తెలంగాణలో 20 మందికి గాలం: బిజెపికి టచ్ లో ఉన్న కాంగ్రెస్ నేతలు వీరే...

By telugu teamFirst Published Mar 21, 2019, 1:24 PM IST
Highlights

కాంగ్రెసు నేత డికె అరుణ బిజెపిలో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు కాంగ్రెసు నేతలు బిజెపిలోకి క్యూ కడతారనే ప్రచారం ప్రారంభమైంది. కాంగ్రెసు సీనియర్ నేత కె. జానా రెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి బిజెపిలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్: తెలంగాణలో ఇతర పార్టీల నాయకులను తమ పార్టీలోకి లాక్కునేందుకు బిజెపి నాయకత్వం ఆపరేషన్ లోటస్ ప్రారంభించింది. తెలంగాణ లోకసభ ఎన్నికల్లో టికెట్లు దక్కని నేతలకు, కాంగ్రెసు సీనియర్ నేతలకు బిజెపి గాలం వేస్తోంది. దాదాపు 20 మంది నాయకులు తమ పార్టీలో చేరుతారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ చెబుతున్నారు.

కాంగ్రెసు నేత డికె అరుణ బిజెపిలో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు కాంగ్రెసు నేతలు బిజెపిలోకి క్యూ కడతారనే ప్రచారం ప్రారంభమైంది. కాంగ్రెసు సీనియర్ నేత కె. జానా రెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి బిజెపిలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనకు నల్లగొండ లోకసభ సీటు ఇస్తామని బిజెపి హామీ ఇస్తున్నట్లు సమాచారం. 

అదే విధంగా కాంగ్రెసు మాజీ మంత్రి ముఖేష్ గౌడ్, ఆయన కుమారుడు విక్రం గౌడ్ ను బిజెపి నాయకులు దువ్వుతున్నట్లు సమాచారం. నారాయణపేటకు చెందిన శికుమార్ రెడ్డిని కూడా తమ వైపు లాక్కునేందుకు బిజెపి నాయకులు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. 

జనగామకు చెందిన కొమ్మూరి ప్రతాపరెడ్డి బిజెపిలో చేరే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. గతంలో ఆయన బిజెపి నుంచి కాంగ్రెసు పార్టీలో చేరారు. ఆయన భువనగిరి లోకసభ సీటును ఆశించారు. అయితే, ఆ సీటును కాంగ్రెసు అధిష్టానం కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కేటాయించింది. దీంతో కొమ్మూరి ప్రతాపరెడ్డి బిజెపిలో చేరి భువనగిరి టికెట్ దక్కించుకోవాలని చూస్తున్నట్లు చెబుతున్నారు. 

కాంగ్రెసు నేతలు అద్దంకి దయాకర్, బెల్లయ్య నాయక్ లకు కూడా బిజెపి గాలం వేస్తున్నట్లు సమాచారం. బెల్లయ్య నాయక్ కు మహబూబ్ బాద్ టికెట్ ఇస్తామని చెబుతున్నట్లు తెలుస్తోంది. మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణకు బిజెపి మల్కాజిగిరి లేదా వరంగల్ లోకసభ సీటు కేటాయిస్తామని చెబుతున్నారు. అలాగే, మాజీ రాష్ట్ర మంత్రి సునీతా లక్ష్మా రెడ్డికి మెదక్ టికెట్ ఆశ పెడుతున్నారు. 

సర్వే సత్యనారాయణ, సునీతా లక్ష్మారెడ్డి బిజెపిలోకి వెళ్లే విషయంలో ఊగిసలాడుతున్నారు. సునీతా లక్ష్మా రెడ్డిని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నాయకులు కూడా సంప్రదిస్తున్నట్లు సమాచారం. 

ఇదిలావుంటే, టికెట్లు దక్కని టీఆర్ఎస్ లోకసభ సభ్యులను కూడా లాక్కునేందుకు బిజెపి నాయకులు ప్రయత్నాలు ప్రారంభించారు. పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జితెందర్ రెడ్డి పేర్లు ఇందులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. 

click me!