శాంసంగ్ ఈ ఏడాది క్యూ1 ఫలితాల్లో దేశీయంగా ప్రీమియం, సూపర్ ప్రీమియం స్మార్ట్ ఫోన్‌లపై భారీ ఎత్తున అమ్మకాలు జరిపింది. అయినా భారత్‌లో ఫీచర్ ఫోన్ అమ్మకూడదనే నిర్ణయం ఇతర ఫోన్ తయారీ సంస్థల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. కారణం ఏదైనా ఇకపై భారత్‌లో శాంసంగ్‌కు చెందిన ఫీచర్ ఫోన్‌లు కనుమరుగు కానున్నాయి.
ప్రముఖ గాడ్జెట్స్ కంపెనీ శాంసంగ్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. స్మార్ట్‌ఫోన్ల సెగ్మెంట్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోన్న ఈ దక్షణ కొరియన్ కంపెనీ స్మార్ట్‌ఫోన్ ప్రియులకు షాక్ ఇచ్చింది. భారత్‌లో ఫీచర్‌ఫోన్లను విక్రయించకూడదంటూ నిర్ణయం తీసుకున్న అతి కొద్ది రోజుల్లోనే మరో సంచలనానికి తెర తీసింది. అదే- స్మార్ట్‌ఫోన్ల ఉత్పత్తిని నియంత్రించడం.. ఏకంగా 30 మిలియన్ల ఫోన్ల ఉత్పత్తిని తగ్గించనున్నట్లు తెలిపింది. 2022 ఆర్థిక సంవత్సరంలో దీన్ని అమలు చేయనుంది.
భారత్‌లో ఫీచర్‌ఫోన్లను విక్రయించకూడదంటూ ఇటీవలే శాంసంగ్ నిర్ణయించిన విషయం తెలిసిందే. అందుబాటులో ఉండే ధరలతో ఇతర హ్యాండ్‌సెట్లను మాత్రమే అమ్మాలని భావిస్తోంది. దీనికోసం మరో రెండు సంస్థలతో 15,000 రూపాయల లోపు ఉన్న ఫోన్‌లను తయారు చేయనుంది. భారత్‌లో శాంసంగ్ ఫీచర్ ఫోన్ షిప్‌మెంట్ తగ్గడం వల్లే ఈ నిర్ణయం తీసుకుందా కంపెనీ. సప్లయ్ చైన్, అధిక రిటైల్ ద్రవ్యోల్బణం, కరోనా వైరస్ అనంతరం ఏర్పడిన సమస్యల వల్ల ఫీచర్ ఫోన్ షిప్‌మెంట్‌లో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న శాంసంగ్ ఇప్పుడు మూడో స్థానానికి దిగజారింది.
ఆయా పరిస్థితులన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు తాజాగా మరో బాంబు కూడా పేల్చింది. ఈ సంవత్సరంలోనే మూడుకోట్ల వరకు స్మార్ట్‌ఫోన్ల ప్రొడక్షన్‌ను తగ్గించాలని నిర్ణయించింది. 2022లో 310 మిలియన్ల ఫోన్లను ఉత్పత్తి చేయాలని తన భవిష్యత్ ప్రణాళికగా రూపొందించుకుంది మొదట్లో. ఇప్పుడు పునఃసమీక్షించుకుంది. 280 మిలియన్ల వరకే పరిమితం చేయనుంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తరువాత ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సమస్యలు, షిప్‌మెంట్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తన ఉత్పత్తిని తగ్గించిందని అంచనా.
కాగా- శాంసంగ్ స్మార్ట్‌ఫోన్లకు భారత్.. అతిపెద్ద మార్కెట్. ప్రీమియం, సూపర్ ప్రీమియం స్మార్ట్ ఫోన్లను 81శాతం మేరకు విక్రయించిందీ కొరియన్ ఎలక్ట్రానిక్ కంపెనీ. 30,000 వేల రూపాయలకు పైగా ఉన్న శాంసంగ్ స్మార్ట్ ఫోన్లు భారత్‌లో 38 శాతం అమ్ముడుపోయాయి. ఇప్పుడు తాజాగా తీసుకున్న నిర్ణయం వల్ల ఈ సెక్టార్‌లో తన ఆధిపత్యాన్ని కోల్పోయే అవకాశం లేకపోలేదని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి.