కరోనా మహమ్మారి స్రుష్టించిన కల్లోలంతో మిలియన్ల మంది అమెరికన్లు తమ ఉద్యోగాలను కోల్పోతున్న సమయంలో రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ శుభవార్త చెప్పింది. రానున్నకాలంలో దాదాపు 50 వేల మంది ఉద్యోగులను నియమించుకోవాలని భావిస్తున్నట్టు వెల్లడించింది.
వాషింగ్టన్: కరోనా మహమ్మారి స్రుష్టించిన కల్లోలంతో మిలియన్ల మంది అమెరికన్లు తమ ఉద్యోగాలను కోల్పోతున్న సమయంలో రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ శుభవార్త చెప్పింది. రానున్నకాలంలో దాదాపు 50 వేల మంది ఉద్యోగులను నియమించుకోవాలని భావిస్తున్నట్టు వెల్లడించింది.
డిమాండ్‌కు అనుగుణంగా వాల్‌మార్ట్‌లో నియామకాలు
కరోనా వైరస్, లాక్ డౌన్ సమయంలో వినియోగదారుల నుండి కిరాణా, గృహ అవసరాలకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ఈ నియామకాలు చేపట్టామని వాల్‌మార్ట్ శుక్రవారం ప్రకటించింది. 1.50 లక్షల మందిని నియమించుకోవాలన్న తమ గత లక్ష్యాన్ని 6 వారాలముందే చేరుకున్నామని, సగటున రోజుకు 5,000 మంది చొప్పున తీసుకున్నామని వెల్లడించింది.
ఉద్యోగుల నియామకానికి వాల్ మార్ట్ ఇలా
తాజాగా వాల్‌మార్ట్ దుకాణాలు, క్లబ్బులు, కార్పొరేట్ ఆఫీసులు, ఇతర పంపిణీ కేంద్రాల్లో 50 వేల మంది కార్మికులను నియమించు కుంటామని వాల్‌మార్ట్ యూఎస్ ప్రెసిడెంట్ జాన్ ఫర్నర్ తెలిపారు. తమ ఉద్యోగలు మాస్క్‌లు, శానిటైజేషన్ లాంటి నిబంధనలు పాటించాల్సి అవసరం ఉన్నదని పేర్కొన్నారు.
మే చివరి వరకు వాల్‌మార్ట్ అత్యవసర సెలవుల విధానం
కంపెనీ అత్యవసర సెలవుల విధానాన్ని మే చివరి దాకా పొడిగిస్తున్నట్టు వాల్‌మార్ట్ యూఎస్ ప్రెసిడెంట్ జాన్ ఫర్నర్ వెల్లడించారు. కాగా కరోనా మహమ్మారి వ్యాప్తిని నియంత్రించే చర్యల్లో ప్రపంచ వ్యాప్తంగా కఠినమైన ఆంక్షలు కొనసాగుతున్నాయి. లాక్ డౌన్ వల్ల ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి.
ఆహారం, హ్యాండ్ శానిటైజర్ వంటి వస్తువులకు డిమాండ్
అయితే ఆహారం, హ్యాండ్ శానిటైజర్, టాయిలెట్ పేపర్, ఇతర గృహోపకరణాలకు డిమాండ్ భారీగా పుంజుకోవడంతో అమెజాన్ సంస్థ వేల మందిని నియమించున్నట్టు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. పలు దేశాల్లో లాక్‌డౌన్ సందర్భంగా ఎలక్ట్రానిక్ వస్తువులతోపాటు గ్రాసరీ సెక్షన్, ఫేస్ మాస్క్ తదితర పరికరాలను సరఫరా చేస్తున్నాయి.
కరోనాపై పోరుకు వాల్ మార్ట్, ఫ్లిప్ కార్ట్ 38.3 కోట్ల విరాళాలు
కరోనా పై పోరులో ముందుండి పోరాడుతున్న వారు, రైతులు, చిన్న తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు గ్లోబల్ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ ఫౌండేషన్ , ఫ్లిప్‌కార్ట్ ముందుకు వచ్చాయి. భారతదేశంలో కోవిడ్-19 పోరాటానికి తమ మద్దతు అందిస్తామని, ఇందుకు రూ. 38.3 కోట్ల విరాళాలను అందిస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది. దీనికి అదనంగా సుమారు రూ. 8 కోట్ల విరాళం ఓ స్వచ్ఛంద సంస్థకు ప్రకటించింది.
పీపీఈ, మాస్కులు సరఫరాపై ఫోకస్
ఆరోగ్య సంరక్షణ కార్మికులకు కీలక వ్యక్తిగత రక్షణ పరికరాలను (పీపీఈ), రైతులకు, చిన్నవ్యాపారులకు అవసరమైన సహాయ సామగ్రిని, నిధులను అందించే సంస్థలకు నిధులు ఇస్తామని శనివారం ప్రకటించాయి. స్వచ్ఛంద సంస్థలు (ఎన్జీఓలు), పబ్లిక్ హెల్త్ కేర్ కార్మికులకు పంపిణీ చేయడానికి ఎన్ 95 మాస్క్‌లు, మెడికల్ గౌన్లు లాంటి పీపీఈలను అందించడంపై దృష్టి సారించినట్టు ఇరు సంస్థలు సంయుక్తంగా ప్రకటించాయి.
also read:అప్రమత్తమైన భారత్.. డ్రాగన్‌కు చెక్: ఎఫ్‌డీఐ నిబంధనలు కఠినం
గూంజ్, శ్రీజన్ సంస్థలకు వాల్ మార్ట్ అండ
ఇప్పటికే 3లక్షల మాస్క్‌లు, పది లక్షల మెడికల్ గౌన్లను అందించిన సంస్థ బలహీన వర్గాలకు మద్దతిస్తున్న గూంజ్, శ్రీజన్ అనే స్వచ్ఛంద సంస్థకు తాజా 7.7 కోట్లను అదనంగా ఇస్తోంది. ఇండియాలోని కస్టమర్లు, భాగస్వాములు కరోనాకు తీవ్రంగా ప్రభావితం అయ్యారని, ఈ సమయంలోవారికి తమ మద్దతు ఉంటుందని వాల్‌మార్ట్ ఫౌండేషన్ అధ్యక్షుడు కాథ్లీన్ మెక్ లాఫ్లిన్ పేర్కొన్నారు.
ప్రైవేట్, ప్రభుత్వ రంగాలతో కలిసి పని చేస్తున్నాం: ఫ్లిప్‌కార్ట్
కరోనా సంక్షోభంలో బాధితులను ఆదుకునేందుకు తమ బృందం 24 గంటలు కృషి చేస్తోందని, ఈ విషయంలో తమ నిబద్ధతలో భాగంగానే అత్యవసర సహాయక చర్యలపై భారతదేశంలోని ప్రైవేట్, ప్రభుత్వ రంగాలతో కలిసి పనిచేస్తున్నామని ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీఈఓ కళ్యాణ్ కృష్ణమూర్తి అన్నారు.