చేయూతనివ్వకుంటే.. అంతే సంగతులు: టెల్కోలపై కొటక్

By Sandra Ashok Kumar  |  First Published Nov 18, 2019, 11:05 AM IST

వార్షిక సర్దుబాటు స్థూల ఆదాయం (ఏజీఆర్) గణన విషయమై టెలికం సంస్థలను ఆదుకునేందుకు కేంద్రం ముందుకు రాకుంటే మరికొన్ని సంస్థలు కనుమరుగయ్యే అవకాశం ఉన్నదని కొటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ సర్వే తేల్చింది. కేంద్రం ఉద్దీపన ప్యాకేజీపై కసరత్తు కమిటీని ఏర్పాటు చేసినా.. ఏ మేరకు చేయూతనిస్తుందన్నది మున్ముందు తేలుతుంది.


న్యూఢిల్లీ: భారత టెలికం పరిశ్రమ పరిస్థితి ఆందోళనకరమని కొటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ తెలిపింది. ప్రభుత్వ సాయం అందకపోతే మరిన్ని సంస్థలు దూరమయ్యే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేసింది.‘ఏజీఆర్‌పై టెలికం సంస్థలకు ప్రభుత్వం ఊరటనివ్వకపోతే దేశీయ మొబైల్ టెలికం పరిశ్రమ నుంచి మరిన్ని కంపెనీలు తప్పుకునే వీలుందని మేము విశ్వసిస్తున్నాం’ అని కొటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ ఇటీవలి సర్వేలో పేర్కొన్నది.

టెలికం సంస్థల వార్షిక సర్దుబాటు స్థూల ఆదాయం (ఏజీఆర్) గణనపై ఇటీవలి సుప్రీం కోర్టు తీర్పుతోనే కంపెనీలకు భీకర నష్టాలు వాటిల్లిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో వొడాఫోన్-ఐడియా లిమిటెడ్ రికార్డు స్థాయిలో రూ.50,921 కోట్ల నష్టాన్ని ప్రకటించగా, రిలయన్స్ కమ్యూనికేషన్స్ రూ. 30,142 కోట్లు నష్టం ప్రకటించింది.

Latest Videos

భారతీ ఎయిర్‌టెల్ రూ. 23,045 కోట్ల నష్టాన్ని చూపాయి. సుప్రీంకోర్టు తీర్పుతో వొడాఫోన్-ఐడియా రూ.44,150 కోట్లను, ఎయిర్‌టెల్ రూ.34,260 కోట్లను, ఆర్‌కామ్ రూ.28,314 కోట్లను టెలికం శాఖకు చెల్లించాల్సి వస్తుందని అంచనా. వీటిని లైసెన్స్ ఫీజు బకాయిగా, స్పెక్ట్రం వినియోగ చార్జీలుగా టెలికం కంపెనీలు ఇవ్వనున్నాయి.

also read టిక్ టాక్ లో మనమే మేటి... భారత్ కు లేదు పోటీ!

ఈ బకాయిలపై వడ్డీ, జరిమానాలు కూడా వర్తిస్తాయని అత్యున్నత న్యాయస్థానం ప్రకటించింది. దీంతో వొడాఫోన్-ఐడియా నుంచి రూ.54,184 కోట్లు, భారతీ ఎయిర్‌టెల్ నుంచి రూ.62,187 కోట్లు వస్తాయని టెలికం శాఖ అంటున్నది.ఏటా ఏజీఆర్ లెక్కింపులో టెలీకమ్యూనికేషన్ వ్యాపారేతర ఆదాయాన్నీ పరిగణనలోకి తీసుకుంటామన్న ప్రభుత్వ వాదనను సుప్రీంకోర్టు గత నెల సమర్థించిన సంగతి విదితమే.

దీంతో టెలికం పరిశ్రమలో ఒక్కసారిగా ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే తమను ఆదోకోవాలని టెలికం శాఖను వొడాఫోన్-ఐడియా, భారతీ ఎయిర్‌టెల్‌ కోరుతున్నాయి. సుప్రీంకోర్టు తీర్పుతో దేశీయ టెలికం పరిశ్రమపై రూ.1.4 లక్షల కోట్ల భారం పడిందని అంచనా.ఒకప్పుడు 10-15 సంస్థలు ఉన్న భారతీయ టెలికం పరిశ్రమలో ఇప్పుడు నాలుగే ఉన్నాయి.

అవి వొడాఫోన్-ఐడియా, భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, బీఎస్‌ఎన్‌ఎల్ మాత్రమే. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే.. ఈ నాలుగింటిలోనూ కొన్ని దూరంకాక తప్పదన్న అభిప్రాయాన్ని కొటక్ వ్యక్తం చేస్తున్నది. ఇప్పటికే వొడాఫోన్ తాము భారత్‌ను వీడుతామన్న సంకేతాలనివ్వగా, దివాళా ప్రక్రియకు వెళ్తామని ఐడియా హెచ్చరించింది.

