ఒక్కటైన యాపిల్, గూగుల్​.. కరోనాకు ఇక ‘స్మార్ట్’గా చెక్

By narsimha lode  |  First Published Apr 12, 2020, 10:10 AM IST

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం కరోనా వైరస్​ విజృంభిస్తోంది. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు చాలా దేశాలు లాక్​డౌన్​ విధించాయి. ఇలాంటి సమయాల్లో అధునాతన టెక్నాలజీ సాయంతో ఈ మహమ్మారి ఆట కట్టించేందుకు దిగ్గజ టెక్​ సంస్థలు యాపిల్, గూగుల్ కలిసి కృషి చేయనున్నాయి.


శాన్ ఫ్రాన్సిస్కో: ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం కరోనా వైరస్​ విజృంభిస్తోంది. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు చాలా దేశాలు లాక్​డౌన్​ విధించాయి. ఇలాంటి సమయాల్లో అధునాతన టెక్నాలజీ సాయంతో ఈ మహమ్మారి ఆట కట్టించేందుకు దిగ్గజ టెక్​ సంస్థలు యాపిల్, గూగుల్ కలిసి కృషి చేయనున్నాయి. కరోనా వైరస్​ కాంటక్ట్​లను ట్రేస్​ చేసేందుకు ఓ వేదికను సిద్ధం చేయనున్నట్లు ఈ రెండు సంస్థలు సంయుక్త ప్రకటనలో తెలిపాయి.

గూగుల్, ఆపిల్ మధ్య కుదిరిన ఈ ఒప్పందం ప్రకారం ఐఎఓస్​ ఆధారిత ఆపిల్​ ఫోన్లు, గూగుల్ ఆధ్వర్యంలోని ఆండ్రాయిడ్​​ ఫోన్ల మధ్య కరోనా వైరస్​కు సంబంధించిన సమాచారం 'ఆప్ట్​ ఇన్​ సిస్టమ్​' ద్వారా పరస్పరం మార్పిడి కానుంది. ఫలితంగా కరోనా బాధితులు ఎవరిని కలిశారన్నే సమాచార సేకరణకు బ్లూటూత్ ఆధారిత కాంటక్ట్ ట్రేసింగ్ అనే వ్యవస్థీక్రుత టెక్నాలజీని అందుబాటులోకి తేనున్నాయి.

Latest Videos

కాంటాక్ట్ ట్రేసింగ్ టెక్నాలజీ వినియోగంలో వ్యక్తులతోపాటు పలు యాప్‌లు, ప్రభుత్వ సంస్థలు, వైద్య ఆరోగ్య సంస్థలు కూడా చేరనున్నాయి. ఈ టెక్నాలజీ సాయంతో కరోనా మహమ్మారిని కట్టడి చేసి సాధారణ జన జీవనం పునరుద్ధరణకు క్రుషి చేస్తామని గూగుల్, ఆపిల్ తెలిపాయి. ఇందుకోసం ప్రభుత్వాలతోపాటు ప్రజారోగ్య వైద్య సిబ్బంది సహకారం తీసుకుంటామని స్పష్టం చేశాయి. 

ఈ టెక్నాలజీతో కరోనా సోకిన వ్యక్తిని యూజర్లు సమీపించినప్పుడు వెంటనే గుర్తించి వారిని గూగుల్, ఆపిల్ అప్రమత్తం చేయనున్నాయి. ఈ ప్రయత్నంలో భాగంగా వచ్చే నెల తొలి అడుగు పడనున్నది. ఐఓఎస్​, ఆండ్రాయిడ్​ వ్యవస్థలు రెండూ ప్రజా ఆరోగ్య యంత్రాంగం ఆధీనంలో పని చేసే అప్లికేషన్ల సమాచారాన్ని వినియోగించుకోనున్నాయి.

కరోనా వైరస్ వ్యాపించకుండా కట్టడి చేయడానికి అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ ఫేస్ (ఏపీఐ), ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్ టెక్నాలజీ అంశాల ఆధారంగా ఈ సమస్యకు పరిష్కారం చూపుతామని గూగుల్, ఆపిల్ తెలిపారు. 

ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు స్మార్ట్​ఫోన్​ లొకేషన్ ఆధారంగా వైరస్​ వచ్చిన వ్యక్తులను ఇతర వ్యక్తుల నుంచి దూరంగా ఉంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇలా చేస్తే వినియోగదారుల గోప్యతకు భంగం కలుగుతుందని తెలిసినా దీనిపై కసరత్తు చేస్తుండటం గమనార్హం. యాపిల్​, గూగుల్ సంస్థలు మాత్రం ఈ ప్రాజెక్టులో యూజర్ల వ్యక్తిగత గోప్యతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపాయి. 

బ్లూటూత్​ సామర్థ్యాలను వినియోగించుకుని, వైర్​లెస్​ డివైజ్​లు అయిన ఇయర్​బడ్స్​ వంటి వాటితో పరస్పర సమాచార మార్పిడి చేసుకోనున్నట్లు వెల్లడించాయి. దీని ద్వారా టెక్నాలజీ శక్తి ఏంటో నిరూపించాలని ఇరు సంస్థలు భావిస్తున్నాయి. ప్రపంచం కరోనా నుంచి కోలుకుని వీలైనంత త్వరగా తిరిగి సాధారణ స్థితికి రావాలని ఆశిస్తున్నాయి.

click me!