‘ఐఫోన్’లకు బూస్ట్: ఆపిల్ చేతికి ఇంటెల్‌ ‘స్మార్ట్’ మోడెం

By Siva KodatiFirst Published Jul 27, 2019, 7:30 PM IST
Highlights

ఇక నుంచి మోడెం హార్డ్‌వేర్ కోసం ‘క్వాల్‌కామ్’పై ఆధారపడే సమస్య ఆపిల్ సంస్థకు తప్పింది. టెక్ దిగ్గజం ‘ఇంటెల్’ స్మార్ట్ ఫోన్ల మోడెం విభాగాన్ని ఆపిల్ టేకోవర్ చేసుకున్నది.

టెక్ దిగ్గజం ఆపిల్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న‌ది. త‌న 5జీ ఐఫోన్ల కోసం కొత్త ఒప్పందాన్ని కుద‌ర్చుకోనున్న‌ది. ఇంటెల్ సంస్థ‌తో యాపిల్ వంద కోట్ల డాల‌ర్ల ఒప్పందం చేసుకోనున్నది. ఈ మేరకు ఇంటెల్ స్మార్ట్ ఫోన్ల ‘మోడెం’ విభాగం ఆపిల్ సొంతం కానున్నది. 

ఇంటెల్ - ఆపిల్ సంస్థల మధ్య ఒప్పందం ప్రకారం ఇంటెల్ సంస్థలో పని చేస్తున్న 2,200 మంది ఉద్యోగులు ‘ఆపిల్’లో చేరతారు. ఇంటెల్ నుంచి ఐపీ, ఎక్విప్మెంట్ విభాగాలను ఆపిల్ స్వాధీనం చేసుకోనున్నది. 

ఈ రెండు సంస్థల మధ్య ఈ ఒప్పంద లావాదేవీలు ఈ ఏడాది చివరిలోగా పూర్తవుతాయి. ఈ వార్త వెల్లడి కావడంతో ఇంటెల్ షేర్ల విలువ భారీగా పెరిగింది. 

ఈ ఒప్పందం తర్వాత కూడా ఇంటెల్ నాన్ స్మార్ట్‌ఫోన్ అప్లికేష‌న్స్ కోసం మోడ‌మ్‌లు త‌యారు చేయ‌నున్న‌ది. ఇప్పటికీ పర్సనల్ కంప్యూటర్లు, ఇంటర్నెట్ ఆఫ్ థింక్స్ డివైజెస్ కోసం, ఫీచర్ ఫోన్ల కోసం మోడెంలను తయారు చేస్తూనే ఉంటుంది. 

ఇంటెల్ సీఈఓ బాబ్ స్వాన్ మాట్లాడుతూ తమ సంస్థ ఇతర 5జీ టెక్నాలజీల అభివ్రుద్ధిపైన ద్రుష్టిని కేంద్రీకరించిందన్నారు. ఇక ముందు తన సొంత 5జీ స్మార్ట్ ఫోన్ల కోసం ఆపిల్ ఉత్పత్తి చేస్తుంది.

ఇప్పటివరకు మోడెం హార్డ్ వేర్ కోసం క్వాల్ కామ్ సంస్థపై ఆపిల్ ఆధారపడుతూ వచ్చింది. ఇంటెల్ సంస్థలో స్మార్ట్ ఫోన్ల మోడెం తయారీ విభాగాన్ని స్వాధీనం చేసుకోవడంతో క్వాల్ కామ్ సంస్థపై ఆధారపడే పరిస్థితి యాపిల్ కు తగ్గిపోనున్నది. 
 

click me!