ఈ నేపథ్యంలో కొటక్ సెక్యూరిటీస్ విశ్లేషణ ప్రాధాన్యం సంతరించుకున్నది. వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులార్ కలిసి వొడాఫోన్-ఐడియా లిమిటెడ్‌గా ఏర్పడ్డాయి. ఎయిర్‌టెల్‌లో టాటా గ్రూప్ సంస్థలు, టెలినార్ ఇండియా విలీనమవగా, ప్రభుత్వ రంగ సంస్థలు బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్ కూడా ఏకమవుతున్న సంగతి విదితమే.

మరోవైపు ఇప్పటికే వేల ఉద్యోగాలు పోయాయని, సంస్థలు ఇంకా తగ్గిపోతే నిరుద్యోగ సమస్య ప్రమాద కరంగా పరిణమించే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.అనిల్ అంబానీ నేతృత్వంలోని రుణపీడిత సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) ఆస్తుల వేలానికి భారతీ ఎయిర్‌టెల్ దూరంగా ఉంటున్నది.

ఇందుకోసం దాఖలు చేసిన బిడ్లను ఉపసంహరించుకున్నది. ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో విజ్ఞప్తి మేరకు ఈ బిడ్డింగ్ ప్రక్రియ గడువును ఆర్‌కామ్ రుణదాతల కమిటీ (సీవోసీ) 10 రోజులు పొడిగించింది. దీన్నిఎయిర్‌టెల్ తప్పుబడుతున్నది. గడువు పెంపు నిర్ణయం పారదర్శకంగా లేదని, పక్షపాతంగా ఉందన్నది.

జియో పేరును ప్రస్తావించకుండా సీవోసీకి రాసిన ఓ లేఖలో ఎయిర్‌టెల్ ఫైనాన్స్ డైరెక్టర్ హర్జీత్ కోహ్లీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.ఈ నెల 25దాకా బిడ్లు సమర్పించేందుకు టెలికం సంస్థలకు సీవోసీ అవకాశం కల్పించింది. 122 మెగాహెట్జ్ స్పెక్ట్రంసహా అన్ని ఆస్తులనూ ఆర్‌కామ్ అమ్మకానికి పెట్టింది.

స్పెక్ట్రం విక్రయంతో సుమారు రూ.14 వేల కోట్లు రావచ్చని అంచనా. టవర్ వ్యాపారం ద్వారా రూ.7 వేల కోట్లు, ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ నుంచి రూ.3 వేల కోట్లు, డేటా సెంటర్ల అమ్మకంతో రూ.4 వేల కోట్లు వస్తాయని ఆశిస్తున్నారు.రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్థకు గల రూ.33 వేల కోట్ల రుణాలు వడ్డీలను కలిపితే ఇదిప్పుడు ఇంకా పెరిగిపోయింది.

ఈ ఏడాది ఆగస్టులో తమకు ఆర్‌కామ్ నుంచి సుమారు రూ.49 వేల కోట్లు రావాల్సి ఉందని రుణదాతలు ప్రకటించారు. ఈ సంస్థను దివాలా పరిష్కార నిపుణుడికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) అప్పగించిన విషయం తెలిసిందే.

ఒకప్పుడు ప్రపంచ టాప్-10 సంపన్నుల్లో ఒకరిగా ఉన్న అనిల్ అంబానీ.. ఇప్పుడు అప్పులు తీర్చేందుకు ఆస్తులను సైతం అమ్ముకోవాల్సిన దుస్థితిలో పడిపోయారు. 2005లో అన్న ముకేశ్ అంబానీతో కుటుంబ ఆస్తుల విభజనలో ఆర్‌కామ్‌ను అనిల్ అందుకున్నారు.

also read పెగాసస్ ను మరవక ముందే వాట్సాప్ లో మరో భద్రతా లోపం

తొలుత బాగానే సాగినా.. ఆ తర్వాత పెరిగిన పోటీ వాతావరణం, స్పెక్ట్రం అధిక చార్జీలతో కష్టాలు మొదలయ్యాయి.దేశ అత్యున్నత న్యాయస్థానమే ఏజీఆర్‌పై తీర్పు చెప్పినందున ఇక ప్రభుత్వంపైనే టెలికం సంస్థలు ఆశలు పెట్టుకున్నాయని వివిధ బ్రోకరేజీ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి.

సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని వొడాఫోన్-ఐడియా చెబుతున్నా.. ప్రభుత్వ సాయంపైనే ఎక్కువ శ్రద్ధ చూపుతున్నదని ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఎస్బీఐక్యాప్ సెక్యూరిటీస్ పేర్కొన్నాయి. న్యాయపోరాటం కంటే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి ఎక్కువ ప్రయోజనం పొందవచ్చన్న యోచనలో టెల్కోలున్నాయి.

మరోవైపు రిలయన్స్ జియో దీన్ని వ్యతిరేకిస్తుండటం కొంత ప్రతిబంధకంగా మారింది. ఇప్పటికే టెలికం పరిశ్రమకు ఉద్దీపనల అవసరం లేదని కేంద్ర టెలికం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు జియో లేఖ రాసిన విషయం తెలిసిందే. కాగా, గత నెల టెలికం రంగానికి ఉద్దీపనలు కల్పించేందుకు ఓ కార్యదర్శుల కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి విదితమే.

click me!