ చెప్పారు. బూత్‌ల వారీగా టార్గెట్లను నిర్ధేశించుకొని  పనిచేయాలని కేటీఆర్ పార్టీ కార్యకర్తలకు సూచించారు.
 

click me!