ఆ సంస్థలకు ‘నెట్‌ఫ్లిక్స్’

By Siva KodatiFirst Published Jul 28, 2019, 12:00 PM IST
Highlights

భారత్‌లో అవకాశాలను గమనించిన నెట్‌ఫ్లిక్స్‌ ఇక్కడ వినియోగదార్లను పెంచుకోవడం ద్వారా తన పోటీదార్లకు గట్టి సవాలు విసరడానికి సిద్ధమవుతోంది. ఈ ఏడాది భారత్‌లో తన వినియోగదార్ల సంఖ్యను 41 లక్షలకు పెంచుకుని 44 లక్షల కస్టమర్లు గల అమెజాన్‌ ప్రైమ్ దరిదాపుల్లోకి రావాలని భావిస్తోంది. 

మన నట్టింట్లో టీవీలో కార్యక్రమాలు అందరినీ ఆకర్షిస్తాయి. చిన్నారులైతే కార్టూన్స్.. కుర్రాళ్లతైతే సినిమాలు.. పెద్దలకు వార్తలు, ఆడవారికి సీరియళ్లు కట్టి పడేస్తుంటాయి. తాజాగా ఆమెజాన్, వాల్ డిస్నీ వంటి సంస్థలు కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రైమ్ టైం వీడియోలు అందుబాటులోకి తెచ్చాయి. ఇదీ మన డిజిటల్‌ ప్రపంచం.

తాజాగా భారత్‌లో అవకాశాలను గమనించిన నెట్‌ఫ్లిక్స్‌ ఇక్కడ వినియోగదార్లను పెంచుకోవడం ద్వారా తన పోటీదార్లకు గట్టి సవాలు విసరడానికి సిద్ధమవుతోంది. ఈ ఏడాది భారత్‌లో తన వినియోగదార్ల సంఖ్యను 41 లక్షలకు పెంచుకుని 44 లక్షల కస్టమర్లు గల అమెజాన్‌ ప్రైమ్ దరిదాపుల్లోకి రావాలని భావిస్తోంది. 

ఆ దిశగా వినియోగదార్లను ఆకట్టుకునేందుకు నెట్ ఫ్లిక్స్ సిద్ధమవుతోంది. ఇప్పటికే వాల్ట్‌ డిస్నీ, అమెజాన్‌.కామ్‌ వంటి అంతర్జాతీయ దిగ్గజాలతో పోటీ పడుతున్న ఈ సంస్థకు ఇతర బ్రాడ్‌క్యాస్టర్లు, బాలీవుడ్‌ ప్రముఖులతో ఒప్పందాలు చేసుకున్న సంస్థల నుంచి కూడా సవాలు ఎదురవుతోంది.
 
స్మార్ట్‌ ఫోన్ల సంఖ్య, బ్రాడ్‌బ్యాండ్‌ వినియోగం పెరగడంతో భారత్‌లో స్ట్రీమింగ్‌ సేవలకు మంచి గిరాకీ ఏర్పడుతోంది. ప్రస్తుతం ఈ కంపెనీకి ప్రపంచ వ్యాప్తంగా 15 కోట్ల మంది వినియోగదారులు ఉండగా.. అమెరికా, బ్రెజిల్‌, కెనడా అతిపెద్ద మార్కెట్లుగా ఉన్నాయి. 

ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలోని ఆస్ట్రేలియాలో నెట్ ఫ్లిక్స్ కంపెనీ మంచి విజయాన్ని సాధించింది. అయితే ఈ మార్కెట్లతో పోలిస్తే భారత్‌ మార్కెట్‌ విభిన్నం. ధర ఎక్కువ పెట్టడానికి భారతీయులు ఇష్టపడరు. ఈ నేపథ్యంలోనే మొబైల్‌ వినియోగదార్ల కోసం సగం ధరకే సబ్‌స్క్రిప్షన్‌ను ఇవ్వాలని ఈ కంపెనీ భావిస్తోంది. 

తద్వారా వినియోగదార్లను పెంచుకోగలమని నెట్ ఫ్లిక్స్ భావిస్తోంది. కానీ మార్జిన్లను ఎంత వరకు కాపాడుకుంటుందన్నదే అసలు ప్రశ్న. క్రికెట్‌ మ్యాచ్‌లను లైవ్‌ స్ట్రీమింగ్‌ ఇవ్వడం ద్వారా హాట్‌స్టార్‌ తన వినియోగదార్లను పెంచుకుంటోన్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే అమెజాన్‌, హాట్‌స్టార్‌లతో పాటు స్థానికంగా ఉన్న జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, బాలాజీ టెలీఫిల్మ్స్‌ వంటివి కూడా తమ కంటెంట్‌ను పెంచుకుంటూ నెట్‌ఫ్లిక్స్‌కు సవాలు విసురుతున్నాయి. సినిమాలు, ప్రత్యేకమైన టీవీ కంటెంట్‌తో పాటు 90కి పైగా లైవ్‌ ఛానళ్లను జీ అందిస్తోంది. చాలా తక్కువ రుసుముకు 12 భాషల్లో కంటెంట్‌ను అందిస్తోంది. 

భారతీ ఎయిర్‌టెల్‌ వినియోగదార్లకు పాక్షికంగా ఉచితంగా సేవలందిస్తోంది. ఇక బాలాజీ టెలీఫిల్మ్స్‌తో ఒప్పందం చేసుకుని సినిమా, టీవీ స్ట్రీమింగ్‌ వంటివి జియో అందిస్తోంది. మరో పక్క, యప్‌ టీవీ, హంగామా వంటివి కూడా తమ లైబ్రరీ, ఒరిజినల్‌ ప్రోగ్రామింగ్‌లను విస్తరిస్తూ మార్కెట్‌ వాటాను పెంచుకుంటున్నాయి.

ఈ నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్‌ రూ.199తో ప్రత్యేక మొబైల్‌ పథకాన్ని ప్రకటించింది. భారతీయుల కోసం తీసుకొచ్చిన ఈ పథకం కింద అపరిమితంగా ఎస్‌డీ కంటెంట్‌ను వీక్షించవచ్చు. మామూలుగా అయితే ఈ కంపెనీ సబ్‌స్క్రిప్షన్‌ రూ.500తో ప్రారంభమవుతోంది. కానీ ఆ ధరను తగ్గించక తప్పలేదు.

భారతీయులు ఇంకా కంటెంట్‌కు డబ్బులు చెల్లించేందుకు ఇష్టపడడం లేదని అందుకే తక్కువ ధరకు కంటెంట్‌ను ఇవ్వడానికి సిద్ధపడాల్సి వస్తోందని నెట్‌ఫ్లిక్స్‌ అంటోంది. బాలీవుడ్‌ సినిమాలకు చెల్లించడానికి మాత్రం సిద్ధపడతారు కాబట్టి.. ఆ దిశగా అడుగులు వేస్తోంది. కంటెంట్‌ పరంగా రాజీ పడకూడదని భావిస్తోంది. 

వాటిపై ఎంత పెట్టుబడులు పెడుతున్నదీ నెట్ ఫ్లిక్స్ బయటకు చెప్పకున్నా.. అయిదు భారీ సిరీస్‌లను ప్రకటించింది. ఇందులో షారుక్‌ ఖాన్‌, అనుష్క శర్మలు ప్రొడ్యూసర్లుగా ఉన్న రెండు సిరీస్‌లు కూడా ఉన్నాయి.
 

click me!