కరోనా కట్టడే ధ్యేయం పీఎం-కేర్స్‌ కోసం పేటీఎం రూ.100 కోట్ల సేకరణ

By narsimha lode  |  First Published Apr 12, 2020, 11:26 AM IST

కరోనా మహమ్మారి ఆట కట్టించేందుకు ప్రధాని నరేంద్రమోదీ ఏర్పాటు చేసిన పీఎం కేర్స్‌ ఫండ్‌కు చేయూత ఇచ్చేందుకు పేటీఎం కమ్యూనికేషన్స్ నిర్ణయించింది. ఇప్పటి వరకు ఈ నిధి కోసం తమ సంస్థ రూ.100 కోట్లు సేకరించినట్లు పేటీఎం ప్రకటించింది.


కరోనా మహమ్మారి ఆట కట్టించేందుకు ప్రధాని నరేంద్రమోదీ ఏర్పాటు చేసిన పీఎం కేర్స్‌ ఫండ్‌కు చేయూత ఇచ్చేందుకు పేటీఎం కమ్యూనికేషన్స్ నిర్ణయించింది. ఇప్పటి వరకు ఈ నిధి కోసం తమ సంస్థ రూ.100 కోట్లు సేకరించినట్లు పేటీఎం ప్రకటించింది.

రూ.500 కోట్ల నిధి సేకరణే లక్ష్యమన్న పేటీఎం
మున్ముందు రూ.500 కోట్ల సేకరణే లక్ష్యంగా పేటీఎం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది. దీనికి ఎవరైనా విరాళాలు అందించడానికి అనుమతించింది. పేటీఎం ద్వారా ఇచ్చే ప్రతి విరాళానికి, చేసే ప్రతి లావాదేవికీ తమ తరఫున అదనంగా రూ.10 కలుపుతామని తెలిపింది. 

Latest Videos

10 రోజుల్లో రూ.100 కోట్ల నిధి సేకరణ
కేవలం 10 రోజుల్లో రూ.100 కోట్లు సమకూరినట్లు సంస్థ సీనియర్‌ ఉపాధ్యక్షుడు అమిత్‌ వీర్‌ తెలిపారు.  ఈ నిధికి సంస్థలోని ఉద్యోగులు సైతం విరాళాలు అందజేసినట్లు తెలిపారు. కొంతమంది మూడు నెలల వేతనాలను కూడా విరాళంగా ఇచ్చినట్లు వెల్లడించారు. 

పీఎం కేర్స్‌లో ప్రజలు భాగస్వాములు కావాలి
ప్రజలంతా ముందుకు వచ్చి పీఎం-కేర్స్‌లో భాగస్వామ్యం కావాలని పేటీఎం పిలుపునిచ్చింది. అలాగే పేదవారి ఆకలి తీర్చడం కోసం కేవీఎన్‌ ఫౌండేషన్‌తో కలిసి ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి కూడా నిధులు అందజేయాలని కోరారు.

ఫారం 16లోనే పీఎం-కేర్స్‌ విరాళ వివరాలు 
కరోనా వైరస్‌ పోరులో భాగంగా పీఎం కేర్స్‌ సహాయనిధికి ఇచ్చే విరాళాలకు పన్ను మినహాయింపు వర్తిస్తుందని ఆదాయం పన్నుశాఖ ప్రకటించింది. ఈ నిధికి అందించే విరాళాలకు ఐటీ చట్టంలోని 80జీ కింద నూరు శాతం పన్ను మినహాయింపు ఉంటుందని పేర్కొన్న విషయం తెలిసిందే. 

యాజమాన్యాల ద్వారా ఇచ్చే విరాళాలకు ధ్రువ పత్రాలుండవ్
తమ యాజమాన్యం ద్వారా ఉద్యోగులు ఇచ్చే విరాళాలకు ప్రత్యేకంగా ఎలాంటి ధృవపత్రాన్ని జారీచేయబోమని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) పేర్కొంది. అయితే యాజమాన్యం ఉద్యోగులకు సంవత్సరం చివరలో ఇచ్చే ఫారం-16లో విరాళం ఇచ్చిన మొత్తాన్ని చూపుతాయని తెలిపింది. 

also read:కరోనా కట్టడే లక్ష్యం:ఇమ్యూనేషన్ పెంచుకోండి.. ఆయుష్ శాఖ అడ్వైజ్

టీడీఎస్ పత్రాన్నే రుజువుగా పరిగణించనున్నసీబీడీటీ
సంస్థల యాజమాన్యాలు, వాటి ఉద్యోగులు అందజేసిన విరాళాలకు వారు సమర్పించే టీడీఎస్‌ పత్రాన్నే విరాళం ఇచ్చిన దానికి రుజువుగా పరిగణిస్తామని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు పేర్కొంది. చాలా మంది ఉద్యోగులు తమ వేతనాల నుంచి విరాళాలు ఇస్తున్న నేపథ్యంలో సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ టాక్సెస్‌(సీబీడీటీ) స్పష్టతనిచ్చింది.
 

click me!